Thursday, March 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినరహంతకులెవరు?

నరహంతకులెవరు?

- Advertisement -

అబ్బా! మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్‌ భీకరదాడులు, ఆ దేశ వృద్ధనేత ఖమేని మరణం. వందలాదిమంది మృతి. స్కూలు భవనంపై బాంబులు. పాపం పిల్లలు.. ప్రతిక్షణం ఇక భయం గుప్పెట్లో వారి ప్రాణాలు. ప్రధాని మోడీ వెళ్లి రాగానే ఇజ్రాయిల్‌ ఎందుకిలా బరితెగించింది? ”ఖమేనీ మరణించినట్టు మాకు సంకేతాలు వచ్చాయి. ఇదే శుభతరుణం. యువకులారా! ఇరాన్‌ పాలకపగ్గాలు మీరు చేపట్టండి..” – అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపు. మరి ఇది ఆ దేశ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కాదా? వారి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం కాదా..? మొన్న వెనిజులా.. ఇప్పుడు ఇరాన్‌.. ఏమిటా కండకావరం?

యుద్ధదాడులు చేయడానికి ఎన్నిసాకులు..?
‘ఇరాన్‌లో భయంకర ఉగ్రవాదం ఉంది. ఖమేనీ పాలకవర్గం అమెరికా, ఇజ్రాయిల్‌ను దెబ్బకొట్టేందుకు ఎన్నో ఏళ్లు గా కుతంత్రాలు చేస్తున్నది. మా ప్రజల రక్తం కళ్లజూసింది. ఇజ్రాయిల్‌ చావాలి.. అమెరికా చావాలి అంటూ గావుకేక వేసింది. ఇలాంటి నరహంతకుల వద్ద అణ్వాయుధాలు ఉండటం సమంజసం కాదు. అందుకే మేం బుద్ది చెప్పదలిచాం. మా యుద్ధం ఆ ఉగ్రపాలకులపైనే.. ఆ నిరంకుశ పాలనను అంతం చేయడమే మా లక్ష్యం.స్వేచ్ఛాయుత, శాంతియుత ఇరాన్‌ రక్షణే మా ధ్యేయం’ ట్రంప్‌తోపాటు, ఇజ్రాయిల్‌ నేత నెతన్యాహు ఉవాచ.

ఇపుడు అసలు నిరంకుశులు, నరహంతకులు ఎవరు?
ఇజ్రాయిల్‌ – గాజాపై గత రెండున్నర ఏండ్లుగా సాగుతున్న దాడుల్లో 72 వేల మంది పాలస్తీనీయులు బలైపోయారు. గాజా స్ట్రిప్‌ను పాలస్తీనా వాసులు ఖాళీ చేయాలని పదేపదే ఆదేశిస్తున్నది ట్రంప్‌ కాదా..? అసలు పాలస్తీనా ప్రజలను పూర్తిగా తుడిచిపెట్టాలని కోరుకుంటున్నది నెతన్యాహు కాదా? నెతన్యాహుకు, ట్రంప్‌కు, మోడీకి ఉమ్మడి శత్రువులు ముస్లింలా? మొత్తం ఆ జాతిని తుడిచిపెట్టేందుకే మళ్లీ యుద్ధం మొదలైందా? నరమేధం అంటే వారికి లెక్కలేదా? 2002లో గుజరాత్‌లో కూడా జరిగింది కదా? మరిప్పుడు ముస్లింలను సమూలంగా తొలగించడం సాధ్యయ్యేపనేనా? పశ్చిమాసియాలో చమురు బావులు అధికశాతం ముస్లిం దేశాల్లోనే ఉన్నాయే.

అవునూ.. ఇరాన్‌ నిజంగా ముస్లిం దేశమా..? ఇరాన్‌ అంటే ఆర్యస్థలి. ఆర్యులు అక్కడి నుండి వచ్చారని చెప్తున్నారే.. ఎవరు ఆర్యులు? ఎవరు ముస్లింలు? ఇద్దరూ ఒకటేనే..? ఏమో..? మతాలు పుట్టకముందు మానవులంతా ఒకటేకదా? అయినా మతం కన్నా అవసరాలు ముఖ్యం కదా.. చమురు లేకుండా బతకడం ఎట్లా? విమానాలు రద్దయితే ఎట్లా? రాకపోకలు, వ్యవహారాలు, చదువులు ఎట్లా? చర్చలతో యుద్ధాలు ఆపొచ్చుకదా? ఇరాన్‌ అణుశక్తిని పూర్తిగా నిలిపివేయాలని, క్షిపణుల సామర్థ్యం తగ్గించుకోవాలని, ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ట్రంప్‌, నెతన్యాహూ ఏకపక్షంగా ఎందుకు ఈ దాడులకు దిగారు? ఆలోచించాలి. అంటే వాళ్లు ఏదనుకుంటే అది చెప్తారన్నమాట. ఇతర దేశాల ప్రజలకు, ఆ దేశ సార్వభౌమత్వాలకు వీసమెత్తు విలువనివ్వరన్నమాట. వాళ్లాడిందే ఆట, పాడిందే పాట. అంతా పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతున్న చందంగా ఉంది కదూ.. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. అయితే ప్రజలు ఏఐ శకంలో క్షణక్షణం కళ్లు తెరుస్తున్నారు. దెబ్బకు దెయ్యాన్ని వదిలిస్తారు అన్న సత్యం గ్రహించకపోవటమే విడ్డూరం.

కె.శాంతారావు
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -