Tuesday, March 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిధరాఘాతుకం

ధరాఘాతుకం

- Advertisement -

మధ్యప్రాచ్యం యుద్ధ ప్రభావం మన వంటింటిపై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయన్న బూచితో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ (ఎల్పీజీ), కమర్షియల్‌ గ్యాస్‌ ధరలను పెంచి ధరాఘాతుకానికి పాల్పడుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి అధర్మ యుద్ధం కొనసాగిస్తున్న ఫలితమే ఈ చమురు కొరత ఎదుర్కోక తప్పని పరిస్థితికి దారితీసింది. వంట గ్యాస్‌ ధర సిలిండర్‌పై రూ.60 పెరిగింది. అదే వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధర రూ.116 పెరిగింది. చమురు నిలవలు తగ్గితే, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతికి ఆటంకాలు కొనసాగితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అగ్గిపుల్ల లేకుండానే మండిపోతాయి. అమెరికాకు తలొగ్గి రష్యా నుంచి దిగుమతులు నిలిపివేసిన పర్యవసాన ఫలితమిది.

అచ్చేదిన్‌ గురించి అస్తమానం కబుర్లు చెప్పే మోడీ ప్రభుత్వం సామాన్య జనం నెత్తిన మళ్లీ గ్యాస్‌బండ భారం మోపింది. ఎల్‌పిజిపై ప్రజలకు బోలెడంత రాయితీ ధారబోస్తున్నా మంటూ బొంకి, నెమ్మది నెమ్మదిగా సబ్సిడీ మొత్తానికి సర్వమంగళం పాడిన మోసకారితనం మోడీ అండ్‌ కోది. దాదాపు పదేండ్ల క్రితం నగదు బదిలీపై గొప్పగా ఢంకా బజాయించి, సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుల ఖాతాల్లోనే జమ చేస్తామంటూ బీరాలు పలికింది. ఆ తరువాత సిలిండరు ధరను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. ప్రారంభంలో రూ.200 పైగా ఖాతాల్లో జమైన రాయితీ సొమ్ము ఇప్పుడు రూ.15కు కరిగిపోయింది. అంటే దేశంలో కోట్లా మంది ఎల్‌పిజి వినియోగదారులను చెప్పాపెట్టకుండా రాయితీని తెగ్గోసి, మోసగించింది బీజేపీ సర్కార్‌.

పాతికేండ్ల కిందటి వరకూ ఏడాదికొకసారి పెట్రో ఉత్పత్తుల ధరలను సవరించటం, పూలింగ్‌ పద్ధతిలో ధరల సర్దుబాటు చేయటం విధానంగా ఉండేది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్టులోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉంటాయని కేంద్ర పాలకులు గతంలోనే ప్రకటించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలను మరింత స్పీడుగా అమలుచేస్తోంది. అందులో భాగమే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులతో సహా నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరగడం. ధరలు పెరిగినప్పుడు పెంచ టం, తగ్గినప్పుడు తగ్గించటం సహజంగానే జరిగిపోతుందని సన్నాయి నొక్కులు నొక్కడం. నిజానికి ఆచరణలో జరుగు తున్నదేమిటి? భారం పెరిగితే జనం మీదికి నెట్టటం, ధర తగ్గితే చమురు కంపెనీల ఖాతాల్లోకి మళ్లించటం.

”రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకు న్నారో” ఖబడ్డార్‌ అని ట్రంప్‌ హుంకరించిన తరవాత మన దిగుమతులు ఎలా తగ్గాయో చూస్తే ట్రంప్‌ మాటలను జవదాటని ”మంచి బాలుడు మోడీ” అన్న సత్యం బోధపడ్తుంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పుడు రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించింది. అయినా మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఆపలేదు. కానీ ”చమురు దిగుమతి చేసుకోకూడదు” అని అమెరికా ఆదేశించిందే తడవుగా ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం సంస్థలు దిగుమతులు ఆపేసి తమ స్వామి భక్తిని చాటుకున్నాయి. పశ్చిమాసియా వివాదం ఈ గ్యాస్‌ ధరల పెంపునకు కారణమమని మోడీ ప్రభుత్వం సమర్థించుకోవడం దాని స్వయంకృత అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. నిజానికి ఇది ట్రంప్‌ యుద్ధోన్మాద విధానాల ముందు మోడీ ప్రభుత్వం లొంగిపోవడం. దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ అమెరికా ప్రపంచ ఆధిపత్య ప్రయోజనాలకు సేవ చేయడానికి సిద్దపడ్డ కేంద్రం తీరును ఇది ప్రతిబింబిస్తోంది.

తగిన ఆదాయాలు లేక ప్రజల్లో కొనుగోలు శక్తి రోజురోజుకీ తగ్గిపోతున్న వాస్తవం అనేక రూపాల్లో కళ్ల ముందు కనిపిస్తోంది. వీరి పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరగడమే తప్ప, కిందికి చూడడం లేదు. ధరలను అదుపులోకి తేవాల్సిన పాలకులు ఆ పని చేయకపోగా, అవి మరింత పెరగటానికి కారణమయ్యే ఎల్‌పిజి, పెట్రో ధరలను పెంచటం బాధ్యతారాహిత్యం. నెలకు సంపాదించే మొత్తంలో దాదాపు ఇరవై శాతం ఒక్క సిలిండరుకే ఖర్చయిపోతుంటే ఆ కుటుంబాలు ఇక ఏం వండుకోవాలి? ఏం తినాలి? పేదల జీవితాల్లో వెలుగులు నింపటానికి అంటూ తీసుకొచ్చిన ఉజ్వల పథకం వినియోగదారులపైనా భారాలకు తెగబడింది ప్రభుత్వం. ఇది గ్యాస్‌ వినియోగాన్ని పక్కన పెట్టి, మళ్లీ కట్టెల మోపు వైపు నెట్టటానికే ఉపయోగపడుతుంది. అయినా వామపక్ష పార్టీలు తప్ప మరో పార్టీ ఉద్యమించడం లేదు. అన్ని తరగతులపైనా, నిత్యావసర ధరల పైనా ప్రభావం చూపే ఈ పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలని ఇప్పటికైనా బీజేపీయేతర పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధరాఘాతుకాన్ని అడ్డుకోవాలి. కేంద్రం పెంచిన ఎల్‌పిజి ధరను తక్షణమే ఉపసంహరించటంతో పాటు రాయితీని భారీగా పెంచాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -