రైతుబంధు ఎగ్గొట్టిన రైతు ద్రోహి : కురిక్యాల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డిపై
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / గంగాధర
కరీంనగర్ జిల్లాను ఒకనాడు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి ‘వాటర్ హబ్’గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని, నేడు కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరద కాలువ సాక్షిగా నిజాలు.. కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు తగవని హితవు పలికారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజక వర్గంలోని గంగాధర మండలం కురిక్యాల వద్ద వరద కాలువను, గోపాల్ రావుపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల గోసను చూసి చలించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరంతరం అసత్య ప్రచారాలు చేస్తోందని, కానీ అదే ప్రాజెక్టు నీళ్లు నేడు కండ్ల ముందు పారుతున్నాయని స్పష్టం చేశారు. వరద కాలువను జీవనదిగా మార్చింది కేసీఆర్ అని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును తాము 96 శాతం పూర్తి చేస్తే, మిగిలిన కొద్దిపాటి పనిని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేక పోతోందని మండిపడ్డారు.
రైతుబంధు ఎగ్గొట్టిన ‘రైతు ద్రోహి’
ఎన్నికల సమయంలో మూడు పంటలకు రైతు బంధు ఇస్తామని నమ్మ బలికి, అధికారంలోకి వచ్చాక ఉన్న రైతు బంధును కూడా ఎగ్గొ ట్టిన ఘనత రేవంత్ రెడ్డిదేనని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో రెండు పంటలకు ఢోకా లేకుండా పెట్టుబడి సాయం అందిం దని, ప్రస్తుతం రైతులు యూరి యా కోసం, పెట్టుబడి సాయం కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానలు, తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు నేటికీ ఒక్క రూపాయి సాయం అందలేదని, రేవంత్ రెడ్డి ఒక రైతు వ్యతిరేకిగా మారారని దుయ్యబట్టారు.
రైతుల కన్నీటి పర్యంతం
గోపాల్ రావుపల్లిలో ఎండిపోయిన పంటలను హరీశ్‌రావుకు చూపిస్తూ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్విగంగా మారింది. సాగునీరందక పంట కండ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లా డుతూ రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
99 రోజుల ప్రణాళిక ఒక డ్రామా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ’99 రోజుల ప్రణాళిక’పై హరీశ్‌రావు మండిపడ్డారు. వంద రోజుల్లో ఏమీ చేయలేని ప్రభుత్వం, ఇప్పుడు కొత్త నాటకా లకు తెరలేపిందని విమర్శించారు. ‘ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తావు? రైతులకు రైతుబంధు ఇచ్చావా? మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చావా? అవ్వాతాతలకు కొత్త పెన్షన్లు ఇచ్చావా? ఉన్న పెన్షన్లే మూడు లక్షలు కోసే శావు’ అంటూ పాలకుల వైఫల్యాలను ఎండ గట్టారు. పోలీసుల రక్షణ లేకుండా సామాన్య ప్రజల్లోకి వస్తే, ప్రజలే కాంగ్రెస్ మోసాలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.



