మారిన స్వరూపం..
ఇప్పుడంతా ‘తెలుగు’ కనికట్టు!
గతంలో భాషా ఇబ్బందులు..
ఇప్పుడు ‘మనోళ్ల’తోనే మాయ
– ఢిల్లీ, గుజరాత్ కేంద్రాలుగా నెట్వర్క్..
లోకల్ ‘ఏజెంట్ల’ అండతో రూ. కోట్లు దోపిడీ
– ఆంక్షలు కాగితాలకే పరిమితం.. క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా దందా
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ దందా ‘అన్‌స్టాపబుల్’గా సాగుతోంది. ప్రభుత్వాలు నిషేదాజ్ఞలు జారీ చేస్తున్నామని, యాప్‌లను బ్లాక్ చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ విషవలయం రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఒకప్పుడు అడపాదడపా వినిపించే ఈ జూదం, ఇప్పుడు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ తిష్టవేసింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ బెట్టింగ్ పంట పండిస్తోంది. ఆతిథ్య దేశమైన భారత్ (125 ఆడ్స్తో) టోర్నమెంట్ గెలిచేందుకు బలమైన పోటీదారుగా ఉందని విశ్లేషణలు వెలువడుతుండటంతో బెట్టింగ్ మరింత తీవ్రమైంది. మొన్న వెస్టిండీస్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఇండియా గెలుపొందినప్పటి నుంచి అంచనాలు మరింతగా బలపడ్డాయి. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌తో పాటు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌పై ఊహకందని రీతిలో బెట్టింగ్ సాగుతోంది.
‘తెలుగు’ కనికట్టు.. భాషా అడ్డంకులు మాయం
గతంలో బెట్టింగ్ అంటే ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల వారికే పరిమితమనే భావన ఉండేది. ఒకవేళ మన దగ్గర ఎవరైనా ఆడినా.. డిపాజిట్లు లేదా విత్‌డ్రా సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడేవారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పట్టు లేకపోవడం వల్ల చాలామంది వెనకడుగు వేసేవారు. కానీ, ఇప్పుడు ఆ అడ్డంకిని మాఫియా తెలివిగా తొలగించేసింది. ఏకంగా ‘తెలుగు కస్టమర్ కేర్’ సేవలను రంగంలోకి దించి, మన యాసలో, మన భాషలోనే మాట్లాడుతూ యువతను నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు.. ”తమ్ముడూ.. ఏం పర్లేదు, మేమున్నాం” అంటూ భరోసా ఇచ్చి మరీ బెట్టింగ్ ముగ్గులోకి లాగుతున్నారు.
టెక్నాలజీతో పోలీసులకు ‘చెక్’.. మారుతున్న ఖాతాలు
సైబర్ పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఈ ముఠాలు ఒక అడుగు ముందే ఉంటున్నాయి. ఒకే బ్యాంక్ ఖాతాను నిరంతరం వాడితే ట్రాక్ అవుతామని గ్రహించి, వీరు నిత్యం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. డిపాజిట్ల కోసం ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త అకౌంట్లను మారుస్తున్నారు. కూలీలు, సామాన్యుల బ్యాంక్ ఖాతా లను అద్దెకు తీసుకుని, వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని సమాచారం. ఏదైనా అకౌంట్ సీజ్ అయినా, సెకన్ల వ్యవధిలో మరో అకౌంట్ యాప్‌లో ప్రత్యక్షమవుతోంది. ఈ గొలుసుకట్టు వ్యూహం పోలీసులకే పెద్ద సవాలుగా మారింది.
ఐపీఎల్ ముంగిట ఉక్కుపాదం పడాల్సిందే..!
ప్రభుత్వాలు యాప్‌లను బ్లాక్ చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పాత పద్ధతిలో సాగే ఆఫ్ లైన్ బెట్టింగ్‌లపై కూడా నిఘా కరువైందన్న విమర్శలు ఉన్నాయి. త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మాఫియా మరింతగా పడగ విప్పే అవకాశం ఉంది. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగాలు సమన్వయంతో వ్యవహరించి, ఈ ‘తెలుగు బెట్టింగ్ నెట్వర్క్’పై ఉక్కుపాదం మోపకపోతే వేల సంఖ్యలో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడక తప్పదు.
సోషల్ మీడియానే ఆయుధం వందల కొద్దీ యాప్‌లు!
గతంలో సెలబ్రిటీలతో ప్రచారం చేయించిన ఈ సంస్థలు, ఇప్పుడు వ్యూహం మార్చాయి. పోలీసులు సెలబ్రిటీలపై నిఘా పెట్టడంతో.. ఇప్పుడు నేరుగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులనే వేదికలుగా చేసుకుంటున్నారు. డేటా చోరీ ద్వారా వేల సంఖ్యలో సేకరించిన ఫోన్ నంబర్లకు ఆకర్షణీయమైన మెసేజ్‌లు పంపుతున్నారు. సాయి ఎక్స్ఛేంజ్, 99 ఎక్స్ఛేంజ్, మాస్టర్ భారు, రెడ్డి అన్న వంటి పేర్లతో వందల సంఖ్యలో నకిలీ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఢిల్లీ, గుజరాత్ నెట్వర్క్.. మనోళ్లే ఏజెంట్లు
ఈ భారీ నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు అంతా ఇతర రాష్ట్రాల వారే. ప్రధానంగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ ఆపరేషన్లు సాగుతున్నాయని సమాచారం. అయితే, ఈ మాఫియాకు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఉన్న ‘స్థానిక ఏజెంట్లు’ వెన్నెముకగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. వీరి అండతోనే ఇక్కడి సొమ్ము ఇతర రాష్ట్రాల ముఠాల చేతుల్లోకి యథేచ్ఛగా చేరుతోంది.



