ముంబయి : దేశంలోనే దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి రెండు వినూత్న పాలసీలను విడుదల చేసింది. భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీ ద్వారా భరోసా కల్పించేందుకు న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేరిట రెండు కొత్త జాయింట్ ప్లాన్లను ఆవిష్కరించింది. జూన్ 1 నుంచి అందుబాటులోకి రానున్న ఈ పాలసీలను తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు కాగా, కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇవి బీమా, పొదుపు మిళితమైన నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేట్ ప్లాన్లు. ఇందులో పాలసీ అమలులో ఉన్నంత కాలం ప్రతి వెయ్యి రూపాయల సమ్ అష్యూర్డ్‌కు ఏడాదికి రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ అదనంగా జమ అవుతుందని ఎల్‌ఐసి తెలిపింది. జీవన్ సాథీ సింగిల్ ప్రీమియంలో ఒకేసారి పూర్తి ప్రీమియం చెల్లించాలి. ఇందులో 35 ఏళ్ల భర్త, 32 ఏళ్ల భార్య కలిసి 20 ఏళ్ల టర్మ్‌తో రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీ తీసుకుంటే సుమారు రూ.8 లక్షల సింగిల్ ప్రీమియం అవుతుంది. పాలసీ కాలవ్యవధిలో భర్త మరణిస్తే రూ.10 లక్షల డెత్ బెనిఫిట్ భార్యకు అందుతుంది. పాలసీ మున్ముందుకు కొనసాగుతుంది. ఒకవేళ భార్య కూడా మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు గ్యారెంటీడ్ అడిషన్ కలిపి నామినీకి ఇస్తారు. ఒకవేళ ఇద్దరికీ ఎలాంటి రిస్క్ జరగకుండా 20 ఏళ్లు పూర్తయితే మెచ్యూరిటీ కింద బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ అడిషన్లు కలిపి మొత్తం రూ.24 లక్షలు చెల్లిస్తారు. మరో ప్లాన్ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియంలో పాలసీదారులు 5, 10, లేదా 15 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల పాలసీ టర్మ్, 10 ఏళ్ల ప్రీమియం చెల్లింపు కాలపరిమితితో రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారు రూ.1.30 లక్షలు అవుతుంది. ప్రీమియం చెల్లించే కాలంలో మొదటి వ్యక్తి మరణిస్తే డెత్ బెనిఫిట్ అందించడంతో పాటు మిగిలిన ప్రీమియంలు మాఫీ చేయబడతాయి. పాలసీ కొనసాగుతుంది. 20 సంవత్సరాల మెచ్యూరిటీ సమయానికి ఇద్దరూ క్షేమంగా ఉంటే సమ్ అష్యూర్డ్ రూ.10 లక్షలు, గ్యారెంటీ అడిషన్ రూ.18 లక్షలు కలిపి మొత్తం రూ.28 లక్షలు అందిస్తారు. ఈ రెండు ప్లాన్లలోనూ రుణ సదుపాయం, యాక్సిడెంటల్, క్రిటికల్ ఇల్‌నెస్ వంటి రైడర్లను జోడించుకునే అవకాశం ఉంది.
భార్యాభర్తలకు ఒకటే పాలసీ..
- Advertisement -
- Advertisement -



