నవతెలంగాణ-హైదరాబాద్: E20 ఇథనాల్ పెట్రోల్ వాడకంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ పెట్రోల్ వాడకంతో వాహనాల ఇంజన్లు, మైలేజ్ తగ్గుతుందని ఆరోపణలు వెలువెతుత్తున్నాయి. ఈక్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల కోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. రాయ్‌పూర్‌కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేవతా 2023లో ‘మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా ప్లస్’ మోడల్‌ను కొనుగోలు చేశారు. అయితే, కారులో E20 పెట్రోల్ వినియోగించినప్పటి నుంచి ఇంజిన్ తరచూ నిలిచిపోవడంతో పాటు పనితీరులో లోపాలు తలెత్తుతున్నాయని ఆయన వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కోర్టు, జూలై 14న 23 పేజీల సమగ్ర తీర్పును వెలువరించింది. సదరు వాహనం E20 ఇంధనానికి అనుకూలమైనది కాదని, విక్రయ సమయంలో ఈ విషయాన్ని వినియోగదారుడికి వెల్లడించకపోవడం ‘సేవా లోపం’ మరియు అనుచిత వ్యాపార విధానం కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.E20 ఇంధన వినియోగం కారణంగా దెబ్బతిన్న మారుతీ గ్రాండ్ విటారా కారు స్థానంలో E20 ఇంధనంతో పనిచేసే కొత్త వాహనాన్ని అందించాలని, లేదా కొనుగోలు మొత్తాన్ని పూర్తిగా వాపసు చేయాలని మారుతీ సుజుకీ సంస్థను, సదరు డీలర్‌ను ఆదేశించింది.తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా ఫిర్యాదుదారుకు కొత్త కారును అందజేయాలని, లేనిపక్షంలో వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.29 లక్షలు, ఆర్టీఓ ఛార్జీలు రూ. 1.86 లక్షలు, ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 34,644 కలుపుకుని మొత్తం రూ. 20.50 లక్షలను వాపసు చేయాలని ఆదేశించింది. ఈ తరహా వివాదంలో దేశంలోనే వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం విశేషం.



