చర్చలు పున:ప్రారంభించండి
దౌత్య, వాణిజ్య, ప్రజల రాకపోకలను పునరుద్ధరించండి
మోడీ–షెహబాజ్‌కు 117 మంది భారత్–పాక్ ప్రముఖుల
బహిరంగ లేఖ
న్యూఢిల్లీ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయిన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి, చర్చలు, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇరు దేశాలకు చెందిన 117 మంది ప్రముఖులు ఉమ్మడిగా విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాని మోడీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల వారు బహిరంగ లేఖ రాశారు. ఇరు దేశాలూ దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న వైరంతో కోట్లాది మంది యువత అవకాశాలు, అభివృద్ధి, సురక్షిత భవిష్యత్తును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ ఆధ్వర్యంలో విడుదలైన ఈ లేఖపై భారత్‌కు చెందిన 61 మంది, పాకిస్తాన్‌కు చెందిన 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. శత్రుత్వం కొనసాగించడం కంటే శాంతి, సహకారం, పరస్పర నమ్మకం పెంపొందించే చర్యలు చేపట్టాలని వారు కోరారు. భారత్ నుంచి ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఫరూక్ అబ్దుల్లా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మెహబూబా ముఫ్తీ, మనోజ్ ఝా, హుమాయున్ కబీర్ తదితరులు ఉన్నారు. పాక్ నుంచి ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరి, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ జహంగీర్ ఖాజీ, జాతీయ అసెంబ్లీ సభ్యుడు ఇస్ఫన్యార్ భండారా, అణు శాస్త్రవేత్త, రచయిత పర్వేజ్ హుడ్‌భాయ్ తదితరులు సంతకం చేశారు. ఇరు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని వారు కోరారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో హైకమిషనర్లను తిరిగి నియమించాలని పేర్కొన్నారు.
సాధారణ వీసా సేవలను పున:ప్రారంభించాలనీ, వాణిజ్య విమానాల కోసం గగనతలాన్ని తిరిగి తెరవాలని లేఖలో సూచించారు. కాగా భారత్ మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. ‘‘ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవు’’ అని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఇక అట్టారి–వాఘా భూసరిహద్దును వాణిజ్యం, ప్రయాణాల కోసం తిరిగి తెరవాలనీ, శ్రీనగర్–ముజఫరాబాద్ బస్సు సేవలను పునరుద్ధరించాలనీ, ఇతర సరిహద్దు అనుసంధాన కార్యక్రమాలను కూడా తిరిగి ప్రారంభించాలని వారు లేఖలో కోరారు. ‘‘భారత్, పాకిస్తాన్ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతును కలిగి ఉన్నాయి. ఇందులో అధిక శాతం యువతే. ఈ యువతకు శాంతి, అభివృద్ధి, అనుసంధానం, సహకారంతో కూడిన భవిష్యత్తు లభించాలి. అనుమానాలు, ఘర్షణలు, వైరం వారి భవిష్యత్తును నిర్ణయించకూడదు’’ అని పేర్కొన్నారు. ‘‘దశాబ్దాలుగా కొనసాగుతున్న దూరం మన ఉమ్మడి సామర్థ్యాన్ని దెబ్బతీసింది. సామాజిక, ఆర్థిక, మానవీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. విభేదాల పరిష్కారానికి, స్థిరమైన, అభివృద్ధి చెందిన దక్షిణాసియాను నిర్మించడానికి నిరంతర సంభాషణ, చర్చలే ఏకైక మార్గం’’ అని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే జమ్మూకాశ్మీర్‌తో పాటు అన్ని పెండింగ్ అంశాలపై సమగ్ర ద్వైపాక్షిక చర్చలను పున:ప్రారంభించాలనీ, 2004–2007 మధ్య చర్చించిన రూపకల్పనను తిరిగి పరిశీలించాలని కోరారు. సైనిక ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు చేపట్టాలనీ, ఇరు దేశాల భద్రతా ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని సూచించారు.విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరవాలనీ, పాకిస్తాన్‌లోని నీలం లోయలో ఉన్న శారదా పీఠానికి యాత్రికులకు ప్రవేశం కల్పించాలని పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని మత, సాంస్కృతిక వారసత్వ క్షేత్రాలకు సులభ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని కూడా కోరారు. ‘‘సామాన్య ప్రజల ఆకాంక్షలను ఆలకించండి. దక్షిణాసియా భవిష్యత్తు విభజనలు, ఘర్షణలతో కాకుండా శాంతి, సుసంపన్నత, ఉమ్మడి ప్రగతితో నిర్మితమవ్వాలి’’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు. చివరగా ఈ లేఖ ఏ రాజకీయ వైఖరికి మద్దతు ఇవ్వడం కోసమో కాదనీ, దాదాపు 200 కోట్ల మంది ప్రజల సంక్షేమం, ఆకాంక్షలు, భవిష్యత్తు కోసమేనని 117 మంది ప్రముఖులు తమ ఉమ్మడి లేఖలో పేర్కొన్నారు.


