ప్రధానమంత్రి మోడీ ఇజ్రాయిల్ సందర్శన చాలా పొరబాటు ఆలోచన అనీ, ఎంచుకున్న సమయం కూడా ఏ మాత్రం సరైంది కాదనీ ఇప్పుడు సుస్పష్టమైపోయింది. కేవలం నైతిక సమస్య పరిధిని మించి భౌగోళిక రాజకీయాలు, జాతీయ వ్యూహంపై ప్రభావం చూపించింది. గాజాలో జాతి హత్యాకాండ రాక్షసత్వం కొనసాగుతూనే వుంది. తుడిచిపెట్టేందుకు ప్రారంభించిన పాలస్తీనా ప్రజానీకాన్ని, భూఖండాన్ని చుట్టుముట్టిన విధ్వంసం అవశేషాలు ఇంకా పూర్తిగా తొలగించబడనే లేదు. దానికి తోడు పశ్చిమ తీరంలో ఇజ్రాయిల్ నిర్మాణ సముదాయాల విస్తరణ వేగంగా సాగిపోతున్నది. ఇదంతా పాలస్తీనా సమస్యకు ఇరుదేశాల స్థాపనతో కూడిన పరిష్కారం జరగకుండా దెబ్బతీస్తున్నది.
కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు జరిగినా హత్యాకాండ ఆందోళనకరమైన స్థాయిలో జరిగి పోతున్నదని ప్రపంచం గుర్తిస్తున్నది. ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి బోర్డుకు సాధారణ పరిస్థితి నెలకొల్పాలనే ఉద్దేశంగానీ ఆ శక్తిగానీ లేవు. అసలు దాని ఏర్పాటే ఐక్యరాజ్యసమితి వ్యవస్థ మూలాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించింది. డోనాల్డ్ ట్రంప్ చైర్మన్‌గా వుండటం ఒకటైతే-ఈ మొత్తం ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి సారథ్యం ఇరాక్ దురాక్రమణ సమయంలో అత్యంత అసహ్యకర పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్‌కు అప్పగించడం నైతికతనే సవాలు చేసింది.
పశ్చిమాసియాలో భారత దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు కావలసినంత రక్షణ వుంది. గల్ఫ్‌లోని అనేక దేశాలతో, ఇరాన్‌తో భారతీయ నాగరిక పౌర సంబంధాలు చరిత్ర క్రమంలో నిక్షిప్తమై వున్నాయి. ఆధునిక కాలంలోనైతే ఈ ప్రాంతంలోని అనేక దేశాలలో భారతీయ వలస కార్మికులు భారీ సంఖ్యలో వుండటం ఇప్పటి విషయం. పశ్చిమాసియాలోని వారి నుంచి వచ్చే చెల్లింపులు అనేక రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలలో ఎంతగానో కీలక పాత్ర వహిస్తున్నాయి. అంతేగాక మన చమురు సరఫరాలలో అధిక భాగం హార్మోజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతాయి.
అగ్రగామిగా ఇరాన్- ఇజ్రాయిల్‌లో మోడీ
గాజా జాతి హత్యాకాండ సమయం నుంచి యూదు జాత్యహంకార ఇజ్రాయిల్ నిర్వాకాలు అరబ్ దేశాల వీధులలో ఆవేశం కుమ్మరిస్తూ వచ్చాయి. ఇజ్రాయిల్ పట్ల పెరిగిన వ్యతిరేకత గల్ఫ్ దేశాలలో, పశ్చిమాసియా ప్రభుత్వాలలో ఎంత ప్రభావం చూపిందంటే అబ్రహం ఒప్పందాలన్నీ నిలిపివేయబడ్డాయి. ఈ ప్రతిఘటనలకు నాయకత్వం వహిస్తున్నది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అన్నది నిస్సందేహం. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌తో మోడీ చెట్టపట్టాల్ కట్టడం కన్నా దారుణమైన దృశ్యం మరొకటి వుండదు. గాజాలో మారణకాండ మృతుల గురించి నోరెత్తకుండా మారణహోమం మృతులకు సంస్మరణ కార్యక్రమంలో మోడీ పాల్గొనడం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఆ జాతి హత్యాకాండతో విభేదించే భారతదేశ విధానాన్ని ప్రధాన మంత్రి మోడీ తలకిందులుగా మార్చేశారని చెప్పాలి. ప్రపంచంలోనేగాక ఇజ్రాయిల్‌లో కూడా విశ్వాసం నిలబెట్టుకోవడానికి విన్యాసాలు చేస్తున్న నెతన్యాహుకు ఆమోద ముద్ర వేయడంలో దౌత్యపరమైన ప్రాథమిక సూత్రాలు కూడా కనిపించవు. ఇది భారతదేశం అనుసరిస్తూ వస్తున్న సూత్రబద్దమైన సామ్రాజ్యవాద వ్యతిరేక అలీన విధానాలను కూడా కుప్పకూల్చింది. ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌లో మోడీ ప్రసంగాన్ని మొత్తం ప్రతిపక్షం బహిష్కరించడం దీనికే నిదర్శనం. అంతేగాక ఇండియా, అమెరికా, ఇజ్రాయిల్‌తో కూడిన షణ్ముఖ కూటమిని నెతన్యాహు ముందుకు తేవడం కూడా మరో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నది.
భారతదేశ భద్రతా సైనిక కొనుగోళ్లలో పెద్ద భాగం ఇజ్రాయిల్ నుంచే జరుగుతుందని చెప్పే సంకేతమది. దీనికీ భారతదేశ వ్యూహాత్మక స్వతంత్రంతోగానీ, జాతీయ ప్రయోజనాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగా జరి గిందే…అన్న వాస్తవాన్ని పథకం ప్రకారం సాగిన ఈ చెట్టపట్టాల తతంగం ఏ మాత్రం దాచిపెట్టలేకపోయింది. ఇరాన్‌పైన దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ సంసిద్ధంగా వున్న విషయం తెలియదని చెప్పడం భారతదేశ రాజకీయ నిఘా యంత్రాంగం అమాయకత్వమే. ఇరాన్ వరకూ చూస్తే గాజా జాతి హత్యాకాండకు పాల్పడిన ఇజ్రాయిల్ దుండగీడుతనాన్ని ప్రతిఘటించడంలో ఆ ప్రాంతానికి అగ్రభాగాన నిలబడింది. చైనాకు, రష్యాకు ఇరాన్ మరింత సన్నిహితం కావడం కూడా ఇజ్రాయిల్ అమెరికాల రాజకీయ, భౌగోళిక వ్యూహాలకు ప్రధాన ప్రతిబంధకమైంది. ఆ కారణంగానే ఇరాన్ వారి దాడికి లక్ష్యంగా మారుతున్నట్టు స్పష్టమైపోయింది.
అమెరికా బూటకత్వం
అమెరికా విదేశాంగ విధాన బూటకత్వాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. ఎప్పటికంటే ఇప్పుడది మరింత ఎక్కువగా బయటపడిపోయింది. పెట్టుబడిదారీ విధానానికి వంత పాడే అనేక మంది సమకాలీన వ్యాఖ్యాతలు లెనిన్ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని ప్రకటించడానికి ఆదుర్దాపడి పోతుంటారు. కానీ యుద్ధం, పెట్టుబడిదారీ విధానం అనేవి అవిభాజ్య కవలల వంటివని ఆయన నొక్కి చెప్పిన సిద్ధాంతం ఎంతగానో సజీవంగా శక్తివంతంగా వినిపిస్తుంది. యూదు జాత్యంహంకారంతో కూడిన అఖండ మహా ఇజ్రాయిల్ పథకానికి ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిఘటనను నిర్వీర్యం చేయాలంటూ అధ్యక్షుడు ట్రంప్‌ను ఇజ్రాయిల్ పురికొల్పింది.
అదే సమయంలో ఈ ప్రాంతంలో తమ తిరుగులేని ఆధిపత్యాన్ని నెలకొల్పుకోడానికి, రష్యా చైనా ప్రభావం పెరక్కుండా అడ్డుకోవడానికిగాను ఇరాన్ పాలక వ్యవస్థను మార్చాలని ట్రంప్ పాలనవ్యవస్థ కూడా తలపోసింది. ట్రంప్ ఏదో శాంతికాముక అధ్యక్షుడనేది ఒక బూటకం మాత్రమే. ఇరాన్ అణు కార్యక్రమం గురించి పదేపదే మాట్లాడటం మొదటి నుంచీ మోసపూరితమే. ఇజ్రాయిల్‌కు రహస్య అణ్వస్త్ర సామర్థ్యం వుందనేది బహిరంగ రహస్యం అయినా ఎవరూ దాని గురించి పెదవి మెదపరు. మరోవైపున ఇరాన్ తాము అణ్వాయుధం చేయడం లేదని తేటతెల్లంగా ప్రకటించింది. పర్యవేక్షకులకు ఆ ప్రదేశాల సందర్శనను అనుమతించింది. అయితే అక్కడ పారదర్శకత ప్రమాణాలపై అంతర్జాతీయ అణు సంస్థ (ఐ.ఎ.ఇ.ఎ) చొరబాటుదారీ రాజకీయ దురుద్దేశాలతో ప్రకటన చేసిన తర్వాతనే ప్రతిష్టంభన ఉత్పన్నమైంది.
దుష్ట పథకం అదే
అంతేగాక 2025లో ఇరాన్ అణు ప్రదేశాలపై భారీ ఎత్తున బాంబు దాడులు జరిగాయి. వాటిని ధ్వంసం చేశామనీ ఇక సమీప భవిష్యత్తులో ఉత్పత్తి చేయగల స్థితిలో లేవని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ కూడా ఓమన్ మధ్యవర్తిత్వంలో దౌత్యపరమైన సంప్రదింపులు మొదలుపెట్టింది. అయితే అది వారు గల్ఫ్‌లో సైనిక బలం పోగేసుకోవడానికీ, అమెరికా వైమానిక బాంబు దాడి సంపత్తిని ఇరాన్ పైకి మోహరించడానికి ఒక వంచనాత్మక ఎత్తుగడ మాత్రమే. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ రెండూ కలసికట్టుగా దాడి చేయడాన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారమే జరిగిందని తెలిసిపోతుంది.
ఇరాన్ తన ఆయుధ నిల్వలను గణనీయంగా తగ్గించుకుని దౌత్య పరమైన పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలను అందుకే తిరస్కరించారు. ఇప్పుడు ఎప్పుడూ కూడా అణుబాంబు చేయబోమని చెప్పినట్టు ఒమన్ విదేశాంగ మంత్రి ద్వారా బహిరంగంగానే ప్రకటించారు కూడా. అయినా వారు తిరస్కరించారు. ఈ మొత్తం పరిణామ క్రమం మోడీ ఇండియాకు తిరిగివచ్చిన 48 గంటలలోనే జరిగింది. మొత్తం ఘటనల క్రమం బట్టి చూస్తే ఈ సైనిక దుస్సాహసంలో ఇండియా దాదాపు భాగంగా కనిపిస్తుంది. అమెరికా ఏ విధమైన లెక్కలు వేసుకున్నా అవన్నీ తప్పిపోయాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలన్నిటిపై ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. టెల్అవీవ్తో సహా ఇజ్రాయిల్ నగరాలనేక వాటిపై ఇరాన్ మిసైల్ దాడులు మరింత తీవ్రంగా సాగుతున్నాయి.
అనివార్య ప్రతిఘటన
ఇరాన్ ప్రతీకార చర్యలను పిరికితనంగా అమెరికా, దాని మిత్రులు అభివర్ణించడం విడ్డూరంగా కనిపిస్తుంది. అమెరికా ఇజ్రాయిల్ ఉమ్మడిగా జరిపిన దురాక్రమణ కావాలని చేసింది. వేరువేరుగా కనిపిస్తూ కలిసి చేసిన దురాక్రమణలో అలీ ఖమేనీతో సహా తమ నాయకత్వంలో ప్రముఖమైన వారిని హత్యగావించిన తర్వాత కేవలం తన మనుగడ కోసం అనివార్యంగా చేస్తున్నది ఇరాన్ ప్రతిఘటన. ఇరాన్‌కు గల వికేంద్రీకృతమైన, బహుళ దొంతరలతో కూడిన ప్రత్యామ్నాయ నాయకత్వ వ్యవస్థలను, సైనిక సంఘర్షణ ఏర్పాట్లు బాగా తెలిసినవే. అది వాటిని స్పష్టంగా ప్రదర్శించడమేగాక ఇప్పుడు క్రియా శీలం చేసింది.
ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో భారతదేశ విదేశాంగ విధానం మాత్రం స్వీయ పరాజయ కారకంగా మారింది. భారతీయ ఇంధన సరఫరాలలో అత్యధిక భాగం దాని ద్వారానే చేరాల్సి వుండగా ఈ నిర్ణయం చమురు ధరలు ఉన్నఫళాన పెరిగిపోవడానికి కారణమైంది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న అవివేకి గురించి కాళిదాసు జానపద కథలో చూస్తాం. ఇజ్రాయిల్‌తో చెట్టపట్టాల తతంగం భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వ్యూహాత్మక పథకాలకు ఉపాంగంగా మార్చివేసింది. దక్షిణాది దేశాలకు నాయకత్వం వహిస్తున్నట్టు భారత దేశం పదేపదే చెప్పుకున్న గొప్పలను పటా పంచలు చేసింది. ఈ సైనిక ఘర్షణలు అంతం కావాలనీ, శాంతి పునరుద్ధరణ కావాలని మనం సమిష్టి స్వరం వినిపించాల్సి వుంది.
(మార్చి4 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
అసందర్భ సందర్శన, అమానుష దురాక్రమణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



