మూసీ ప్రక్షాళనే నా జీవిత లక్ష్యం
నల్లగొండలో ‘ప్రజా పాలన- ప్రగతి పాలన’ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం..బీఆర్ఎస్, బీజేపీకి బహిరంగ సవాల్
రూ.1,306 కోట్లతో హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన
కనగల్ మండలంలో పైలాన్ ఆవిష్కరణ
నవతెలంగాణ–నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
‘నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ఎస్ఎల్బీసీ–డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మూసీ ప్రక్షాళనే నా జీవిత లక్ష్యం. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నాం’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కనగల్‌లో రూ.1,306 కోట్ల వ్యయంతో హ్యమ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో చేపట్టనున్న ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ సమీపంలో నల్లగొండ–దేవరకొండ ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన హ్యామ్ రోడ్డు ప్రాజెక్టు పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6092.37 కిలోమీటర్ల మేర 441 రహదారుల విస్తరణ అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం నల్లగొండ పట్టణంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. తర్వాత నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిపాలన’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మూసీ నది ప్రక్షాళనను తన జీవిత లక్ష్యంగా తీసుకొని అమలు చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నల్లగొండ జిల్లా త్యాగాలు చిరస్మరణీయమని తెలిపారు. తొలి ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, మలి ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలను కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య తదితర అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎప్పుడైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలన, బీజేపీ కేంద్ర పాలన, కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన, ఎన్నికల హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్, బీజేపీకి సవాల్ విసిరారు. గత ప్రభుత్వాలు ఇవ్వని లక్షలాది కొత్త రేషన్ కార్డులను తమ ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. సంవత్సరానికి రూ.16 వేల కోట్ల వ్యయంతో 3.28 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, ఒక్కో లబ్దిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు పేద కుటుంబాలకు మేలు చేస్తున్నాయని అన్నారు.
ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. రూ.69 వేల కోట్ల అప్పుతో ఉన్న రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి నెట్టారన్నారు. కట్టిన మూడు సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడం గత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఉద్యమ త్యాగాల పేరుతో కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు, అందుకే ప్రజలు వారిని తిరస్కరించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు.
రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు
రైతు రుణమాఫీ, రైతు భరోసా, పెట్టుబడి సాయం, బోనస్, వరి కొనుగోళ్లతో రైతులకు అండగా నిలిచామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 30 నెలల్లో రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవగా, అందులో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యతో పాటు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ గురుకులాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని అన్నారు.
మూసీ ప్రక్షాళనే తమ జీవిత లక్ష్యం
మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు బాధపడుతున్నారని, అందుకే దాన్ని శుద్ధి చేసేందుకే తమ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు మేలు చేసే ఇలాంటి పథకాలను అడ్డుకోవడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారిందని, ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టంచేశారు. ఎస్సీ ఉపవర్గాల వర్గీకరణ, కులగణన వంటి చారిత్రక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. బలహీన వర్గాలకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కాగా, ముఖ్యమంత్రి పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం వల్ల కనగల్లు మండల మహిళా సర్పంచులకు ఎంట్రీ పాసులు మంజూరు కాక నిరాశతో వెనుదిరిగారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజ్మీరా లక్ష్మణ్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, బాలు నాయక్, ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కోటిరెడ్డి, మదర్‌డెయిరీ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎల్ బీసీ – డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



