నవతెలంగాణ-ఆలేరు టౌన్
యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్ యోగా శిక్షకులు బండి రాజుల శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలో గౌడ సంఘం ఫంక్షన్ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, 19వ,20, 21వ తేదీలు మూడు రోజులపాటు యోగా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆదివారం ముగింపు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రపంచ మానవాళికి శాంతిని చేకూర్చే దివ్యౌషధం యోగా మాత్రమే అని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, పరస్పర దాడులతో భయానక వాతావరణంలో, భయం గుప్పిట్లో సతమతమవుతోందని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగ సాధనకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రపంచానికంతటికి మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారతీయులమైన మనం తప్పనిసరి యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివేకానంద యోగ కేంద్రం, అంతర్జాతీయ ధ్యాన సంస్థ హార్ట్ పుల్నేస ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో
80 మంది శిక్షణా పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలేరు ఎన్సీసి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలేరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ సి సి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విద్యార్థులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి దాసరి మంజుల, ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్ మాట్లాడుతూ.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా మార్చే యోగ ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతో అవసరమని చెప్పారు.
మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుందని అన్నారు. యోగా మన సంస్కృతి అని, మన సంపద అని శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా ని నిత్యం ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా ఎన్ సి సి కాడెట్లతో యోగాసనాలు, ప్రాణాయామం ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేఘరాజు, ఎన్సీసి కాడెట్లు వరుణ్, సంజయ్, ఉమేష్, రేచల్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.



