Saturday, March 7, 2026
E-PAPER
Homeఆటలుహెచ్‌సీఏలో క్విడ్‌ప్రోకో!

హెచ్‌సీఏలో క్విడ్‌ప్రోకో!

- Advertisement -

– విశాఖకు రూ.68.73 కోట్ల చెల్లింపుపై అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి
– సమగ్ర దర్యాప్తు కోరుతూ ఈడీ, ఏసీబీ, సీిఐడీకి ఫిర్యాదు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో అవినీతి పరాకాష్టకు చేరుకుందని, నీకిది.. నాకది ఫార్ములాతో గ్రామీణ క్రికెట్‌ అభివృద్దికి ఖర్చు చేయాల్సిన నిధులను మంత్రి వివేక్‌ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండిస్టీస్‌కు మళ్లించారని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్‌ (టీడీసీఏ) అధ్యక్షుడు, క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలపై అల్లీపురం స్పందించారు. ‘ఉప్పల్‌ స్టేడియం నిర్మాణం కోసం రూ.4.35 కోట్లు ఇచ్చిన వివేక్‌ కంపెనీ విశాఖ ఇండిస్టీస్‌.. అందుకు ప్రతిఫలంగా ఏండ్లుగా అన్ని రకాల ప్రయోజనాలు పొందింది. హెచ్‌సీఏలో అనుకూల వ్యక్తులు పదవిలో ఉండగా ఒప్పందం చేసుకుని.. ఇప్పుడు తన అనుచరులే పదవిలో ఉండగా కోట్లు కొల్లగొట్టారు. 2011లో ఒప్పందం రద్దు చేయగా.. ఆ తర్వాత వినోద్‌ రెండు పర్యాయాలు, వివేక్‌ ఓ పర్యాయం హెచ్‌సీఏ అధ్యక్షులుగా పని చేశారు. అయినా, విశాఖతో నెలకొన్న వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయలేదు. హెచ్‌సీఏ ప్రస్తుత ఆఫీస్‌ బేరర్లు వివేక్‌ అనుచరులు. క్విడ్‌ప్రోకోతో గుట్టు చప్పుడు కాకుండా నిధులు స్వాహా చేశారు. విశాఖ సంస్థ రాసిచ్చిన స్కిప్ట్‌ను ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడు అమర్‌నాథ్‌, సంయుక్త కార్యదర్శి బసవరాజు మీడియా ముందు చదివారు. అదే రోజు సాయంత్రం విశాఖ సంస్థ సైతం అదే ప్రెస్‌నోట్‌ను పాత్రికేయులకు పంపించింది. హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లు క్రికెట్‌ అభివృద్దికి కాకుండా మంత్రి వివేక్‌ కోసం పని చేస్తున్నారని’ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి మండిపడ్డారు. విశాఖ సంస్థకు చెల్లించిన రూ.68.73 కోట్లను వెనక్కి రప్పించి, గ్రామీణ క్రికెట్‌ అభివృద్ది ఖర్చు చేయాలి. హెచ్‌సీఏ ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఏసీబీ, సిఐడికి ఇప్పటికే ఫిర్యాదు చేశాం. బీసీసీఐ సైతం జోక్యం చేసుకుని హెచ్‌సీఏ గుర్తింపు రద్దు చేసి కొత్త అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలని అల్లీపురం డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -