Thursday, June 4, 2026
E-PAPER
Homeక్రైమ్ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు

ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు

- Advertisement -

– కండక్టర్ పోస్టులు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.35 వేలు వసూలు 
– 70 మందికి పైగా బాధితుల ఆవేదన 
– బ్రోకర్లపై చర్యలు కోరుతున్న యువకులు
నవతెలంగాణ – నాచారం

ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువత నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు బ్రోకర్లుగా వ్యవహరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం.. కవిత, ప్రవీణ్, శేఖర్ తదితరులు ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు ఖాయం చేస్తామని హామీ ఇచ్చి ఒక్కొక్కరి నుంచి రూ.35 వేల చొప్పున డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో తమకు పలుకుబడి ఉందని, త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు.

ఈ విధంగా సుమారు 70 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు సేకరించినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో పాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి అప్పులు తెచ్చి డబ్బులు చెల్లించిన వారు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -