Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేవాలయ భూములు ఆక్రమణ

దేవాలయ భూములు ఆక్రమణ

- Advertisement -

ఆలయ భూములపై రియల్‌ పంజా
వందల ఎకరాల భూమి మాయం
ఆలయ భూములంటూ
ట్రిబ్యూనల్‌ తేల్చినా..
స్వాధీనం చేసుకునేందుకు
అధికారులు వెనకడుగు
నవతెలంగాణ – నల్లగొండటౌన్‌

నల్లగొండ జిల్లాలో ఆలయ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. వాటితో వచ్చే కోట్ల సంపాదన రియల్టర్లకు, భూ కబ్జాదారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కండ్ల ఎదుటే వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఉన్న 2వేలకు పైగా ఉన్న ఆలయాలకు సంబంధించి 7000 ఎకరాలు సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 2800 ఎకరాల భూములను మాత్రమే లీజుకి ఇచ్చారు. మిగిలిన భూములు ఆక్రమణలో ఉన్నాయని గుర్తించారు. రాములబండ సీతా రామచంద్రస్వామి దేవాలయానికి పూర్వీకులు కాకులకొండారంలో ఇచ్చిన 186 ఎకరాల భూమి నేడు పూర్తిగా అన్యాక్రాంతమైంది. చండూరు మండలంలో 10 దేవాలయాలకు 153 ఎకరాల భూములు ఉన్నాయి. శిర్ధపల్లి గ్రామంలో హనుమాన్‌ ఆలయానికి వంద సంవత్సరాల క్రితమే సుమారు ఎకరం 30 గుంటల భూమిని పూర్వీకులు కేటాయించారు. ఈ భూమిని 20 ఏండ్ల క్రితమే పూజారులు గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకున్నారు. ఇప్పటికీ ఈ విషయం దేవాదాయ శాఖకు తెలియని పరిస్థితి. కస్తాల గ్రామంలోని మరో దేవాలయం భూములు మావే అని పూజారులు అమ్ముకున్నారు. తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయానికి 24 ఎకరాల 12 గుంటల భూమి, హనుమాన్‌ దేవాలయానికి చెందిన ఎకరం 30 గుంటలు, తేరేటిపల్లిలోని మార్కండేయ స్వామి దేవాలయానికి 9 ఎకరాల 30 గుంటలు, చెన్నకేశవ స్వామి దేవాలయానికి 34 ఎకరాల 38 గుంటల భూమి, పుల్లెంల బుగ్గ రామేశ్వరాలయం దేవాలయానికి 26 ఎకరాల 13 గుంటల భూములు ఉన్నా నేడు అవన్నీ అన్యాక్రాంతమై దూపదీప నైవేద్యం లేక గుడులు వెలవెలబోతున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మాణమైన నల్లగొండ నడిబొడ్డున ఉన్న బ్రహ్మంగారి గుట్ట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి 14 ఎకరాలకుపైగా భూమి ఉండగా మైనింగ్‌ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. రెవెన్యూ, రిజిస్టర్‌ దేవాదాయశాఖల మధ్య సమన్వయ లోపంతో రికార్డులను మార్చి రిజిస్టర్‌ చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. భక్తులు ఫిర్యాదు కూడా చేశారు. భూమిని స్వాధీనం చేసుకోవాలని రికార్డులను అందజేయడంతో ట్రిబ్యునల్‌ విచారణ జరిపి అది దేవాలయ భూమిగా నిర్ధారించింది. దాంతో సమస్య సద్దుమణిగినా భూమిని మాత్రం స్వాధీనం చేసుకోలేదు.

ట్రిబ్యూనల్‌లో కేసుల విచారణ..
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికున్న వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములపై హైకోర్టు, దేవాలయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్స్‌ రెవెన్యూ 1939 కేసులపై విచారణ సాగుతోంది. దేవాలయ క్రిమినల్‌లో 83 కేసులు ఉండగా, రెవెన్యూ ట్రిబ్యునల్‌లో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ తీర్పులో భూములు ఆలయానికి చెందినవేని తేల్చినా కూడా తదుపరి చర్యలు తీసుకోలేదు.

అన్యాక్రాంతమైంది వాస్తవమే : దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ భాస్కరరావు
నల్లగొండ జిల్లాలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయం వాస్తవమే. ఈ విషయంపై కోర్టు అవి దేవాలయ భూములే అని తీర్పు ఇచ్చింది. అన్యా క్రాంతమైన దేవాలయ భూములను స్వాధీనపరు చుకునేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం.

దేవాలయ భూములు అన్యాక్రాంతం
నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా దేవాదాయ శాఖ అధికారులు పట్టించు కోకపోవడం లేదు. జిల్లాలో దేవాలయాలకు 15వేల పైచిలుకు ఎకరాల భూమి ఉండగా నేడు కబ్జాకు గురై 3వేల ఎకరాలే ఉన్నట్టు తెలుపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కబ్జాకు గురైన దేవాలయ భూములు 8000 ఎకరాలకు పైచిలుకు ఉన్నా నేటికీ అధికారులకు భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
-జిల్లెల గోవర్ధన్‌ యాదవ్‌, నల్లగొండ పట్టణ వాసి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -