అభ్యుదయ స్వభావం కలిగిన ఉదార వాదులు, సోషల్ డెమోక్రాట్లు చాలా మంది పెట్టుబడిదారీ విధానాన్ని మరింత మానవీయ స్వభావం కలిగివుండేలా ”సంస్కరించ” వచ్చునని నమ్ముతారు. అలా సంస్కరించడానికి కావలసిన రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్యయుత రాజకీయాల ద్వారా ఎన్నికలలో పొందవచ్చునని విశ్వసిస్తారు. అలా సంస్కరించిన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యవస్థీకృత పద్ధతుల ద్వారా కట్టుదిట్టం చేసి ఎల్లకాలమూ కొనసాగేట్టు చేయవచ్చునని వారను కుంటారు. అందుచేత సోషలిజం కోసం పోరాటం చేయవలసిన అవసరం ఏమాత్రమూ లేదని వారంటారు.
ఈ విధమైన విశ్వాసానికి సైద్ధాంతిక భూమికను ఏర్పరచినవాడు జె.ఎం.కీన్స్ (ఈయన కూడా కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోని సంస్కరణవాద మేథో వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాడే). అంతవరకూ ‘ఉదారవాదం’ అంటే ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం కల్పించుకోకుండా ఉండడం అన్న అర్ధం ఉండేది. కీన్స్ ‘నయా ఉదారవాదం’ అన్న పదాన్ని కొత్తగా కల్పించాడు. అంతకు పూర్వపు ‘ఉదార వాదం’లో మాదిరిగా కాకుండా రాజ్యం శక్తివంతంగా మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం అన్నది ఇక్కడ కీన్స్ కొత్తగా తోడు చేసిన ‘నయా’ అన్న దాని అర్ధం. రాజ్యం జోక్యం చేసు కోవడం ద్వారా దాదాపు అందరికీ ఉపాధిని కల్పించడం, ఆదాయాల పంపిణీలో సమన్యాయం మరింత ఎక్కువగా అమలు చేయడం జరగాలని అతడు చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఐరోపా ఖండంలో అనేక దేశాల్లో ఏర్పడిన సోషల్ డెమోక్రటిక్ ప్రభుత్వాలు కీన్స్ విధానాలనే తమ ఎజెండాగా స్వీకరించాయి. ఉపాధి అవకాశాలను బాగా పెంచి సంక్షేమ చర్యలను ఎక్కువగా అమలు చేసి ”మానవీయ రూపంలో పెట్టుబడిదారీ వ్యవస్థ”ను నిర్మించాలన్నది వాటి ఆలోచన.
కొద్ది సంవత్సరాలపాటు ఈ ప్రయోగం యుద్ధానంతర కాలంలో ఐరోపాలో అమలు జరిగింది. ఆ వెంటనే నయా ఉదారవాదం ఐరోపాను కమ్ముకుంది. ఉపాధి అవకాశాలను పెంచాలంటే రాజ్యం చేయవలసిన ఖర్చును పెంచాలి. అందుకు కావలసిన ధనాన్ని బడ్జెట్‌లో ద్రవ్యలోటును పెంచడం ద్వారా కాని, సంపన్నులపైన అదనంగా పన్నులను విధించడం ద్వారా కాని సమకూర్చుకోవాలి. కాని ఫైనాన్స్ పెట్టుబడి ఈ రెండింటినీ పూర్తిగా వ్యతిరేకించడంతో కీన్స్ సంక్షేమ విధానాలను కొనసాగించడం దాదాపు అసాధ్యం అయిపోయింది. ప్రవేశ పెట్టిన సంక్షేమ విధానాలను రద్దు చేసుకోవడమో లేక నీరుగార్చడమో చేయవలసి వచ్చింది. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా ఫ్రాంకాయిస్ మిట్టరాండ్ ఎన్నిక అయిన తర్వాత అనుభవం ఒక సరైన ఉదాహరణ. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మిట్టరాండ్ ఎన్నికయాడు. అ వెంటనే కీన్స్ విధానాలను అమలు చేయడానికి పూనుకున్నాడు. అయితే దాని పర్యవసానంగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరగలేదు సరికదా, దేశం నుండి ద్రవ్య పెట్టుబడి బైటకు తరలిపోయింది. ఫ్రెంచి కరెన్సీ ఫ్రాంక్ విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో పతనం అయ్యింది. దాంతో మిట్టరాండ్ తాను చేపట్టిన కీన్షియన్ విధానాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ”పెట్టుబడి దారుల విశ్వాసాన్ని చూరగొనడం కోసం” తాను ఆవిధంగా చేయవలసి వచ్చిందని మిట్టరాండ్ చెప్పకున్నాడు. కాని దాని అసలు అర్ధం ”కొద్దిమంది స్పెక్యులేటర్ల దురాశను సంతృప్తిపరచడం కోసం” అని గ్రహించాలి. అలా పెట్టుబడిదారీ వ్యవస్థను ”మెరుగు దిద్దడం కోసం” జోక్యం చేసుకోవలసిన రాజ్యం కాస్తా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చేతుల్లో బందీ అయి కూర్చుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆడించినట్టల్లా ఆడే పనిలో ఉంది. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థను మానవీయ లక్షణాలు కలిగివుండేట్టు ”సంస్కరించడం” అనేది ఒక పెద్ద మాయ అని స్పష్టమైంది. ఉదారవాదులు, సోషల్ డెమోక్రాట్లు పెట్టుకున్న ఆశలన్నీ వమ్మయ్యాయి.
ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థను రాజ్యం అదుపులో నడిపించడం అనే దృక్పథం కేవలం సంపన్న దేశాలకే పరిమితం కాలేదు. మూడవ ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇది వ్యక్తమైంది. దేశభక్తి యుతంగా ఉండే బూర్జువావర్గం (ఇది దళారీ బూర్జువా వర్గానికి పూర్తి భిన్నమైనది) గణనీయమైన బలం కలిగివున్న దేశాల్లో, అక్కడి జాతీయ విముక్తి పోరాటాల్లో అది భాగస్వామి అయ్యింది. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం అధికారం చేపట్టిన ప్రభుత్వాలు దేశాభివృద్ధి క్రమంలో ఈ పెట్టుబసా దారులకు కూడా పాత్ర ఉందని భావించాయి. మరోవైపు ఈ ప్రభుత్వాలు సోషలిస్టు స్వభావం కలిగిన ప్రభుత్వ రంగాన్ని నిర్మించే కృషిని కూడా చేపట్టాయి. ఇండియాను గనుక తీసుకుంటే ఇక్కడ అభివృద్ధి విధాన లక్ష్యం ”సోషలిస్టు తరహా సమాజాన్ని నిర్మించడం” అని చెప్పుకున్నారు. ఈ వ్యవస్థలోనే ఇంకా తన ఉనికిని కొనసాగిస్తున్న పెట్టుబడిదారీ శక్తులు ఈ లక్ష్యానికి లోబడి వ్యవహరిస్తూ, ప్రభుత్వ అజమాయిషీకి తలొగ్గుతూ, ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి తోడ్పడగలవని భావించారు.
అయినప్పటికీ, ఇప్పుడు ఇండియాలో గత వందేళ్ళ కాలంలోనూ ఎన్నడూ లేనంత స్థాయిలో ఆదాయాల అసమాన తలు పెరిగిపోయాయి. ఈ అసమానతలు ప్రపంచం లోని చాలా ఇతర దేశలలో ఉన్నదానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇంత వేగంగా ఈ అసమానతలు పెరగడం అనే క్రమం 1980 దశకం తర్వాత వేగం పుంజుకుంది. మనకు స్వతంత్రం వచ్చేనాటికి జాతీయాదాయంలో 12 శాతం ఒక్క శాతంగా ఉన్న సంపన్నులకు దక్కేది. 1982 నాటికి వాళ్ళ వాటా 6 శాతానికి తగ్గింది. కాని అక్కడి నుంచీ దిశ మారింది. 2022-23 నాటికి ఈ ఒక్క శాతం సంపన్నులకు జాతీయాదాయంలో ఏకంగా 22.6 శాతం దక్కుతోంది. ఈ మార్పు నయా ఉదారవాద విధానాల అమలు కాలంలో జరిగింది (ఈ గణాంకాలు ప్రపంచ అసమానతల గణాంకాల నుండి సేకరించినవి).
ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఏమిటి? రాజ్యం అదుపులో ఉంటూ, సంస్కరించబడి మానవీయ లక్షణాలతో పెట్టుబడిదారీ వ్యవస్థను నడిపించవచ్చునన్న దృక్పథం ‘మిధ్య’గా ఎందుకు మిగిలిపోయింది? అన్నదే ఆ ప్రశ్న. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో రాజ్యం మీద పెట్టుబడిదారీ వర్గపు పెత్తనం అంతకు ముందే మళ్ళీ మొదలైంది. కాని మూడవ ప్రపంచ దేశాల్లో, రాజ్యం అదుపు అమలు జరుగుతున్న చోట్ల కూడా పెట్టుబడిదారీ వర్గం తనకు నచ్చినట్టు వ్యవహరించగలిగే శక్తిని సంతరించు కోవడం ఎలా సాధ్యమైంది? పెట్టుబడిదారీ విధానం స్వభావంలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. పెట్టుబడిదారీ విధానపు స్వభావాన్ని కీన్స్ సగమే అవగతం చేసుకున్నాడు. ఈ పెట్టుబడిదారీ విధానంలో ‘వ్యక్తులే’ (ఎవరికి వారుగా పెట్టుబడిదారులే) చాలా ‘హేతుబద్ధంగా’ నిర్ణయాలు తీసుకున్న ప్పటికీ, ఆ నిర్ణయాలన్నీ కలగలిపి ఒకే కాలంలో అమలు జరుగుతున్నప్పుడు వాటి ఫలితం ”హేతుబద్ధంగా” ఉండబోదని కీన్స్ స్పష్టంగానే చూశాడు. మరోలా చెప్పాలంటే ఈ పెట్టుబడిదారీ విధానం అరాచకంగా నడుస్తుందని కీన్స్ గుర్తించాడు. ఆ అరాచకాన్ని నియంత్రించడానికి రాజ్యం జోక్యం చేసుకోవడం అవసరమని భావించాడు.
అయితే పెట్టుబడిదారీ విధానానికి ఉన్న అవలక్షణం కేవలం ‘అరాచకం’ మాత్రమే కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు దోపిడీ స్వభావం ఉంది. దానితోబాటు నియంత్రణా రహితంగా, స్వయం-చలితంగా, సద్యోజనితంగా నడిచే విధానం ఇది. ఇందులో వ్యక్తులు వారి వారి ఇష్టాలను బట్టి కాక, వ్యవస్థలో నిబిడీకృతమైవున్న పోటీ కారణంగా దానికి తట్టుకుని నిలదొక్కుకునే విధంగా నడవవలసి వస్తుంది. ఈ వ్యక్తుల (పెట్టుబడి దారుల) చైతన్యంతో గాని, వారి కోరికలతోగాని నిమిత్తం లేకుండా ఈ వ్యవస్థ నడుస్తుంది. ఆ క్రమంలోనే అప్పటికప్పుడు పలు ధోరణులు తలెత్తుతూ వుంటాయి.
మార్క్స్ అటువంటి ధోరణులలో ఒకదాని గురించి చర్చించాడు. అదే ”కేంద్రీకృతం అయ్యే దిశగా పెట్టుబడి నడక”. అంటే కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి అంతకంతకూ పెద్ద పెద్ద మొత్తాల్లో ఒక్కో దగ్గర పోగుబడుతూ వుండడం. పెద్దగా చర్చ జరగని మరో లక్షణం కూడా పెట్టుబడిదారీ విధానానికి ఉంది. తన కదలికలకు ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి గాని, తప్పించుకు పోవడానికి గాని పెట్టుబడి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటుంది. ఇందుకోసం మార్కెట్ లోకి కొత్త ఉత్పత్తులను, కొత్త సాంకేతికతను ఎప్పటికప్పుడు ప్రవేశ పెట్టడానికి ప్రయత్ని స్తుంది. ఎవరు అందరికన్నా ముందు కొత్త ఉత్పత్తి విధానాలను ప్రవేశ పెడతారో వారు ప్రభుత్వ నియంత్రణల పరిమితులను అధిగమించే అవకాశాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎవరైతే కొత్త ఉత్పత్తులను మార్కెట్లో తక్కిన అందరికన్నా ముందు ప్రవేశ పెడతారో వారు తక్కినవారి కన్నా ఎక్కువ లాభాలను పొందగలుగుతారు.
పెట్టుబడి కేంద్రీకరణ కొనసాగే ఫలితంగా దాని పరిమాణం (సైజు) పెరిగిపోతూ వుంటుంది. సైజు పెరుగుతున్న కొద్దీ తన మీద అమలయ్యే నియంత్రణలను అధిగమించగల శక్తి పెరుగుతూ పోతుంది. చిన్న సైజులో ఉన్నప్పుడు రాజ్యం నియంత్రణకు లోబడి వ్యవహరించవలసి వుంటుంది. ఆ సైజు పెరుగుతున్న కొద్దీ రాజ్య నియంత్రణ చట్రాన్ని దాటిపోగలిగే శక్తి పెరుగుతూ పోతుంది. అంటే పెట్టుబడిని ఎల్లకాలమూ ఒకే విధంగా నియంత్రించగల శక్తి రాజ్యానికి ఉండదు. మొదట్లో రాజ్యం పెట్టుబడిని నియంత్రించ గలుగుతుంది కాని పెట్టుబడి కేంద్రీకరణ కొనసాగేకొద్దీ రాజ్య నియంత్రణా శక్తిని అది దెబ్బ తీస్తుంది. ఇదేదో ఊహాజనితంగా చెప్తున్న జోస్యం వంటిది కాదు. కీన్స్ విధానాలు దెబ్బ తినిపోయింది ఈ విధంగానే.
సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో కీన్స్ విధానాలను అమలు జరుపుతున్నప్పుడు మొదట్లో వారికి తాత్కాలికంగా చెల్లింపుల్లో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోడానికి తోడ్పాటు అవసరమైంది. ఇతర దేశాల నుండి స్వల్పకాలిక నిధులను (రుణాలను) వారు తీసుకున్నారు. మొదట్లో ఈ స్వల్పకాలిక రుణాలను ఇచ్చినవారు ఆ దేశ విధానాలలో జోక్యం చేసుకోలేదు. అందువలన సంక్షేమ పథకాలకు పెట్టే ఖర్చు కూడా తగ్గలేదు. ఉపాధి అవకాశాల కల్పన కూడా కొనసాగింది. కాని పెట్టుబడి క్రమంగా కేంద్రీకరణ జరుగుతూ, బడా ఆర్థిక సంస్థలు ఏర్పడి వాటి నుండి రుణాలు తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. పెన్షన్ ఫండ్స్ అటువంటివే. ఆ సంస్థలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే అది చాలా పెద్ద మొత్తాల్లో ఉంటుంది. దాని ప్రభావాన్ని దేశం తట్టుకోవడం కష్టం. అందుచేత ప్రభుత్వాలు ఆ బడా ఆర్థిక సంస్థలు ఆమో దించే విధానాలనే అమలు చేయవలసి వచ్చింది. ఆ విధంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం బలపడుతూ వస్తోంది.
ఇదేదో అనుకోకుండా జరిగిన పరిణామం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ స్వభావరీత్యానే ఇది జరుగుతోంది. ఒకానొక దేశం తనకు నచ్చిన విధంగా ఆర్థిక విధానాలను అమలు చేయవచ్చుననే పరిస్థితి కీన్స్ విధానాల అమలు ప్రారంభ సంవత్సరాలలో ఉండేది. కాని కాలక్రమంలో దేశాల స్వయం నిర్ణాయక శక్తి దెబ్బ తినిపోయింది.
పాఠ్యపుస్తకాల్లో బోధించినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థ తనపై రాజ్యం విధించే నియంత్రణలను బుద్ధిగా ఆమోదించి తదనుగుణంగా నడుచుకోవడం అనేది జరగదు. తనపై రాజ్యం విధించే నియంత్రణలను ఏదో విధంగా అతిక్రమించి పోవాలనే దాని స్వభావం అది కేంద్రీకృతం అవుతున్నకొద్దీ మరింత బలపడుతూనే వుంటుంది. అటువంటప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థను మానవీయంగా సంస్కరించి నియంత్రించి నడిపించ వచ్చును అనుకోవడం మిధ్య అవుతుంది. పైగా రాజ్యం విధించిన నియంత్రణలను ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తూ పోతున్న ప్రస్తుత తరుణంలో అటువంటి దృక్పథం ఏ మాత్రమూ పనికిరాదు.
ఇప్పుడు ప్రపంచంలో సోషల్ డెమాక్రసీ శక్తులు క్రమంగా నయా ఫాసిస్టు శక్తుల ముందు ఓడిపోతూ బలహీనపడడం వెనుక ఈ వాస్తవమే ఉంది. ఇప్పుడు సోషల్ డెమోక్రాట్లు ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం దాని సిద్ధాంతంలో తలెత్తిన సంక్షోభం నుంచే ఉత్పన్నమైంది. సోషల్ డెమోక్రసీ కీన్స్ విధానాలను నమ్ముకుంది. ఇప్పుడు ఆ విధానాలే ఆచరణలో ముందుకు సాగని స్థితి ఏర్పడింది. దాని రాజకీయ పర్యవసానం గానే సోషల్ డెమోక్రసీ బలహీనపడిపోతోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షేమ రాజ్యం అనే భావన ఇప్పుడు వొట్టి అభూత కల్పనగా మిగిలిపోయింది. సోషలిజానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ సోషలిజానికి పరివర్తన చెందే క్రమంలో కొన్ని చిన్న చిన్న పెట్టుబడిదారీ సంస్థలను అనుమతించవలసి వస్తే అప్పుడు రాజ్యం తగు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి కేంద్రీకరణ జరగకుండా నివారించే విధంగా వ్యవహరింగలగాలి. బడా పెట్టుబడులను పోగేసుకున్న ఆర్థిక సంస్థలను కచ్చితంగా నియంత్రించగలగాలి.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్
మానవీయ పెట్టుబడిదారీ విధానం-ఒక మిథ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



