Saturday, March 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునాసిరకం బియ్యం, కుళ్లిన కూరగాయలు

నాసిరకం బియ్యం, కుళ్లిన కూరగాయలు

- Advertisement -

అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు
మరిపెడ, గూడూరులో ఆగని ఇబ్బందులు
తోడైన ర్యాగింగ్‌ భూతం

నవతెలంగాణ-మరిపెడ
మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన గురుకుల విద్యార్థుల పరిస్థితి ‘అడవిలో ఆకలి కేక’లా మారింది. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందుతుందని ఆశతో వచ్చిన విద్యార్థులకు పాచిపోయిన అన్నం, పురుగుల సాంబారు దర్శనమిస్తున్నాయి. 15 ఏండ్లుగా తిష్ట వేసుకొని కూర్చున్న సిబ్బందితో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. దీనికితోడు సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య తరచుగా సమస్యలు ఉత్పన్నమవడంతో గురుకుల పాఠశాలల సమస్యలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరిపెడ, గూడూరు మండలాల్లోని గురుకులాల్లో వెలుగుచూసిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు, సీనియర్ల ర్యాగింగ్‌ వేధింపులు జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలికల గురుకులంలో ఆహారం వికటించి విద్యార్థినులు ఆస్పత్రి పాలవ్వడం నిత్యకృత్యమైంది.

ఫిబ్రవరి 2026లో వడ్డించిన భోజనంలో పురుగులు రావడంతో 16 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో కుప్పకూలిపోయారు. మరిపెడ బాలుర గురుకులంలో సాంబార్‌లో బల్లి పడటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే నాసిరకం బియ్యం, కుళ్ళిన కూరగాయలు వాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార సమస్యలకే విద్యార్థులు సతమతమవుతుంటే, తాజాగా ర్యాగింగ్‌ ఉదంతాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. మరిపెడ బాలుర హాస్టల్‌లో సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను అర్ధరాత్రి నిద్రలేపి వింత విన్యాసాలు చేయిస్తున్నారని, బట్టలు ఉతికించుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నోరు విప్పితే దాడులు చేస్తామని సీనియర్లు బెదిరిస్తుండటంతో జూనియర్లు హాస్టళ్లకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గూడూరు బాలికల గురుకులంలోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నట్టు సమాచారం.

మా ప్రాణాలకు రక్షణ లేదా?
మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. చదువుకోవడానికి వస్తే కడుపు నిండా అన్నం లేదు.. పోనీ నిద్రపోదామంటే సీనియర్ల వేధింపుల భూతం వెంటాడుతుంది. అధికారులకు చెబితే మమ్మల్నే బెదిరిస్తున్నారని బాధిత విద్యార్థులు ఆవేదనతో విచారం వ్యక్తం చేస్తున్నారు.

గురుకులాల నిర్వాహకులపై ఆర్‌సీఓ ఆగ్రహం
వరుస ఘటనలపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్సీఓ గురుకుల పాఠశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వార్డెన్లను సస్పెండ్‌ చేయడంతోపాటు ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు. 2026 విద్యా సంవత్సరంలో ప్రతి హాస్టల్‌లో ‘ఫుడ్‌ సేఫ్టీ’ తనిఖీలు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణ లోపాన్ని సరిదిద్ది, పేద విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని బాధితుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ప్రభుత్వ వైఫల్యమే
ప్రభుత్వాలు అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లనే విద్యార్థుల సమ స్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటిని పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. గురుకుల పాఠశాలలో ఏర్పడిన పలు సమస్యలపై వెంటనే అధికారులు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి
-గంధసిరి జ్యోతిబసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -