Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

ఆచరణలో కనిపించని విద్యావ్యవస్థ పునరుద్ధరణ : ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట టీపీటీఎఫ్‌ నిరసన

నవతెలంగాణ-సిటీబ్యూరో
గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి.. తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ కోరారు. టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌లో గల గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీగా కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు అమలులో కనిపించడం లేదన్నారు. తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. విద్యాశాఖలో గ్రేడ్‌-2 పండిట్‌లు, పీఈటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెండేండ్ల కిందటే స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 232 తెలుగు పండిట్‌లు, 101 హిందీ పండిట్‌లు, 90 పీఈటీ పోస్టులను ఇంకా అప్‌గ్రేడ్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం 423 గ్రేడ్‌-2 పోస్టులను వెంటనే స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 20 ఏండ్లుగా అరకొర వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్లు (సీఆర్టీలు) తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్నారని, వారిని వెంటనే రెగ్యులరైజ్‌ చేసి టైమ్‌ స్కేల్స్‌ అమలు చేయాలని, ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల చేయాలని, కన్వర్టెడ్‌ ఆశ్రమ పాఠశాలలను 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయాలని అన్నారు. అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులను నియమించాలని, ప్యాటర్న్‌ ప్రకారం పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక టీఆర్టీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు నిర్మించి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో ఒకే విధమైన పరిపాలన, పర్యవేక్షణ, అకడమిక్‌ విధానం అమలు చేయాలన్నారు. పాఠశాలల్లో సర్వీస్‌ పర్సన్లను నియమించాలని, విద్యా సంవత్సర ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వసతి గృహాలకు హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలకు పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేసి పాఠశాలలకు అవసరమైన అన్ని గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బి.రాజు, ఎం.లక్ష్మయ్య యాదవ్‌, ఎస్‌.విజయ్, డి.రాజయ్య, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు వై.అశోక్‌ కుమార్‌, రాష్ట్ర అకాడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ ఎం.ప్రకాష్‌ రావు, ఎం.రామాచారి, ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు ఎస్‌.ఉపేందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు బి.ముత్యాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -