నవతెలంగాణ – ఆలేరు రూరల్
మరికొద్ది రోజుల్లో సాగునీటి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరిశీలించారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి పనులు, అలాగే రాజపేట మండలం కాల్వపల్లి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి పురోగతిని సమీక్షించారు. పనుల నాణ్యత, వేగం, సాంకేతిక ప్రమాణాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాల్వ ద్వారా వచ్చే సాగునీటిని కింది ప్రాంతాల పొలాలకు సమర్థవంతంగా మళ్లించే విధంగా సాంకేతిక చర్యలు చేపట్టాలని గుత్తేదారుకు స్పష్టమైన సూచనలు చేశారు. నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా,రైతులకు ఇబ్బందులు కలగకుండా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య తెలిపారు.



