Sunday, March 8, 2026
E-PAPER
Homeప్రత్యేకంస్మోకింగ్‌తో ఔట్‌ అవ్వకు మిత్రమా..

స్మోకింగ్‌తో ఔట్‌ అవ్వకు మిత్రమా..

- Advertisement -

(మార్చి 11 నేషనల్‌ నో స్మోకింగ్‌ డే)
చెదలు పట్టకుండా.. ఇంటి తలుపులకు టేకు కర్ర వాడతారు.. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తె.. ఇది ఆ బ్రాండు… అది ఈ బ్రాండు అంటూ.. మన స్టేటస్‌ గురించి పరోక్షంగా గొప్పగా చెప్పుకుంటారు. ఇన్ని రకాలుగా మన జీవన విధానంలో అద్భుత నాణ్యత కోసం తపన పడినవాళ్లు.. ఎందుకో ఏమో.. హదయాన్నీ, ఊపిరితిత్తులనూ నాశనంచేసే ధూమపానం అలవాటును మాత్రం.. ఇపుడు కాకపోయినా ఎప్పుడో ఇల్లు, ఒళ్ళు గుల్ల చేస్తుంది అని తెలిసి కూడా.. దమ్ము ఆగి’పోయే’ దాకా.. దమ్ము కొడుతూనే ఉంటారు.

దేహం ఎంత దఢంగా ఉన్నా.. సిగరెట్‌, బీడీ అలవాటు ఉంటే చాలు… పొగాకు దండయాత్రకు గేట్‌ తీసినట్టే.
పొగాకుతో క్యాన్సర్‌ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన ‘మైదాన్‌’ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజరు దేవగన్‌ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్‌ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమకూర్చిన రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా.. 2,3,4 అలా.. రోజూ డబ్బా ఖాళీ చేసి పర్సు ఖాళీ, ఊపిరి ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.
సిగరెట్‌, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే… దమ్ము కొట్టినపుడు సిగరెట్‌, బీడీలోని పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డి.ఎన్‌.ఎ.ను నాశనం చేసే పనిలో పడతాయి. అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా.. సిగరెట్‌ అలవాటుకు ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. దోస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు.
అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్‌ మనీతో గుట్టుగా సిగరెట్‌ కు అలవాటయ్యే కుర్రాళ్లూ లేకపోలేదు. జేబులో దండిగా పైసలు ఉన్నా సద్వినియోగం చేసేవారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు ‘దగ్గర’ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్‌ లు సైతం యువతను అటు వైపు ఆలోచింపజేసే అవకాశాలున్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు.

అయినా.. ఎవరో వచ్చి చెప్తేనే…
‘బాబు పొగతాగే అలవాటు మంచిది కాదు మానేరు’ అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.
సిగరెట్‌, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కండరాల్ని ఐనా తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బతీస్తాయి. కణాలు (సెల్స్‌) అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి. తద్వారా కేన్సర్‌కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డి.ఎన్‌.ఎ.ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకతి ఇచ్చే కణాలపై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, ఓ వ్యక్తి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.
సిగరెట్‌, బీడీ అలవాటు వల్ల కణాల డి.ఎన్‌.ఎ.ను రూటు మారుస్తాయి పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెల్లిగా రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దీంతో దేహానికి పోరాడదామని ఆశ పడే సత్తాను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండ యాత్ర చేసి, దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.
మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి? ధూమపానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.

మాచన రఘునందన్‌, 9441252121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -