నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు చాలా శక్తిమంతమైనవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు సెంట్ కామ్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దాడుల తర్వాత దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, క్వెష్మ్ ద్వీపం, సిరిక్, జాస్క్ కౌంటీలలో భారీ పేలుళ్లు సంభవించాయని, ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసిందని స్థానిక మీడియా తెలిపింది. అమెరికా ఫైటర్ జెట్లు ఈ ప్రాంతాలపై దాడులు చేసినట్లు సమాచారం.
అంతకుముందు, హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ ఆరోపించారు. హెలికాప్టర్ కూలిపోయినా, అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా ప్రతిస్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.



