‘యుద్ధగీతం’ స్త్రీ లింగం కాదు. అది పీడితులు పెట్టుబడిపై చేసిన రణభేరీ! క్లారాజెట్కిన్, రోజా లుంగ్జెంబర్గ్, లాపాషనారా.. ఇంకెందరో.. ఆ పోరాటంలో కొన్ని మైలురాల్లు, మధుర జ్ఞాపకాలు. పెట్టుబడిపై, ఫాసిస్టు పాలకులపై దండెత్తిన ధీశాలురు. అందుకే, పోరాడే శక్తులకు ‘ఆరాధ్య దైవాలు’. కాబట్టే ఆ ఆనవాళ్ళను చెరిపేసే పనిలో పాల కులున్నారు. కొన్ని తరగతుల ఉద్యోగినులకు పాలకులు ప్రత్యేకగా పంపిణీ చేసే పట్టుచీరలు, కొన్నిరంగాల్లో డొల్ల సినీగీతాల వేడుకల స్థాయికి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని దిగజార్చారు. ఆ రోజు పెట్టుబడి అంతులేని దాహార్తికి గొంతులో అడ్డుపడ్డ సబలల సమరనాదం.
పురుషులు సంఘటితపడితే చాలదనీ, ‘మేముసైతం’ అంటూ శ్రామిక మహిళలు స్వేచ్ఛా సమానత్వాల కోసం బలిపీఠమెక్కేందుకూ, తుపాకుల కెదురెళ్లేందుకు సిద్ధపడ్డ సందర్భం ‘మార్చి 8’ మహిళా దినోత్సవం. వాళ్లు ధిక్కార స్వరాలు, పోరాటాల పూదోటలో పూసిన ఎర్రమందారాలు. అమెరికన్ కోర్టుల్లో బహిరంగంగా ‘నా చిరునామా నా చెప్పులనడగండి అది నాతోనే ప్రయాణం చేస్తుంద’ని చెప్పగల మదర్ జోన్స్‌లాంటి ధీశాలుర కేరాఫ్ అడ్రెస్ మహిళా దినోత్సవం! కన్నీళ్లతో సావాసం చేసినోళ్లు, లాఠీలతో తలపడినోళ్లు బులెట్లకు తమ రక్తంతో వీరతిలకం దిద్దినవారి వారసత్వమే మహిళా దినోత్సవం. కష్టాలకు ధైర్యం చెప్పినవాళ్లు. అది ‘ఆడో’ళ్లదేకాదు, ‘ఈడో’ళ్లదే! మనోళ్లదే! అందుకే, ఆడా, మగా తేడా లేకుండా పెట్టుబడితో తలబడినోళ్ల జాతర అది. మార్చి 8కి పునాదీ, పూర్వ రంగమది!
మహిళా దినోత్సవం పెట్టుబడిదాడికి ప్రతిఘటన! గాలీ వెలుతురూ లేని చీకటి గుయ్యారాల్లో 14-17 గంటల బండచాకిరీ. దాదాపు ప్రసవించే సమయం వరకూ యంత్రాల మధ్యనే పడుండేవారు మహిళా కార్మికులు. తోటి పురుష కార్మికులకే హీనమైన జీతాలు. మహిళా కార్మికుల పని మరింత దౌర్భాగ్యం. అయినా అనుత్పాదక ఇంటి చాకిరీ నుండి ఫ్యాక్టరీల్లోకి ప్రవేశం ఈ మహిళలకు విముక్తి దొరకడమేగాక, వారిని స్వంత వ్యక్తిత్వంగల పౌరులుగా తీర్చిదిద్దింది అంటాడు మార్క్స్. వేతన బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో సివంగులై దూకేలా చేసిన ఆ పాత్రే ‘మార్చి 8’కి దారితీసింది. మన దేశంలో పెట్టుబడిదారీ దేశాలను చూసి చొంగకార్చుకునేవారు, వారి పద్ధతుల గురించి ముచ్చట పడేవారు ‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల’ గురించి ఆలోచించరా?! 1857లో వేలాదిమంది మహిళలు అమెరికా చరిత్రలో మొదటిసారి సమ్మెచేశారు.
”ఆకలితో చావడంకన్నా పోరాటంలో చావడం మంచిద”న్న పిలుపు వారిని కదిలించింది. ఆ న్యూయార్క్ బట్టల మిల్లు మహిళలపై పోలీసులు జరిపిన దాడిలో 146 మంది అసువులు బాసారు. ఇటువంటి పోరాటాలు ఎన్నో.. ఎన్నో దేశాల్లో జరిగిన తర్వాత మహిళలకు ఓటుహక్కు వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి దొరికింది. ఉద్యోగ భద్రత వచ్చింది. దీన్లో సోషలిస్టు, కమ్యూనిస్టు మహిళల పాత్ర ప్రశంసార్హమైంది. తమకూ, తమ బిడ్డలకూ తిండి (బ్రెడ్) కావాలనీ, తమ భర్తలను యుద్ధం నుండి వెనక్కి పిలవాలని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో మార్చి 8న మహిళలు ప్రారంభించిన ఉద్యమం దావానలమై రష్యన్ సామ్రాజ్య పతనానికి దారితీసింది. సోవియట్ యూనియన్ అధికారయుతంగా మార్చి ఎనిమిదిని మహిళా దినంగా జరిపింది. నేడు 1977 నుండి ఐక్యరాజ్యసమితి మహిళా సమానత కోసం మార్చి 8ని గుర్తించింది.
భూస్వాములతో మిలాఖత్ అయిన పెట్టుబడిదారీ పాలన సాగుతున్న భారతదేశంలో పునాది వర్గాలైన వ్యవసాయ కార్మికులు, కార్మికులు కులవ్యవస్థ బంధనాల్లో చిక్కుకుని ఉన్నారు. ఈ వివక్షలో కీలకంగా బలయ్యేది స్త్రీలే! వర్గంలో భాగంగా మహిళలెదుర్కొనే దోపిడీ పీడన ఒక కీలకకర్తవ్యంకాగా, భారత సమాజంలోని పౌరులుగా మహిళ లెదుర్కొంటున్న వివక్ష, మహిళలుగా ఎదుర్కొంటున్న అణిచివేత, హింసల ప్రతిఘటన మరో ప్రధాన సమస్య. కుల, వర్గ పీడనలను వ్యతిరేకించడం ఒక అంశమైతే, నేటి మోడీ సర్కార్ లేబర్ కోడ్స్‌తో మహిళల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.
ఒక పక్క మహిళల పాత్రను మనువాద సిద్ధాంతం ద్వారా దిగజారుస్తుండగా, మరోవైపు రాత్రివేళల్లో మహిళలతో చాకిరీ చేయించడం, గనుల్లోకి మహిళల్ని దింపడం వంటివి అమల్లోకి తెస్తున్నది. మహిళలు ప్రధానంగా ఆధారపడిన టెక్స్‌టైల్ రంగంలో 12 గంటల పని అమల్లోకొచ్చింది. సెస్స్ చట్టం రద్దుతో భవన నిర్మాణం, బీడీవంటి రంగాల్లోని మహిళలు అనేక సౌకర్యాలు కోల్పోయి నానా అగచాట్లూ పడుతున్నారు లేదా పడబోతున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ అంటే కేవలం ఉత్సవంకాదు. పేరంటం అంతకన్నా కాదు. అదొక పోరాటాల వారసత్వం! ఒక జ్ఞాపిక! సుమారు రెండొందలేళ్ల క్రితం గడ్డకట్టిన శ్రామిక మహిళల రక్తం గురించికాదు.. పెట్టుబడి దోపిడీపై నేటికీ ఉప్పెనై ఉరుకుతున్న, ఉడుకుతున్న ఎర్రెర్రని పోరుబాట శ్రామిక మహిళా దినోత్సవం!
‘మార్చి 8’ ఒక యుద్ధగీతం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



