Thursday, March 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికుక్కలున్నాయి…పిక్కలు జాగ్రత్త!

కుక్కలున్నాయి…పిక్కలు జాగ్రత్త!

- Advertisement -

వీధుల్లో కుక్కల మందలు జనాలను వెంటాడి కరుస్తున్నాయి. అప్పుడప్పుడు ఆస్పత్రుల్లో పసికందులను చంపి తింటున్నాయి. ఇండియాలో కుక్కలను లెక్కించడానికి శాస్త్రీయ పద్ధతి లేదు. సంఖ్యను తక్కువచేసి సమస్యను చిన్నపరచాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. సర్కారు లెక్కల ప్రకారం 2025కు ఇండియాలో 6 కోట్ల, తెలంగాణలో 7.9 లక్షల, హైదరాబాదులో 4 లక్షల వీధి కుక్కలున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌లు వీధి కుక్కల సంఖ్యలో మొదటి స్థానాల్లో ఉన్నాయి. రోగనియంత్రణ జాతీయ కేంద్రం (నేషనల్‌ సెంటర్‌ ఫార్‌ డిసీజ్‌ కంట్రోల్‌) నివేదిక ప్రకారం 2025లో దేశం మొత్తమ్మీద 47,48,478 మంది కుక్కకాట్లకు గురయ్యారు.

2024లో తెలంగాణ లో 3.3 లక్షల మందిని, హైదరాబాదులో 21,131 మందిని కుక్కలు కరిచాయి. కుక్కకాట్లలో తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీలో నెల్లూరు, గుంటూరు జిల్లాలు, తెలంగాణలో హైదరాబాదు, మెదక్‌, జగిత్యాల జిల్లాలు ముందున్నాయి. కుక్కకాట్లు 2025, 2026ల్లో బాగా పెరిగాయి. పలు కారణాల వల్ల లెక్కకెక్కని కాట్లే ఎక్కువ. కుక్కలు జంతువులను, మనుషులను కాటేసినపుడు వెలువడే వైరస్‌తో రాబీస్‌, మూత్రంలోని బ్యాక్టీరియాతో లెప్టోస్పైరోసిస్‌, లాలాజలంలోని బ్యాక్టీరియాతో బ్రూసెలోసిస్‌, చర్మం, బచ్చుతో ఉబ్బసం, చర్మవ్యాధులు వస్తాయి. దేశంలో సగటున ఏడాదికి 5,700 రాబీస్‌ మరణాలు నమోదయ్యాయి.

కుక్కల వల్ల ట్రాఫిక్‌ అంతరాయంతో ప్రమాదాలు జరుగుతాయి. పర్యావరణం కాలుష్యమౌతుంది. అపరాత్రి కుక్కలు విచిత్రంగా దీర్ఘంగా మొరుగుతాయి. ప్రజలకు నిద్రాభంగం కలుగుతుంది. అలాగే పెంపుడు కుక్కలతో లాభం కూడా ఉంది. కుక్కలతో ఒంటరితనం పోతుంది. రక్షణ లభిస్తుంది. వాటిని బహి :ప్రదేశానికి తిప్పడంతో లభించే వ్యాయామంతో, కుక్కల క్రీడలతో కలిగే ఆనందంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుక్కలు వేటలో సాయపడతాయి. పశువుల మందలో తోడేళ్లు పడకుండా కాపాడుతాయి. గ్రహణశక్తితో పేలుడు సామగ్రిని, దొంగల ఆచూకీని గుర్తిస్తాయి. విదేశాల్లో అంధులు మనుషులకు బదులు కుక్కలను కాపలాకు, దారి చూపడానికి పెట్టుకుంటారు. ధృవ ప్రాంతాల కుక్కలు బండ్లనూ లాగుతాయి.

కుక్కల సంరక్షణ చట్టాలు
జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం-1960 ప్రకారం జంతువులకు తగిన ఆహారం, నీరు, నీడ, రక్షణ ఇవ్వాలి. వాటిని కొట్టరాదు, శిక్షించరాదు, వాటితో అధిక బరువులు మోయించరాదు, పందాలు ఆడరాదు. పశు సంక్షేమ సంస్థ (ఎడబ్ల్యుబి) దేశవ్యాప్తంగా పశుపక్ష్యాదుల సంరక్షణ, సంక్షేమాలను పర్యవేక్షిస్తుంది. పెంపుడు జంతువులకు, పక్షులకు ఆకలి, అసౌకర్యం, భయం, బాధల నుండి విముక్తి, సహజ ప్రవర్తనకు అవకాశం కల్పించనివారికి ఈ చట్టం ప్రకారం తొలితప్పుకు రూ.50ల జరిమానా/3 నెలల జైలు, మలి తప్పులకు రూ.100ల జరిమానా/మూడేళ్ల జైలుశిక్ష ఎడబ్ల్యుబి విధిస్తుంది. అయితే సాంస్కృతిక, శాస్త్రీయ, ఔషధ పరిశోధనలను జంతువులపై చేయవచ్చు. మనిషి ఆహారానికి చంపవచ్చు. సంతానోత్పత్తి నిరోధక, నపుంసకత్వ శస్త్రచికిత్సలు చేయవచ్చు, ముద్రలు, ముక్కుతాళ్లు వేయవచ్చు. అస్సాం లాంటి రాష్ట్రాల్లో కుక్కలను తింటారు. జాతీయ జంతువు, జాతీయ పక్షి, అంతరించిపోతున్న జాతుల జంతువులను, పక్షులను చంపరాదు.

సుప్రీంకోర్టు 07నవంబర్‌ 2025 న వీధికుక్కల విషయంలో ఒక ఆదేశమిచ్చింది. దాని ప్రకారం పాఠశాలలు, ఆస్పత్రులు, బస్‌, రైల్వేస్టేషన్ల వంటి సున్నిత ప్రాంతాల నుండి కుక్కలను తొలగించాలి. ప్రత్యేక ప్రాంతాలకు చేర్చి సంతానోత్పత్తి నిరోధ, సూక్ష్మజీవులను నిరోధించే, చంపే టీకాలను వేయాలి. ప్రతివార్డులో ప్రత్యేక ఆహార స్థలాలను ఏర్పరచాలి. ఈ పనులను 15 జనవరి 2026లోపు పూర్తిచేయాలి. వీటిని చేయకున్నా చేసినట్లు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ధ్రువపత్రాలనిచ్చాయి. మోసాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు కంటితుడుపు తప్పుడు లెక్కలని మందలించింది. వీధి కుక్కల కోసం మనం రోడ్లపైనే తిండి పడేస్తాము. ఆహార పదార్థాలను వ్యర్థాలుగా పారేస్తారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇండియాలో ఏడాదికి రూ.92 వేల కోట్ల విలువచేసే 7.8 కోట్ల టన్నుల ఆహారం, మనిషికి 55 కిలోల చొప్పున, పారేస్తున్నారు. వీటిని తినడానికి కుక్కలు గుమికూడతాయి.

శునకప్రేమికులు, కారుణ్య సంస్థలు కుక్కలపై చర్యలను వ్యతిరేకిస్తారు. ఈ కారుణ్యకారులు కొందరు తల్లిదండ్రులను, బంధువులను అశ్రద్ధచేస్తారు. ప్రకృతి సమతౌల్యానికి మత్స్యన్యాయం, పెద్ద చేపలు చిన్న చేపలను తినడం సహజం. పశుపక్ష్యాదుల కంటే మనుషులు ప్రధానం. ఉక్రెయిన్‌లో, గాజా, పాలస్తీనాలలో, మన దేశంలో ఇతర మతస్తులపై కుల మత జాతి వర్ణ లింగ వివక్షతలతో జరుగుతున్న హింసను, హత్యలను ముందుగా ఆపాలి. స్కాండినేవియన్‌ దేశాల్లో వీధి కుక్కలుండవు. అన్నీ పెంపుడు కుక్కలే. స్వీడెన్‌లో కుక్కలకు ప్రత్యేకవాకింగ్‌ పార్కులు ఉంటాయి. వాటిలో ఒకసారి ఒక కుక్కనే తిప్పాలి. రెండు కుక్కలు ఒకేసారి ప్రవేశిస్తే ఒకదాపై ఒకటి మొరిగి, కాట్లాడతాయని భయం. నెదర్లాండ్స్‌, జపాన్‌, థాయిలాండ్‌లలో పట్టుకో-నపుంసకంచేయి-టీకాలు వేయి-వదిలేయి (సి.ఎన్‌.వి.ఆర్‌.) కార్యక్రమాన్ని చేపడతారు. తప్పనిసరి నమోదుతో వీధికుక్కలను నివారిస్తారు. టర్కీలో కారుణ్యమరణ చట్టంతో కుక్కలను చంపవచ్చు.

కుక్కలెందుకు కరుస్తాయి?
వాతావరణంలో శీతోష్ణస్థితుల మార్పువల్ల కుక్కలు ఉద్రేకాలకు లోనవుతాయి. భయం, భ్రమలు, దెబ్బలు తగిలినపుడు బాధలు, స్వీయరక్షణ కారణాలతో స్వాభావిక గందరగోళానికి గురయి కుక్కలు వెంటబడతాయి, కాటేస్తాయి. తమ ఆహారాన్ని, ఇష్టమైన వస్తువులను, విరామ/నిద్రాస్థలాలను ఆగంతకులు ఆక్రమిస్తారని, తమ పిల్లలను తీసుకెళతారని అనుమానించి కుక్కలు పశువులను, మనుషులను కరుస్తాయి. పెంపుడు కుక్కలు మానసిక వత్తిడితో యాజమానులనే కాటేస్తాయి. దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. సామాజీకీకరణ, శిక్షణ ద్వారా పెంపుడు కుక్కల్లో ఉద్రిక్తతలను తగ్గించవచ్చు. వీధి కుక్కలకు జంతు జనన నియంత్రణ కేంద్రాలను, మానవ సంచారానికి దూరంగా ప్రత్యేక ఆహార వడ్డింపు స్థలాలను ఏర్పరచాలి. కుక్కలను చూసి పరుగెత్తరాదు.

నిలకడగా నుంచోవాలి.నెమ్మదిగా వెనక్కు జరగాలి. కర్రను, గొడుగును అడ్డుగా వాడాలి. జంతు జనన నియంత్రణ (కుక్కల) నియమాలు-2023 జన సమూహాల కుక్కలను ఆహార, నివాస హక్కులు గల సామూహిక జంతువులుగా పరిగణిస్తాయి. వాటి గుంపగుత్త నిర్మూలనను, స్థానభ్రంశాన్ని నిషేధించాయి. అయితే నివాసుల సంక్షేమ సంస్థలు ప్రత్యేక తీర్మానాలు చేసుకోవచ్చని, ప్రజలు ఫిర్యాదుచేసిన నాలుగు గంటల్లో కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల సమస్య పరిష్కారంలో పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. కారుణ్యసూత్రాలను పాటిస్తూనే మనుషులకు ప్రాధాన్యతనివ్వాలి. మానవత్వంతో మెలగాలి. పట్టనితనాన్ని వదలి సమస్యలను తీవ్రంగా పట్టించుకోవాలి. శాస్త్రీయ పరిష్కార ప్రయత్నాలు చేయాలి.

సంగిరెడ్డి హనుమంతరెడ్డి
9490204545

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -