Thursday, March 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధ వ్యూహాన్ని మార్చిన ఇరాన్‌

యుద్ధ వ్యూహాన్ని మార్చిన ఇరాన్‌

- Advertisement -

భారీ వార్‌హెడ్లతో క్షిపణుల ప్రయోగానికి సిద్ధం

యుద్ధంలో ఇరాన్‌ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ల సంఖ్య తగ్గిపోతోంది. ప్రారంభ దినాలలో భారీగా వాటిని ప్రయోగించిన ఇరాన్‌ తాజాగా దూకుడును తగ్గించింది. ఇది తమ విజయానికి సంకేతమని అమెరికా, ఇజ్రాయిల్‌ చంకలు గుద్దుకుంటున్నాయి. అయితే తమ వద్ద ఆరు నుంచి ఎనిమిది నెలల పోరుకు సరిపడా క్షిపణులు ఉన్నాయని, అయినప్పటికీ యుద్ధ వ్యూహాన్ని మార్చుకున్నామని ఇరాన్‌ తెలిపింది. ఇరాన్‌ ప్రయోగించిన మూడో వంతు డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయిల్‌ చెబుతున్నాయి. ఇరాన్‌ లాంఛర్లను లక్ష్యంగా చేసుకొని తాము జరుపుతున్న దాడుల కారణంగానే ఆ దేశం వద్ద క్షిపణి నిల్వలు తరిగిపోతున్నాయని అంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్‌ తోసి పుచ్చింది. వ్యూహాన్ని మార్చేశామని, భారీ పేలుడు పదార్థాల పేలోడ్లతో క్షిపణులను ప్రయోగించబోతున్నామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ఏరోస్పేస్‌ దళ అధిపతి బ్రిగేడియర్‌ జనరల్‌ సయ్యద్‌ మజీద్‌ మౌసావీ తెలిపారు.

యుద్ధం ప్రారంభ దినాలలో అమెరికా, ఇజ్రాయిల్‌ ఆస్తులనే కాకుండా మధ్యప్రాచ్యంలోని పౌర మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు జరిపింది. ఒమన్‌, బహ్‌రైన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలలోని విమానాశ్రయాలు, చమురు-గ్యాస్‌ టెర్మినల్స్‌, విలాసవంతమైన హోటళ్లపై దాడులు జరిగాయి. అయితే ఈ దూకుడు ఇప్పుడు కొంతమేర తగ్గింది. అయితే దాడులు మాత్రం ఆగలేదు. యుద్ధం మొదలైన రోజుతో పోలిస్తే ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణుల ప్రయోగం సుమారు 92 శాతం తగ్గిందని జెరుసలేం పోస్ట్‌ పత్రిక తెలిపింది. ఫిబ్రవరి 28న 480 క్షిపణులను ప్రయోగించగా ఈ నెల 9న కేవలం 40 క్షిపణులను మాత్రమే ఉపయోగించారు. తొమ్మిదో తేదీన ఇరాన్‌ కొత్తగా ఖొర్రమ్‌షహర్‌, ఫతా, ఖెయిబర్‌ క్షిపణులను ప్రయోగించింది. క్షిపణుల వినియోగాన్ని ఇరాన్‌ తగ్గించినప్పటికీ దాడులను మాత్రం ఉధృతం చేసింది.

ఇరాన్‌ క్షిపణి లాంఛర్లను ధ్వంసం చేసినందునే ప్రయోగిస్తున్న క్షిపణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని అమెరికా, ఇజ్రాయిల్‌ చెబుతున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్‌ వద్ద 400-550 లాంఛర్లు ఉన్నాయని, వాటిలో 300-415 లాంఛర్లను తటస్థం చేయడమో లేదా ప్రయోగ ప్రదేశాలలో ధ్వంసం చేయడమో జరిగిందని జెరుసలేం పోస్ట్‌ పత్రిక తెలిపింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. యుద్ధం తొలి రోజున ఇరాన్‌ అత్యధిక సంఖ్యలో బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించింది. ఆ సంఖ్యతో పోలుస్తూ అమెరికా, ఇజ్రాయిల్‌ తప్పుడు అంచనాలు వేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. తన క్షిపణి కార్యక్రమానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ‘ఇప్పటి నుంచి టన్ను కంటే తక్కువ బరువున్న వార్‌హెడ్‌తో క్షిపణిని ప్రయోగించం. తీవ్ర స్థాయిలో క్షిపణులు ప్రయోగిస్తాం. భారీ స్థాయిలో జరిగే దాడులు శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తాయి.

తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’ అని మౌసావీ తెలిపారు. క్షిపణి దాడులను తగ్గించడం కాదు…అమెరికా, ఇజ్రాయిల్‌ లక్ష్యాలపై వాటి దాడులను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ తన క్షిపణుల స్థానంలో డ్రోన్లను తేలికగా ఉపయోగించగలదని, అందుకోసం అత్యాధునిక లాంఛింగ్‌ పరికరాల అవసరం లేదని నిపుణులు తెలిపారు. ఉదాహరణకు షాహెద్‌ డ్రోన్‌ను సైనిక, వాణిజ్య ట్రక్కుల మీద నుంచే ప్రయోగించవచ్చు. యుద్ధం చివరి దశకు చేరుకున్నప్పుడు శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించాలని ఇరాన్‌ భావిస్తోందని, అందుకే అమ్ములపొదిలో వాటిని భద్రంగా నిల్వ ఉంచిందని టర్కీ మాజీ దౌత్యవేత్త సినాస్‌ అల్జెన్‌ చెప్పారు. ఇరాన్‌ మంగళవారం రాత్రి అత్యాధునిక, భారీ వార్‌హెడ్లతో కూడిన క్షిపణులను లక్ష్యాలపై ప్రయోగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -