Tuesday, June 16, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘ఒకే యునిఫామ్‌’ అందేనా?

‘ఒకే యునిఫామ్‌’ అందేనా?

- Advertisement -

జూన్‌ 15‌న రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఒకే రాష్ట్రం–ఒకే యూనిఫామ్’ విధానం, 21 వస్తువులతో కూడిన ప్రత్యేక విద్యార్థి కిట్‌పై ఆశలు నెలకొన్నాయి. విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందించడం, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం దీని లక్ష్యం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే పుస్తకాలను పాఠశాలలకు చేరవేసింది. అయితే అదే ప్రాధాన్యత, అదే వేగం యూనిఫామ్ లు కిట్ల పంపిణీలో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు విద్యావర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందించడంతో పాటు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒకే యూనిఫామ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పాఠశాలల వారీగా ఉన్న భిన్న రంగుల యూనిఫామ్‌‌ల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురాగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని ఒకేచోట అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కిట్‌ను ప్రకటించింది. మూడు జతల యూనిఫామ్ వస్త్రాలు, షూస్, సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జ్యామెట్రీ బాక్స్, డిక్షనరీ తదితరంగా మొత్తం 21 వస్తువులు ఇందులో ఉండనున్నాయి. ఈ కిట్ అమలైతే పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. విద్యార్థులు కూడా అవసరమైన సామగ్రి కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

గతంలో విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే యూనిఫామ్ లు పంపిణీ పూర్తయ్యేది. విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని కొత్త యూనిఫామ్‌తో ప్రారంభించే అవకాశం ఉండేది. ఈసారి మాత్రం పాఠశాలల ప్రారంభం సమీపించినా యూనిఫామ్‌‌లు, కిట్ల పంపిణీపై స్పష్టత కనిపించడం లేదు. విద్యార్థుల కొలతల సేకరణ పూర్తయిన ప్పటికీ వస్త్రాల సరఫరా, కుట్టింపు, కిట్ల తయారీ, పంపిణీ ప్రక్రియలు ఎంతవరకు వచ్చాయన్న దానిపై అధికారిక సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, బ్యాగ్, షూస్, స్టేషనరీ వంటి వస్తువులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందితేనే వాటి ప్రయోజనం ఉంటుంది. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత నెలలు గడిచాక అందితే పథకం లక్ష్యం కొంత మేర నెరవేరినా, ఆశించిన ఫలితం మాత్రం దక్కదు. అంతేకాదు, ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల్లో కూడా అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది మళ్లీ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడితే, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యానికే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పం ప్రశంస నీయమే. అయితే సంకల్పానికి సార్థకత చేకూర్చేది సకాలంలో అమలే. ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే కార్యక్రమాల్లో ఆలస్యం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. అందుకే యూని ఫామ్‌‌లు, ప్రత్యేక కిట్ల పంపిణీని ప్రభుత్వం అత్యవసర అంశంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థుల చేతిలో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్లు, కిట్లు కూడా ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి, పంపిణీ ప్రక్రియకు స్పష్టమైన గడువు ప్రకటించి అమలు చేయాలి. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులు చేసిన కృషికి, తల్లిదండ్రులు ఉంచిన నమ్మకానికి, విద్యా ర్థులు పెట్టుకున్న ఆశలకు తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రభు త్వం ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేయా ల్సిందే. ‘ఒకే యూనిఫామ్–21 వస్తువుల కిట్’ కేవలం ప్రకటనగా మిగలకుండా, విద్యార్థుల చేతుల్లోకి చేరినప్పుడే ప్రభుత్వ సంకల్పానికి నిజమైన అర్థం వస్తుంది. అందుకే ప్రభుత్వం ఆలస్యం లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి యూనిఫామ్లు, కిట్ల పంపిణీని పూర్తి చేయాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

గడగోజు రవీంద్రాచారి,
9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -