కోల్ బెల్ట్ సమస్యలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మంత్రులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి భేటీ
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
కొత్త బొగ్గు బ్లాకులు సాధిస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని అంబేడ్కర్ సచివాలంలో సింగరేణి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని యాజమాన్యానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించగలిగే కొత్త బ్లాకులను సింగరేణి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా సింగరేణి ప్రణాళికలు రూపొందుకుని ముందుకు సాగాలని సూచించారు. పదేండ్లపాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం సింగరేణికి కొత్త బ్లాకులు సాధించడంలో విఫలమైందన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలను శాసన సభ్యులు భట్టి దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. ఇకపై ప్రతీ 15 రోజులకోసారి కోల్ బెల్ట్ శాసన సభ్యులు సమర్పించే విజ్ఞాపనలు, వాటిపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో సింగరేణి ప్రాంత కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరామ్ నాయక్, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, కోవా లక్ష్మీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పొట్రు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్త బొగ్గు బ్లాకులు సాధిస్తేనే సింగరేణికి మనుగడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



