ప్రచారమూ కల్పించాలి
ప్రత్యేక ప్యాకేజీలతో ఆకర్షించాలి : సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యాటక ఆస్తుల వినియోగం, ప్రాచుర్యం, ప్రచారం, ఆదాయ మార్గాలు, హరిత హోటళ్ల నిర్వహణ, పెండింగ్ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన పర్యాటక ప్రాంతాలలో సూచిక బోర్డులు, ఫుడ్ కోర్టులు, టూరిజం సమాచార కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాల స్థితిగతులపై మంత్రి అధికారులతో చర్చించారు. బోటింగ్ సౌకర్యాలు, కాటేజీలు, వ్యూ పాయింట్లు, హరితహోటళ్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనీ, పర్యాటకుల సంఖ్య పెరిగేలా, వారికి మరిన్నీ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే సీఎం రేవంత్ రెడ్డి అకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డులను (డైరెక్షన్ సైనేజ్) ఏర్పాటు చేయాలనీ, సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలన్నారు. కేవలం దారి చూపడమే కాకుండా, ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతను బోర్డులపై క్లుప్తంగా వివరించాలని తెలిపారు.
రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు, కళాకారులను ప్రోత్సహించేందుకు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. మన కళలు, మన భాష, మన సంస్కృతి మన అస్తిత్వానికి ప్రతీకలని గుర్తు చేశారు. వాటిని పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించేందుకు కృషి చేయాలి. కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూత అందించే దిశగా చర్యలు ఉండాలి. ప్రసిద్ధ ప్రదేశాల్లో హంపి థియేటర్లు నిర్మించాలని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆద్వర్యంలో ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలను, ఆదాయంపై మంత్రి ఆరా తీశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంతో గణనీయంగా ఆదాయం తగ్గిందని మంత్రికి అధికారులు సర్ధి చెప్పే ప్రయత్నం చెయగా, మంత్రి అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్సులను కొనుగోలు చేశామనీ, వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల ఆదాయం కొల్పోవాల్సి వస్తుందన్నారు. స్పెషల్ ప్యాకేజీలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా చేపట్టిన సుమారు 84 పనుల పురోగతిపై ప్రాజెక్ట్‌ల వారీగా సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా నిరర్ధకంగా ఉన్న పర్యాటక స్థలాలను వినియోగంలోకి తెచ్చి ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలనీ, దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఆ స్థలాల్లో పర్యాటకులకు హోటళ్ల నిర్మాణం, ఆతిధ్యం, వెల్నెస్ సెంటర్, అమ్యూస్మెంట్ పార్కుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
పర్యాటకాభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



