Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ ఉపాధ్యాయుల వేతనాలు విడుదల చేయాలి

ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ ఉపాధ్యాయుల వేతనాలు విడుదల చేయాలి

- Advertisement -

టీఎస్‌ యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ అయిన ఉపాధ్యాయుల ఫిబ్రవరి నెల వేతనాలు విడుదల చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ కోరింది. ఈ మేరకు శుక్రవారం టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక శాఖ పోర్టల్‌ ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ఉద్యోగుల వివరాలు, ఆధార్‌ కార్డులోని వివరాలతో సరిపోలేదనే కారణంగా విద్యాశాఖలో 221 మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల వేతనాలు నిలిపివేశారని తెలిపారు. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో తప్పులను సవరించుకోవటానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలనీ, ఫిబ్రవరి నెల వేతనాలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి, విద్యాశాఖ అధికారులకు గత నెల 25న టీఎస్‌ యూటీఎఫ్‌ పక్షాన వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. దాంతో విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉపాధ్యాయుల వివరాలను ధృవీకరిస్తూ సరి చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని ఆర్థిక శాఖకు లేఖ రాశారని తెలిపారు. అయినప్పటికీ ఫిబ్రవరి నెల వేతనం విడుదల చేయలేదనీ, ఎడిట్‌ ఆప్షన్‌ కూడా ఇవ్వలేదని తెలిపారు. దీంతో వేతనం రాకపోవడంతో ఆ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ మిస్‌ మ్యాచ్‌ అయిన ఉపాధ్యాయుల ఫిబ్రవరి నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలనీ, తప్పులను సవరించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -