జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు.జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఈ జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ (ఇళ్ల జాబితా) గృహాల గణన మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు, రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ఎంతో ఉపయోగపడతా యన్నారు.ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.
మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంట గది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు లాంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని వివరించారు.అనంతరం శిక్షణ నిర్వాహకులు, సీపీఓ కిషన్ నాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు.
జనాభా గణాంక అధికారులు యువేందర్ బాబు, రవీంద్ర నాయక్ ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీవోలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసు, మాస్టర్ ట్రైనర్ రమేష్, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.



