Friday, January 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌పై మరింత కేంద్రీకరణ!

ఇరాన్‌పై మరింత కేంద్రీకరణ!

- Advertisement -

ఇరాన్‌పై అమెరికా దాడి ముప్పు కొనసాగుతూనే ఉంది. ప్రపంచం ఊహించని రీతిలో వెనెజులా అధ్యక్షుడు మదురో దంపతులను కిడ్నాప్‌ చేసి తమ దేశానికి తీసుకుపోయిన ట్రంప్‌ గూండాగిరి అలాంటిదే మరోచర్య ద్వారా ప్రపంచంలో తమకు ఎదురులేదని చెప్పేందుకు, దేశాల నేతలను భయపెట్టేందుకు పూనుకుంది. ఆ ఊపుతోనే ఇరాన్‌పై కూడా కాలుదువ్వుతున్నది. అయితే ఇరాన్‌కు వెనెజులాకు పోలికే లేదన్నది తెలిసిందే. గతేడాది దాడిలో తన అణుస్థావరాలతో పాటు అగ్రనాయకత్వాన్ని కూడా రక్షించుకున్న ఇరాన్‌ ఆ తర్వాత మరింత అప్రమత్తమైంది, వెనెజులా పరిణామాల తర్వాత ఇంకా జాగ్రత్త పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అబ్రహాం లింకన్‌ విమాన వాహక నౌకతో సహా అనేక యుద్ధ నౌకలు, వేలాదిమంది సిబ్బందిని ఇరాన్‌ సమీపానికి వాషింగ్టన్‌ తరలిస్తున్నది. బుధవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బెదిరింపులకు దిగాడు. సమయం మించిపోతున్నది, అణు ఒప్పందం చేసుకోవాలని, లేకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నాడు.

గతేడాది జరిపిన ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌ దాడి కంటే ఈసారి తీవ్రంగా ఉంటుందని, అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని పేర్కొన్నాడు. అయితే దాడుల గురించి తమ నేత మనసులోని మాటను ఇంకా బయటపెట్టలేదని అధ్యక్ష భవనవర్గాలు చెప్పటం ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడగా చెబుతున్నారు. ఇరాన్‌పై మిలిటరీ దాడులకు తాము వ్యతిరేకమని చైనా పేర్కొన్నది. గతేడాది దాడిలో ఇరాన్‌ అణ్వస్త్రాలకు అవసరమైన యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా గొప్పలు చెప్పుకున్నప్పటికీ అలాంటిదేమీ లేదని తర్వాత వెల్లడైన సంగతి తెలిసిందే. చర్చలకు తాము వ్యతిరేకం కాదని అయితే తమ మీద అక్రమంగా దాడికి దిగితే తాము కూడా దెబ్బకు దెబ్బతీసేందుకు తుపాకి ట్రిగ్గర్‌పై వేలుతో సిద్ధంగా ఉన్నట్లు టెహరాన్‌ ప్రకటించింది. వెనెజులాపై దాడికి ముందుకు కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాల సమీకరణ గావించిన సంగతి తెలిసిందే.

అయితే నికొలస్‌ మదురో ను కిడ్నాప్‌ చేసినంత సులభంగా ఇరాన్‌ అగ్రనేత ఖామైనీని పట్టుకోవటం గానీ, ఇరాన్‌పై దాడి చేయటం గానీ అంతతేలిక కాదన్నది స్పష్టం. అంతర్జాతీయ మధ్యవర్తులతో సంబంధాల్లో ఉన్నాం తప్ప అమెరికాకు తామేమీ చర్చల ప్రతిపాదనలను పంపలేదని, ప్రాధేయపడటం లేదని, గత కొద్దిరోజులుగా అమెరికా ప్రతినిధులతో ఎలాంటి మాటలు లేవని ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా దాడి జరిపితే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ఎందుకు పెట్టుకున్నాంరా బాబూ అన్నరీతిలో నష్టం కలిగించే రీతిలో ప్రత్యర్ధులను దెబ్బతీస్తామని మిలిటరీ అధికారులు చెప్పారు. ఈ చర్యలతో పాటు ఇరాన్‌-గల్ఫ్‌దేశాల మధ్య ఉన్న హార్ముజ్‌ జలసంధిలో చమురు రవాణా నౌకలను అడ్డుకుంటామని ఆ ప్రాంతంలోని దేశాలకు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళాల అధికారులు స్పష్టం చేశారు. ఇదే జరిగితే మరోసారి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది, ఈ నేపధ్యంలోనే ఇరాన్‌పై దాడి అనగానే ప్రపంచంలో అనేక దేశాలలో స్టాక్‌మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.

ఇరాన్‌ను రెచ్చగొట్టేందుకు ఐరోపా యూనియన్‌ నేతలు అమెరికాతో చేతులు కలుపుతున్నారు. మరికొన్ని ఆంక్షలతో పాటు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే అంశాన్ని పరిశీలించేందుకు గురువారం నాడు భేటీ జరిపారు. గతంలో వ్యతిరేకించిన ఫ్రాన్స్‌ తన వైఖరి మార్చుకొని మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్‌ ప్రస్తుతం చాలా బలహీనమైన స్థితిలో ఉందని, ఒప్పందం తమకు ఎంతో మేలు చేస్తుందని అమెరికా చెప్పుకుంటున్నది. గత కొన్నేళ్లుగా పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నది నిజమే అయినప్పటికీ శరణు వేటడానికి టెహరాన్‌ సిద్ధంగా లేదు.

ప్రభుత్వం గతం కంటే బలహీనంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు, మరోసారి జనం వీధులకు ఎక్కుతారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పాడు. దానంతట అదే కూలిపోయేస్థితి ఉందని చెబుతూనే దాడులకు ఎందుకు సన్నద్దమౌతున్నట్లు? అమెరికా వ్యవహారశైలిని చూసినపుడు నిజంగానే ఒకవేళ అణుఒప్పందానికి ఇరాన్‌ అంగీకరించినప్పటికీ గతంలో మాదిరి అమెరికా కట్టుబడి ఉంటుందన్న గ్యారంటీ లేదు. మరోసారి ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల్లో వాషింగ్టన్‌ జోక్యం చేసుకోదన్న నమ్మకం కూడా లేదు. మేకపిల్లను మింగదలచుకున్న తోడేలు ఏదో ఒక సాకుతో అపని చేస్తుంది, అందుకే ఇరాన్‌ తాడోపేడో తేల్చుకొనేందుకే సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -