పెరుగుతోన్న అనిశ్చితి
పరిశ్రమలు, వాణిజ్యానికి సవాళ్లు
ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ హెచ్చరిక
ఎరువుల ధరలు అమాంతం పెరుగుదల
ముంబయి : ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు రాబోయే దశాబ్దం అత్యంత సవాలుతో కూడుకున్నదని అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చితి స్థితిని ఎదుర్కొంటోందన్నారు. సోమవారం ముంబయిలో జరిగిన టెక్స్‌ప్రోసిల్ ఎక్స్‌పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న స్వదేశీ రక్షణవాదం, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు. పలు దేశాలు ఎక్కువగా నాన్ టారిఫ్ అడ్డంకులను, రక్షణవాద చర్యలను అవలంబిస్తున్నాయన్నారు. ఇది భారతదేశం వంటి ఎగుమతి దేశాలకు ప్రపంచవ్యాప్త పోటీని మరింత తీవ్రంగా, సంక్లిష్టంగా మారుస్తోందని మంత్రి అన్నారు.
వాతావరణ మార్పులు, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, ఎఐ వంటివి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయని మంత్రి చెప్పారు. అయినప్పటికీ సంక్షోభాలు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయన్నారు. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, ప్రపంచ సరఫరా విధానాల నుండి ప్రయోజనం పొందడానికి భారత్ అనుకూలమైన స్థితిలో ఉందన్నారు.
ఎఐ, ఆటోమేషన్లు ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తున్నాయన్నారు. అదే సమయంలో సాంకేతిక పురోగతులు వివిధ దేశాలలో కార్మిక వ్యయాలను స్థిరంగా తగ్గిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకుని నిలబడటానికి భారతీయ వస్త్ర ఎగుమతిదారులు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై పెద్ద ఎత్తున దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశ ఎగుమతులు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సీతారామన్ నొక్కి చెప్పారు. వృద్ధి అవకాశాలను సృష్టించడానికి, మారుతున్న ప్రపంచ డిమాండ్ విధానాలకు అనుగుణంగా పరిశ్రమలు తమను తాము మలచుకునేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు.
‘3ఎఫ్’లపై దృష్టి పెట్టాలి
పశ్చిమాసియా సంక్షోభం తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు ఊహించని విధంగా పెరిగాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా ఫ్యూయల్ (ఇంధనం), ఫెర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) (3ఎఫ్)ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె కోరారు.
సిడ్బీ 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా సంక్షోభం అనేది కేవలం దౌత్యపరమైన లేదా భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదన్నారు. ఇది సామాన్య ప్రజలపై, చిన్న వ్యాపారాలపై దీర్ఘ ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. ఇది భారతదేశంతో సహా పలు దేశాలకు సవాలుగా మారుతోందని పేర్కొన్నారు. ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడితో ప్రారంభమైన ఈ సంక్షోభం.. దాదాపు 80-90 రోజులుగా కొనసాగుతూ వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆమె చెప్పారు. గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిల్లో హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగాయని వివరించారు. బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయన్నారు. విలువైన లోహాలను కొనుగోలు చేయడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తరుణంలో ఇంధనం, ఎరువులు, ఫారెక్స్ లపై దృష్టి పెట్టడం చాలా కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఇన్ని అనిశ్చితులు చిన్న తరహా పరిశ్రమల వ్యాపార ప్రణాళికలకు సవాళ్లుగా మారుతున్నాయని ఆమె జోడించారు.
వచ్చే దశాబ్దం కఠిన కాలమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



