– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు.బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో కొనసాగుతున్న సిసిటీ పనులను ఎంపిడివో రాజ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కూలీల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, కూలీల హాజరు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి, పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి, దినసరి కూలి పొందాలని సూచించారు.పనుల్లేని కూలీలకు ఉపాధి హామీ పనులు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఈజిఎస్ సిబ్బందిని ఆదేశించారు. పని విరామంలో సేద తీరేందుకు నీడ వసతితో పాటు నీటి సౌకర్యాన్ని కల్పించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, టెక్నికల్ అసిస్టెంట్ అరవింద్, ఫీల్డ్ అసిస్టెంట్ రాకేష్, ఎంపీడబ్ల్యూ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.



