– ప్రధాన సబ్జెక్ట్ ల్లో 46 గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒలింపియాడ్ పరీక్షల్లో అశ్వారావుపేట శ్రీ గౌతమి స్కూల్ విద్యార్థులు ప్రతిభా పటిమను చాటుకున్నారు. ఇంగ్లీష్, సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ విభాగాల్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో విద్యార్థులు మొత్తం 46 గోల్డ్ మెడల్స్ సాధించి విశిష్ట విజయాన్ని నమోదు చేశారు.
పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఒలింపియాడ్, ఐఐటీ స్థాయి విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యా సేవకుడు బోటనీ బాలాజీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో తమ ప్రతిభను నిరూపించగలరని ఈ ఫలితాలు స్పష్టంగా చూపించాయని పేర్కొన్నారు.
ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందానికి శ్రీ గౌతమి స్కూల్ ప్రిన్సిపాల్ కొటారు లక్ష్మి,కర్స్పాండెంట్ కొటారు చలపతి రావు లు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో కూడా ఇంతకన్నా గొప్ప విజయాలు సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.



