– ఆర్థికంగా, సామాజికంగా బలపరిచే దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు
– కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు
– సంక్షేమ పథకాల్లో వారికే పెద్ద పీట
– ఈ నెల 8న శిల్పకళావేదికలో ఇందిరా మహిళా శక్తి అచీవ్‌మెంట్ పుస్తకావిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమం, స్వయం ఉపాధి, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సూచించిన ”ఆడబిడ్డల అభివృద్ధే సమాజ అభివృద్ధి” అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరచే దిశగా అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట వేస్తున్నది. ఉచిత బస్సు ప్రయాణం నుంచి కోట్ల రూపాయల బ్యాంకు రుణాల వరకు, స్వయం ఉపాధి నుంచి మహిళా వ్యాపార ప్రోత్సాహం వరకు, సంక్షేమం నుంచి స్వావలంబన వరకు అనేక పథకాల ద్వారా మహిళల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తోంది. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నది. ప్రభుత్వ కృషి ఫలితంగా మహిళా సంఘాల్లో 4 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఇందిరా మహిళా శక్తి అచీవ్‌మెంట్స్ పేరుతో పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్నది. 40 పేజీల ఆ పుస్తకంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, వినూత్న వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలు, సభ్యుల విజయ గాధలను, ఫొటోలను పొందుపర్చారు.
మహిళల సాధికారత దిశగా…
ప్రజాప్రభుత్వం అమల్లోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం కింద సగటున ప్రతి రోజు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఒక్కో మహిళకు నెలకు సగటున 5 వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. 65 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు 30 రకాల పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్దం చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. ఏటా కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నది. మహిళలకు ఉచితంగా బస్సు, కారు, త్రీవీలర్ డ్రైవింగ్ శిక్షణను ఇప్పిస్తోంది. ఆర్టీసీలో త్వరలో మహిళా డ్రైవర్లు రాబోతున్నారు. రాష్ట్రంలో 46.68 లక్షల గ్రామీణ పేద మహిళలను 4.37 లక్షల స్వయం సహాయక సంఘాలుగా సమీకరించింది. ఆ సంఘాలను 18 వేల గ్రామ సంస్థలు, 553 మండల మహిళా సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు, 4 మహా సమాఖ్యలుగా విస్తరించి బలమైన సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతిపంచాయతీలోనూ మహిళా భవనాన్ని నిర్మించనున్నది. రూ.36 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఇప్పించి మహిళలను భవిష్యత్తు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. రెండేండ్లలో ”వడ్డీ లేని రుణాలు” పథకం కింద మహిళా సంఘాలకు రూ.1,121 కోట్లను మాఫీ చేసి వడ్డీభారం లేకుండా చేసింది. ఒక్కో సంఘానికి సగటు రుణం 2014-15లో రూ.1.90 లక్షలుండగా, 2025-26లో అది రూ.9.55 లక్షలకు చేరడం ప్రగతికి సూచికగా చెప్పొచ్చు. మహిళల నేతృత్వంలో రూ.3,612 కోట్ల పెట్టుబడితో 2.05 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లు స్థాపించబడ్డాయి. మహిళలకు రూ.2 లక్షల వరకు రుణ బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో ఇప్పటిదాకా 231 మందికి ప్రమాదబీమా, 2,993 మందికి రుణబీమా పథకాల ద్వారా రూ.45 కోట్లను ఇచ్చింది.
మండల మహిళా సమాఖ్యల(సీఎల్‌ఎఫ్) ద్వారా రూ.216 కోట్ల పెట్టుబడితో 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దె ఇప్పించింది. ఒక్కో బస్సుపై సీఎల్‌ఎఫ్‌లు నెలకు సగటున రూ.70 వేల ఆదాయాన్ని పొందుతున్నాయి. మొత్తం నెలవారి అద్దె రూ.4.16 కోట్లు 600 మండల సమాఖ్యలకు అందుతున్నది. 230 ఇందిరమ్మ క్యాంటీన్లు నెలకు సగటున రూ.72,000 లాభం ఆర్జిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ”ఇందిరా మహిళా శక్తి బజార్”లో గల 106 దుకాణాల ద్వారా గ్రామీణ మహిళా వ్యాపారులను పట్టణ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసింది. పాఠశాల యూపిఫామ్‌లు కుట్టడం ద్వారా రూ.28.09 కోట్ల ఆదాయాన్ని మహిళలు పొందారు. ధాన్యం కొనుగోళ్ల సెంటర్ల నిర్వహణ ద్వారా రూ.60 కోట్ల కమిషన్‌ను పొందారు. మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంక్ నిర్వహణ వంటి కొత్త రంగాల్లో అడుగుపెడుతున్నారు.పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ ప్రతి నెల ఇతరులకు ఉపాధి కల్పించడంతో పాటు, రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదించగలుగుతున్నారు. ”అమ్మ ఆదర్శ పాఠశాల” కింద రూ.510 కోట్ల విలువైన 27,303 పాఠశాల మౌలిక వసతుల పనులు పూర్తి చేశారు. టీనేజీ బాలికలు, వృద్ధ మహిళలు, వికలాంగులతో ప్రత్యేక ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేయగా…వాటిలో 72,979 మంది మహిళలు చేరారు. ఒంటరి మహిళలకు అండగా నిలుస్తోంది. వలస కూలీల పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పనిచేసే ప్రాంతాలకే రేషన్ సప్లై చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
ఆడబిడ్డల అభివృద్ధే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



