ముందే ఎన్నికలంటున్న సర్కారు
కాదు..వీలినం తర్వాతేనని సంఘాలు
సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం
ఆందోళనలో కార్మికులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి రచ్చ ప్రారంభమైంది. సర్కారు, కార్మిక సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. 32 సమస్యలకుగాను మూడింటిని పరిష్కరించి మిగతావి ఆర్టీసీ ఉన్నతాధికారులతో తేల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం, మంత్రి, ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అభినందించి సన్మానం సైతం చేశారు . ఈ నేపథ్యంలో ఈడీల కమిటీ 13 కార్మిక సంఘాలతో ఇప్పటికే ఒక దఫా సమావేశమైంది. ఈ సందర్భంగా ఐదు సమస్యలు పరిష్కరించడానికి అంగీకరించారు. అయితే బుధవారం హైదరాబాద్ కూకట్‌పల్లి డిపో విద్యుత్ బస్సు(ఈవీ)ల పారంభోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వాఖ్యలు దుమారం రేపాయి. త్వరలోనే ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామనీ, ఆ తర్వాతే విలీన ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ మాటలు కార్మిక సంఘాలకు రుచించలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీతోపాటు ఇతర కార్మిక సంఘాలు కన్నెర్ర చేశాయి. ససేమిరా అన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులను కలిసి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. మాట మార్చొదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఎన్నికైన సంఘంతోనే సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం గానీ, సర్కారు గానీ చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. అయితే విలీనం తర్వాత ఎన్నికలు జరపాలా ? లేక ముందా ? అనే ఒక పీఠముడి పడింది. కాగా కార్మిక సంఘాలు మాత్రం విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలకు పోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. విలీన ప్రక్రియను పూర్తిచేయడానికి ఏర్పాటయ్యే కమిటీలో అన్నీ కార్మిక సంఘాలకు చోటివ్వాలని ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు తోపాటు ఆర్టీసీ యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కామన్ డిమాండ్లపై సంఘాలతో నేతలతో చర్చించిన ఆర్టీసీ ఈడీల కమిటీ మరో దఫా బేటీ కావాలని నిర్ణయించింది. ఈలోపే సర్కారుకు, కార్మిక సంఘాలకు మధ్య అనూహ్యా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 32 సమస్యల్లో పీఆర్సీ, విలీనం, గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి సర్కారు పరిష్కరించింది. ఈడీ ల కమిటీ మరో ఐదింటిని సెటిల్ చేయడానికి అంగీకరించింది. మొత్తం ఎనిమిది సమస్యలు కొలిక్కి రాగా మరో 24 సమస్యలు చర్చల దశలోనే ఉన్నాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఒకింత అసహానం వ్యక్తమవుతున్నది. సర్కారు పరిష్కరించిన మూడింటిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదాస్పదం కావడం గమనార్హం. ఈ పరిణామం ఎటు దారితీస్తుందోననే భయాందోళనలు ఇటు సర్కారు, ఆర్టీసీతోపాటు అటు కార్మికుల్లో కనిపిస్తున్నది.
ఆర్టీసీలో మళ్లీ పీఠముడి
- Advertisement -
- Advertisement -



