దర్యాప్తునకు సహకరించాలి
కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దు
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ 1 గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ లో ఎస్ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసు తెరపైకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అయితే, ముందస్తు బెయిల్ ఇస్తేనే దేశానికి తిరిగి వస్తానని ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. హైకోర్టు తీర్పును గతేడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిసణ్ పై విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న…. ‘తొలుత ప్రభకార్ రావును స్వదేశానికి రానివ్వండీ’ అని మధ్యంతర రక్షణ కల్పించారు. ఈ రక్షణతో ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం పలుమార్లు దర్యాప్తుకు సహకరించారు. అయితే… పోలీస్ శాఖ లో సుదీర్గంగా పని చేసిన అనుభవం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోని ప్రభాకర్ రావును కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అభ్యర్థన పై గతేడాది డిసెంబర్ 11న ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అనంతరం మరోవారం పొడగిస్తూ డిసెంబర్ 25 న ఆయనను రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషణ్ మరోసారి మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇరువాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది.
దర్యాప్తుకు సహకరిస్తున్నాం…
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు విచారణకు అర్హమా కాదా అనే అంశంపై నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు తేల్చకుండా బెయిల్ పిటిషన్ ను పెండింగ్ లో ఉంచాలని అభ్యర్థించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్రతను దష్టిలో పెట్టుకుని మధ్యంతర రక్షణనే కొనసాగించాలని కోరారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయొద్దని విన్నవించారు. త్వరలో అదనపు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు ప్రభాకర్ రావు తరఫు సీనియర్ అడ్డొకేట్లు రంజిత్ కుమార్, దామా శేషాద్రినాయుడులు వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు దర్యాప్తుకు అన్ని అన్ని విధాలుగా సహకరించారని కోర్టు దష్టికి తెచ్చారు. కస్టోడియల్ విచారణ సైతం ముగిసిందని తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణకు పూర్తిస్థాయిలో ప్రభాకర్ రావు కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం… ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర్వుల సందర్భంగా ప్రభాకర్ బెయిల్ కు సంబంధించి సిద్దార్థలూథ్ర కోర్టుకు పలు అభ్యర్థనలను చేశారు. వీటిని పరిగణలోకి తీసుకొన్న జస్టిస్ నాగరత్న వాటిని బెయిల్ షరతుల కింద ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుంది..
ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కేసు దర్యాప్తుకు, అలాగే ట్రయల్ కోర్టు లో జరిగే విచారణకు సహకరించాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం పాస్ పోర్ట్, ట్రావెల్ రికార్డులను ట్రయల్ కోర్టు కు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ తక్షణమే రద్దవుతుందని స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో… ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్
- Advertisement -
- Advertisement -



