Friday, March 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం

అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం

- Advertisement -

”పెట్టుబడిదారి వ్యవస్థ అంతులేని లాభాల కోసం ఆయుధాలను తయారుచేస్తుంది. వాటితో పాటు శవపేటికలు కూడా అమ్ముడు పోవాలని చూస్తుంది. అందులో కూడా లాభాలు గడించాలని యుద్ధాలను తెచ్చిపెడుతుంది” అంటాడు కార్ల్‌మార్క్స్‌. సామ్రాజ్యవాదుల రక్తపిపాస, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధజ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌ మీద దాడులు చేయడాన్ని చెప్పవచ్చు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. గంటగంటకూ పరిస్థితి మారిపోతుంది. యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ను నియంత్రించేందుకు ఇరాన్‌ ప్రతిఘటన దాడులు చేస్తోంది.

ఈ సందర్భంగా ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా గుర్తుకు వచ్చే కవిత- ”యుద్ధం ముగుస్తుంది. నాయకులు షేక్‌హాండ్స్‌ ఇచ్చుకుంటారు. నవ్వుతూ ఫొటోలు దిగుతారు. ఒక ముసలితల్లి అమరుడైన యుద్ధవీరుడి కోసం ఎదురుచూస్తుంది. ఒక వివాహిత తనభర్త కోసం ఎదురుచూస్తోంది. పిల్లలు వీర యోధుడైన తమ తండ్రి కోసం ఎదురుచుస్తారు. మన దేశాన్ని ఎవరు అమ్మారో నాకు తెలియదు. కానీ, దీని మూల్యం చెల్లించే వారిని మాత్రం నేను చూశాను” మహమ్మద్‌ డార్విస్‌ (పాలస్తీనా కవి) స్వప్నాలు చిద్రమై… బతుకులు అస్తవ్యస్తమై… శిథిలమై… రోడ్డున పడ్డ బాధితులు ఎందరో! ఇంత జరిగినా కూడా మానవాళికి ముప్పు తొలగిందా? అంటే లేదనే చెప్పాలి. సామ్రాజ్యవాదం బరితెగింపే దీనికి కారణం. వ్యక్తిగత లాభాపేక్షతో, యుద్ధాలను తెచ్చిపెట్టుకొని, ఎన్నో ఏళ్లుగా మానవుడు సాధించిన ప్రగతి,నాగరికతలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం.

అణుబూచిని కారణంగా చూపి అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమైనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, రక్షణ మంత్రి, మరో 44 మంది ఆర్మీ కీలక అధికారులు మరణించారు. ప్రతిగా ఆత్మ రక్షణలో భాగంగా ఇరాన్‌ అమెరికా, ఇజ్రాయిల్‌ పశ్చిమాసియాలోని సైనిక స్థావరాలపై భీకర దాడులు జరిపింది. దీంతో ప్రపంచమంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.శాంతి ఒప్పందాలు జరగని పక్షములో ప్రపంచం మరో పెనుముప్పును ఎదుర్కొక తప్పదు. ఇప్పటికే పచ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. అమాయక ప్రజలు ముఖ్యంగా పసిపిల్లలు ఈ యుద్ధంలో చనిపోతున్నారు. ఇప్పటివరకు ఈ రెండేళ్లలో ఇజ్రాయిల్‌ మధ్య ప్రాచ్యంలోని వివిధ దేశాలపై వేల సంఖ్యలో దాడులు చేసింది.

అమెరికా గత 132 సంవత్సరాలుగా ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ ‘వస్తాదు’గా తయారై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. భద్రత,స్వేచ్ఛ పేరుతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుని, ఆ దేశాలలో తమను వ్యతిరేకించే పాలకులను తొలగించడంతో పాటు, ఆ దేశాల్లో కల్లోలాలు సృష్టిస్తున్నది.2025లో వెనిజులా అధ్యక్షుడిని ఖైదు చేయటం వరకు అదే ధోరణి. అదే బలుపు. అదే ఆధిపత్యం. 1893లో హవాయిలో రాచరికాన్ని కూలదోయటం మొదలు 2023లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను పదవి నుండి తొలగించి, చంపటం, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, పాలస్తీనా పరిణామాలు మొత్తంగా అమెరికా ఇతర దేశాలలో సైనికు జోక్యం చేసుకున్న సందర్భాలు 150కి పైగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా కన్ను పశ్చిమాసియాపై పడింది. అక్కడ ఉన్న చమురు, ఇతర వనరులు దోచుకోవటం లక్ష్యంగా పెట్టుకొని, పశ్చిమ ఆసియాలో తన కీలుబొమ్మ దేశంగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించి, 1948లో ఇజ్రాయిల్‌ అనే ‘టెర్రరిస్ట్‌’ దేశాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుండి పశ్చిమ ఆసియాలో రక్తపాతం సృష్టిస్తున్నది. పాలస్తీనాలో జాతి హననానికి కూడా కారణమైంది. ఇది అమెరికా రక్తచరిత్ర. పశ్చిమాసియాలో ముడి చమురు,ఆయిల్‌, గ్యాస్‌ లాంటి ఖనిజ వనరులు కలిగి ఉండటం, మంచి రవాణా మార్గాలు ఉండటం కారణంగా, ఈ ప్రాంతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగింది. ఎగుమతి దిగుమతులకు, ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టుగా ఉంది. దీని ప్రాముఖ్యత రిత్యా అమెరికా తన రాజకీయ ఆర్థిక అవసరాలు తీర్చుకోవటం కోసం ఈ మారణకాండను సృష్టిస్తున్నది.

అమెరికా ప్రభుత్వం విదేశాలలో తనకు ఏమాత్రం అధికారం లేనిచోట తన అవసరాల కోసం, తనకు అనుకూల ప్రభుత్వాలను సృష్టించుకుని, పరాయి దేశాల మీద, ప్రభుత్వ నేతల మీద, ఆ దేశ ప్రజల మీద,ప్రజా సంస్కృతుల మీద దాడులు, యుద్ధాలు చేస్తోంది. అలాగే ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది. అసలు అమెరికా పాలకుల విదేశాంగ నీతే అది. ఇతర దేశాలు, ప్రాంతాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాలు తీర్చాలని అనుకునే విదేశాంగ నీతి అమెరికాది. ఇదంతా బహుళజాతి సంస్థల, సామ్రాజ్యవాదం రాజకీయ ప్రయోజనాలు కాపాడే వ్యూహం. ప్రపంచంలో మరేదేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు.

ప్రపంచంలోని వనరులు, సంపద మొత్తం అమెరికన్‌ బడా బాబులకు దక్కాలి. భూగోళం మీద ఏ మూలైన మనిషి నెత్తురు, చెమట సంపదగా మారి అది డాలర్‌గా వారి చెంతకు చేరాలనేదే అమెరికన్‌ కుటీల రాజనీతి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం మూడు శతాబ్దాలలో కూలిపోయింది ఏమోగానీ, ఎప్పటికీ కూలిపోని రవి అస్తమించని అమెరికన్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని నెలకొల్పి కాపాడాలి- అందుకోసం ప్రపంచం మీద ఎంత ఆకలిని, రోగాన్ని, దు:ఖాన్ని, అసమానతలను, దోపిడీని, పీడనను హింసను రుద్దినా అదంతా అమెరికా విదేశాంగ నీతి అవుతుంది. ఈ దుర్మార్గం కోసం అమెరికా పాలకులు ఎంతో ఖర్చు చేస్తారు. ఎంతో నీచమైన ఆయుధాల వ్యాపారం చేస్తారు. ఈ ఆయుధాలు అమ్ముకోవడం కోసం దేశాల మధ్య యుద్ధాలు సృష్టిస్తారు.

ఆయుధాల ఉత్పత్తి ఇక్కడ ప్రధాన పరిశ్రమ. అమెరికాను ఆయుధాల వ్యాపారులు శాసిస్తారు. అమెరికా నాటో కూటమి ద్వారా నిరంతరం యుద్ధాలు జరిగేటట్లు చేస్తారు. పేద ప్రజల రక్తంతో హోలీ ఆడుకుంటారు. ఇంత నీచమైన ఈ ప్రవృత్తి సామ్రాజ్యవాద సంస్కృతిది అని మనం గ్రహించాలి. నేడు పశ్చిమాసియాలో ప్రతి అంగుళం ప్రజల రక్తం,కన్నీరుతో తడిసింది. పాలస్తీనా ప్రజలు తమ మాతృభూమిలోనే నిర్వాసితులుగా మారి, జన్మభూమి విముక్తి కోసం పోరాడుతున్నారు ఈ పాపం అమెరికాదే. పాలస్తీనా జాతి హననం పట్ల ప్రపంచ పౌరసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న లెక్కచేయ కుండా రక్తపాతం సృష్టిస్తుంది. ఇంత విధ్వంసానికి కారణమైన సామ్రాజ్యవాదం నశించాలి. సోషలిస్టు పోరాటాలు విజయవంతమై, సోషలిస్ట్‌ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడటమే మానవాళి విముక్తికి మార్గం.

షేక్‌.కరిముల్లా
9705450705

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -