Saturday, March 7, 2026
E-PAPER
Homeజాతీయంతాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యం

తాత్కాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యం

- Advertisement -

స్పష్టమైన, స్థిర నిర్ణయాలకు స్వస్తి!
విమర్శలపాలవుతున్న భారత విదేశాంగ విధానం
అంతర్జాతీయ రాజకీయాల్లో మోడీ సర్కారు తీరు
ప్రపంచంలో పడిపోతున్న దేశ ప్రతిష్ట : మేధావులు, నిపుణుల ఆందోళన

మోడీ పాలనలో దేశ విదేశాంగ విధానం తీవ్ర విమర్శల పాలవుతున్నది. వలస పాలన కాలం తర్వాత భారత్‌ ప్రపంచ రాజకీయాల్లో తన నైతికత, స్పష్టమైన, స్థిర నిర్ణయాలతో గ్లోబల్‌ సౌత్‌ దేశాల్లో ప్రభావం సంపాదించింది. కానీ గత దశాబ్ద కాలం నుంచి వాటిని విస్మరిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ మేరకు మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా భారత ప్రభావాన్ని, ప్రతిష్టను తగ్గిస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.

న్యూఢిల్లీ : స్వాతంత్య్రం తర్వాత చాలా కాలం వరకు భారత్‌ అంతర్జాతీయ వ్యవహారాల్లో నైతికంగా సరైన వైఖరి తీసుకోవడానికి ప్రయత్నించేది. ఆ సమస్యలు భారత్‌కు ప్రత్యక్షంగా సంబంధించినవి కాకపోయినా.. సరైనది ఏమిటో చెప్పే దేశంగా భారత్‌ను గ్లోబల్‌ సౌత్‌ దేశాలు భావించేవి. అందువల్లే భారత్‌ సైనిక శక్తి వల్ల కాకుండా.. నైతిక విశ్వ సనీయత వల్ల ప్రభావం చూపగలిగింది.

గత దశాబ్దంలో విదేశాంగ విధానంలో మార్పు
మోడీ పాలనలో గత పదేండ్లలో భారత విదేశాంగ విధానం సిద్ధాంతాల కంటే తాత్కాలిక ప్రయోజనాలపై ఆధారపడుతోంది అని విమర్శలు ఉన్నాయి. బహుళ ధ్రువ ప్రపంచంలో పరిస్థితులకు అనుగుణంగా మారటం అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఈ విధానం ద్వారా తాత్కాలిక లాభాలు వచ్చినా.. భారత ప్రభావం తగ్గుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఉదాహరణకు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ ఓటింగ్‌లో తటస్థంగా ఉండటం వల్ల రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయగలిగింది. కానీ ప్రపంచం మొత్తం నైతిక ప్రమాణాలను పక్కన పెట్టినప్పుడు ఈ విధానం పని చేయడం కష్టమవుతుందని అంటున్నారు.

ఇరాన్‌ విషయంలో భారత్‌ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి ఘటనల్లో భారత వైఖరిని విశ్లేషకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయిల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్య జరిగినప్పుడు భారత్‌ స్పందించలేదు. భారత్‌ చాలా ఏండ్లు పెట్టుబడి పెట్టిన చాబహార్‌ పోర్టు నిర్వహణ నుంచి అమెరికా ఒత్తిడితో వెనక్కి వెళ్లింది. వెనిజులా అధ్యక్షుడిని అపహరించిన అమెరికా తీరును కూడా భారత్‌ ఖండించలేదు. పాలస్తీనా విషయంలో ఇక భారత్‌ మౌనం తీవ్ర విమర్శల పాలైంది.

పైగా ఇజ్రాయిల్‌కు మద్దతు ఇచ్చే చర్యలను తీసుకుంది. ఇటీవలే మోడీ ఆ దేశంలో కూడా పర్యటించారు. మోడీ దౌత్యం ఎంతో ప్రభావవంతమైందని ప్రచారం చేసుకునే బీజేపీ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలతో వస్తున్న నష్టాన్ని మాత్రం విస్మరిస్తోంది. కేంద్రం తీరుతో హార్ముజ్‌ జలసంధి ద్వారా వచ్చే చమురు (భారత్‌ అవసరాల్లో సుమారు 50 శాతం), గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్న సుమారు 90 లక్షల మంది భారతీయులు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు.

మోడీ సర్కారు తీరుపై విమర్శలు
మోడీ ప్రభుత్వం అంత ర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులను భారత్‌ ఖండించకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ హత్యపై మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ విధానం భారత్‌కు ఏ మాత్రమూ సరికాదని విమర్శిస్తున్నాయి.

‘భారత ప్రతిష్టను దిగజార్చుతుంది’
ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అంతర్జాతీయ చట్టాల కంటే పవర్‌ పాలిటిక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతున్నది. అమెరికా కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. కాబట్టి భారత విదేశాంగ విధానంలో మూల సిద్ధాంతాలు అవసరమని సూచిస్తున్నారు. కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు చివరకి దేశ ప్రభావాన్ని తగ్గించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచంలో భారత ప్రతిష్టను దిగజార్చుతుందని చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -