దళితుల భారీ ఆందోళన
సుందరీకరణ పేరిట 450 పూర్వీకుల సమాధుల ధ్వంసంపై ఆగ్రహం
అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని బాధితుల డిమాండ్
నవతెలంగాణ-నయీంనగర్
హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌లోని ఊర చెరువు వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చెరువు సుందరీకరణ, మరమ్మతుల పేరుతో అధికారులు దళితుల పూర్వీకుల సమాధు లను (గోరీలను) ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ దళిత, గిరిజన, బీసీ సామాజిక తరగతులకు చెందిన ప్రజలు వందలాదిగా తరలివచ్చి పనులను అడ్డుకు న్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను నిలిపివేసి, చెరువు కట్టపైనే బైటాయించి ఆందోళనకు దిగారు. చనిపోయిన తమ పెద్దల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారంటూ దళిత మహిళలు కన్నీరుమున్నీ రవుతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. గత వందేండ్లుగా సుమారు మూడు ఎకరాల స్థలాన్ని తాము శ్మశానవాటికగా వాడుకుంటుంటే.. మున్సి పల్, ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కలిసి నామ రూపాలు లేకుండా చేస్తోందని ఆరోపించారు.
ఇప్పటికే దాదాపు 450 గోరీలపై ఇష్టారాజ్యంగా మట్టి పోసి పూడ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల బొందలగడ్డను ధ్వంసం చేస్తున్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుందరీకరణ ముసుగులో రాత్రి వేళల్లో అక్రమ మొరం దందా సాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న డ్రాప్ వాల్ కాకుండా కట్ట కింది భాగం నుంచి రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. చెరువు శిఖం పేరుతో గుడిసెలు తొలగించిన పేద బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. జిల్లా ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ఆందోళనలో దళిత, బహుజన నాయకులు, బాధితులు ఇమ్మడి రమేష్, రాజు, రాధిక, రమేష్, సబిత, రమా, పద్మ, మమత తదితరులు పాల్గొన్నారు.



