కూటమి పార్టీల పట్ల కాంగ్రెస్ శత్రు వైఖరి
ప్రతిపక్షాల ఐక్యత వల్లే
గత లోక్‌సభ ఎన్నికల్లో
బీజేపీకి ఎదురుదెబ్బ
బెంగాల్లో సీపీఐ(ఎం), వామపక్షాల పునరాగమనం
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ. బేబీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఇటీవల పెరుగుతున్న మితవాద శక్తులను వ్యతిరేకించడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మూడ్రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల అనంతరం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అనేక ఇతర ప్రతిపక్ష పార్టీల పట్ల శత్రు వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రచార దశలో కేరళంలో సీపీఐ(ఎం), బీజేపీల మధ్య అవగాహన ఉందన్న పచ్చి అబద్ధాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడితో సహా సీనియర్ నాయకులు ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వైఖరిని సీపీఐ(ఎం) ఖండిస్తోందని, సీపీఐ(ఎం) అనేది బీజేపీ, సంఘ్ పరివార్‌లతో నేరుగా తలపడుతున్న పార్టీ అని తెలిపారు. రాజకీయాలపై కొద్దిపాటి అవగాహన ఉన్నవారికి ఎవరికైనా ఇది అర్థమవుతుందననీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వ కంగా సీపీఐ(ఎం) నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిందని అన్నారు. బీజేపీతో పోరాడటంలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించగలదని, కానీ తాత్కాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ ఈ పెద్ద రాజకీయ కర్తవ్యాన్ని మరచిపోతోందని పేర్కొన్నారు. కొన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడతాయని, దీనిని స్నేహపూర్వక పోటీగా చూడటానికి బదులుగా, కాంగ్రెస్ పూర్తిగా దిగజారిన ప్రచారాలకు తెరలేపుతుందని విమర్శించా రు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్న గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని, బీజేపీకి వ్యతిరేకంగా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలలో ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. సుమారు నాలుగు వందల నియోజకవర్గాల్లో ఇది సాధ్యమవు తుందని ఎంఏ బేబీ పేర్కొన్నారు. బీజేపీ తొలిసారిగా బెంగాల్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. బీజేపీ, ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థలను ఒక్కొక్కటిగా తన నియంత్రణలోకి తీసుకుంటూ తన ప్రభావాన్ని విస్తరిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్వహించిన సర్… వల్ల బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో వారి విజయానికి దారితీసిందని, నియోజకవర్గాల పునర్విభజనతో అసోంలో అధికారాన్ని నిలబెట్టుకుందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూ కాశ్మీర్లో కూడా లాభాలు పొందిందని గుర్తు చేశారు.
బెంగాల్లో సీపీఐ(ఎం), వామపక్షాల పునరాగమనం
బెంగాల్లో సీపీఐ(ఎం), వామపక్షాలు పునరాగమన బాటలో ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవలి రీపోలింగ్ జరిగిన ఫల్తా ఎన్నికల ఫలితాలే సీపీఐ(ఎం), వామపక్షాలు పుంజుకుంటున్నాయనడానికి నిదర్శనమని తెలిపారు. తృణమూల్ నాలుగో స్థానానికి పరిమితమైన ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నలభై వేలకుపైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. బెంగాల్లో బీజేపీ, సంఘ్ పరివార్‌ల మతతత్వ ఎత్తుగడలను ఎదుర్కోవడంలో సీపీఐ(ఎం) ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయని, సీపీఐ(ఎం) యువ నాయకులు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. బిమన్ బసు వంటి సీనియర్ నాయకులు కూడా ఉత్సాహంగా ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఐదేండ్ల విరామం తరువాత బెంగాల్ అసెంబ్లీలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. అనేక నియోజకవర్గాల్లో వామపక్షాలు మంచి ప్రదర్శన కనబరిచాయని పేర్కొన్నారు. వామపక్ష కూటమి కూడా బలపడిందని, బెంగాల్లో త్వరలో వామపక్షాలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర చేపట్టనున్నాయని తెలిపారు.
కేరళంలో ఎన్నికల ఫలితాలపై పరిశీలన
తమిళనాడులో సీపీఐ(ఎం) రెండు సీట్లను గెలుచుకుందని, పుదుచ్చేరిలోని మాహే నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ప్రతినిధి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారని ఎంఎ.బేబీ అన్నారు. అసోంలో ఒక సిట్టింగ్ సీటును కోల్పోయిందని, అక్కడ బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరగడం ఒక ఎదురుదెబ్బ అని తెలిపారు. సీపీఐ(ఎం) సిట్టింగ్ సీటుగా ఉన్న సోర్బోగ్ నియోజకవర్గాన్ని పునర్వ్యవస్థీకరణతో బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. కేరళంలో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని, దీనిపై క్షుణ్ణమైన పరిశీలన జరుగుతోందని అన్నారు. ఈ ఎదురుదెబ్బకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి క్షేత్రస్థాయి నుంచి కమిటీలు సమావేశమవుతున్నాయని పేర్కొన్నారు. కేరళంలో ఐదు లక్షల పార్టీ సభ్యులు, నలభై వేల యూనిట్లు ఉన్నాయని, అన్ని యూనిట్లలో స్వేచ్ఛాయుత చర్చ జరుగుతుందని తెలిపారు. జూన్ 5 నుంచి 8 వరకు తిరువనంతపురంలో సమావేశమయ్యే రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ వివిధ యూనిట్లు లేవనెత్తిన అభిప్రాయాలను వివరంగా చర్చిస్తాయని అన్నారు. ఈ చర్చల ఆధారంగా, బలహీనతలను గుర్తించి, పార్టీ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
బెంగాల్లో రాజకీయ మార్పుల నేపథ్యంలో ప్రత్యేక ప్లీనం
బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో కూడా ఇదే విధమైన ప్రక్రియ జరుగుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. బెంగాల్లో, అన్ని పార్టీ యూనిట్లు సమావేశమై తమ అభిప్రాయాలను రాష్ట్ర కమిటీకి సమర్పిస్తాయని, జూన్ నెలాఖరులోగా సమీక్ష పూర్తవుతుందని తెలిపారు. బెంగాల్లో చోటుచేసుకున్న కొత్త రాజకీయ మార్పుల నేపథ్యంలో ప్రత్యేక ప్లీనం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చర్చలు పూర్తిచేశాక, జూన్ నెలాఖరులోగా పొలిట్ బ్యూరో సమావేశమవు తుందని తెలిపారు. కేంద్ర కమిటీ ముందు ఉంచేందుకు ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేస్తామని, సాధారణంగా, కేంద్ర కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమ వుతుందని, అయితే, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో, ఎన్నికల ఫలితాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు జులై మధ్యలోనే ప్రత్యేక కేంద్ర కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు. గుర్తించిన లోపాలకు సంబంధించిన దిద్దుబాటు చర్యలను పైనుంచి కింది వరకు తక్షణమే అమలు చేస్తామని ఆయన తెలిపారు.
లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



