తెరపైకి
’ఒమన్ కారిడార్’
హార్ముజ్ నిబంధనలు తిరగరాసేందుకు అమెరికా ఎత్తుగడలు
వ్యూహాత్మక నియంత్రణను నిలుపుకోవాలని ఇరాన్ ప్రయత్నాలు
న్యూఢిల్లీ : హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన భౌగోళిక, రాజకీయ పోరుకు వేదికగా మారింది. ప్రపంచ సముద్ర చమురు వాణిజ్యంలో సుమారు ఐదో వంతు ఈ జలమార్గం మీదుగా జరుగుతోంది. కాబట్టి రవాణా మార్గాలలో అంతరాయాలు, మార్పులు చోటుచేసుకుంటే వాటి ప్రభావం కేవలం మధ్యప్రాచ్యం పైనే పడదు. అవి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, రవాణా ఖర్చులు, చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం హార్ముజ్‌లో సైనిక పరమైన ఉద్రిక్తతలు సడలిపోయాయి. దీంతో పోరు కొత్త దశలోకి ప్రవేశించింది. సంక్షోభ ప్రారంభ దినాలలో యుద్ధ నౌకలు, సైనిక కదలికలు, బలగాల మోహరింపు పైనే దృష్టి ఉండేది. ఇప్పుడు ప్రపంచ చమురు రవాణా మార్కెట్ విశ్వాసాన్ని పొందే విషయంపై దృష్టి కేంద్రీకృతమైంది.
ఎంచుకునే మార్గమే కీలకం
ఈ తాజా పోరులో బలమైన సైనిక శక్తి ఉన్న దేశమే విజేత కానక్కరలేదు. షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, సరకు యజమానులకు సురక్షితమైన, నమ్మదగిన, తక్కువ ప్రమాదకరమైన మార్గాన్ని సూచించే దేశమే విజేత అవుతుంది. ఈ నేపథ్యంలో సంక్షోభం అనంతరం రవాణా మార్గాలను ఎంచుకుంటున్న వాణిజ్య నౌకలు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవి మార్కెట్‌కు ఎలాంటి సంకేతం పంపుతున్నాయన్నదే ప్రధానంగా మారింది. తాజా పరిస్థితులలో ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు చెందిన ప్రధాన సంస్థలు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాయన్నదే ఇక్కడ ముఖ్యం.
అమెరికా ఎత్తుగడ
ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒమన్‌తో కలిసి హార్ముజ్ జలసంధి దక్షిణ భాగం మీదుగా నౌకలు ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు సృష్టించాలని అమెరికా ప్రయత్నించింది. ఇరాన్ తీర ప్రాంతానికి చేరువగా ఉన్న సంప్రదాయ రవాణా మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. అమెరికా సూచిస్తున్న మార్గంపై నౌకా రవాణా సంస్థలకు నమ్మకం కుదిరితే ఇరాన్ కీలక పాత్ర పోషిస్తున్న మార్గాలపై అంతర్జాతీయ మార్కెట్ ఆధారపడడం తగ్గుతుంది. తద్వారా హార్ముజ్‌లో ఇరాన్ భౌగోళిక, రాజకీయ పలుకుబడి బలహీనపడుతుంది. ఇరాన్ నిర్దేశించిన మార్గాలపై ఆధారపడకుండానే ప్రపంచ వాణిజ్యాన్ని కొనసాగించవచ్చునని రవాణా సంస్థలు అభిప్రాయపడేలా చేయడం అంతిమంగా అమెరికా ఉద్దేశం.
నూతన కారిడార్‌లో తగ్గిన నౌకాయానం
తాజాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఒమన్ కారిడార్’లో నౌకల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయని సముద్రయాన ట్రాకింగ్ డేటా చెబుతోంది. కొత్తలో వాణిజ్య నౌకలు ఈ మార్గం మీదుగా బాగానే ప్రయాణించాయి. అయితే ఇప్పుడు వాటి సంఖ్య బాగా పడిపోయింది. ఇప్పటికే స్థిరపడిన మార్గాలలో నౌకలు ప్రయాణిస్తున్నాయి. సాధారణంగా షిప్పింగ్ కంపెనీలు రాజకీయ ప్రకటనలను అంతగా పట్టించుకోవు. సురక్షిత మార్గంలో తక్కువ ఖర్చుతో ప్రయాణించడం పైనే అవి దృష్టి సారిస్తాయి. ఏవో ఒకటి రెండు నౌకలు ప్రత్యామ్నాయ మార్గం మీదుగా ప్రయాణించినంత మాత్రాన షిప్పింగ్ సంస్థలలో విశ్వాసం నెలకొనదు.
మారిన యుద్ధ రంగం
నౌకాయానంలో ఒమన్ పోషిస్తున్న పాత్ర ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ దేశం చాలా కాలంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవలి పరిణామాలను గమనిస్తే దాని పాత్ర అంతకుమించి ఉన్నట్లు కన్పిస్తోంది. ఏదేమైన ఒమన్ ఒక్కటే సముద్ర యానాన్ని నియంత్రించలేదు. అంతమ నిర్ణయం మార్కెట్‌దే అవుతుంది. హార్ముజ్‌లో పోటీ ఇప్పుడు కేవలం జలమార్గంపై నియంత్రణ గురించి మాత్రమే కాదు. ఇరాన్ నిర్దేశించిన మార్గాలపై ఆధారపడకుండానే ప్రపంచ వాణిజ్యాన్ని కొనసాగించవచ్చునని నిరూపించేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే తన ప్రమేయం లేకుండా జలసంధిలో దీర్ఘకాల స్థిరత్వం సాధించడం కష్టమని చాటిచెప్పాలని టెహ్రాన్ భావిస్తోంది. ఇప్పుడు యుద్ధ రంగం మారిపోయింది. అది యుద్ధ నౌకల నుంచి షిప్పింగ్ కంపెనీల కార్యాలయాలు, ప్రమాద అంచనా సంస్థలు, బీమా సంస్థల వరకూ విస్తరించింది.
అది
సాధ్యమేనా ?
అమెరికా సూచిస్తున్న కారిడార్ ఇరాన్ ఆధిపత్యానికి గండి కొడుతుందా అని ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఆ అవకాశమే లేదన్న సమాధానం వస్తుంది. వాస్తవానికి హార్ముజ్ విశాలమైన జలమార్గంగా కన్పించిన ప్పటికీ భారీ చమురు ట్యాంకర్లు తాము ఎంచుకున్న ప్రదేశం నుంచి సులభంగా ప్రయాణించలేవు. నీటి లోతు, అడుగున ఉన్న నిర్మాణాలు, ప్రవాహాలు, ట్రాఫిక్ విభజన వ్యవస్థలు, అంతర్జాతీయ భద్రతా నిబంధనలు వంటి అంశాలు నౌకాయానానికి అనువైన ప్రాంతాలను నిర్దిష్ట కారిడార్లకు మాత్రమే పరిమితం చేస్తాయి. కొత్త కారిడార్‌ను ఏర్పాటు చేయడం అనేది రాజకీయ ప్రకటనలు, సైనిక ఉనికికి సంబంధించిన విషయం కాదు. ప్రత్యామ్నాయ మార్గంలో భద్రతా పరమైన ఇబ్బందులు, అధిక ఖర్చులు, దీర్ఘకాలిక అనిశ్చితి ఉంటుందని షిప్పింగ్ కంపెనీలు భావిస్తే అగ్రరాజ్యం చెప్పినా సరే దానికి అంగీకరించవు.
పెత్తనం కోసం పాట్లు
- Advertisement -
- Advertisement -



