Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రకటనను సిఎం ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రకటనను సిఎం ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, వాటిని కేవలం 4వేలకు కుదిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో చేసిన ప్రకటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేసింది.

విద్యార్థుల ఆవాసాలకు సమీపంలోనే పాఠశాల అందుబాటులో ఉండాలని, ఈబాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని విద్యా హక్కు చట్టం-2009లో ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చారు. కానీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు గ్రామీణ, పేద, దళిత, గిరిజన పిల్లల ప్రాథమిక విద్యా హక్కును కాలరాసే విధంగా వున్నది. దశాబ్దాలుగా తండాలు, గూడాలు, పల్లెల్లో నడుస్తున్న బడులను మూసివేస్తే డ్రాపౌట్ రేటు పెరిగి, విద్యకు దూరమౌతారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులే వుండాలి.
అధికారంలోకి రాకముందు ప్రతి గ్రామంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని, ఏ ఒక్క పాఠశాలనూ మూసివేయబోమని, బడ్జెట్లో విద్యకు 15 శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కుతున్నది. బడ్జెట్లో కనీసం 8.2 శాతం కూడా కేటాయించడంలేదు. బడులలో మౌలిక వసతులు లేవు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రస్తుతం ఏకంగా పాఠశాలలనే మూసివేసే ఆలోచనకు పూనుకుని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే చర్యలకు పాల్పడుతున్నది. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల వుండే విధంగా ప్రజలకు నమ్మకం కల్గించి, ఎన్రోల్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -