Saturday, July 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినోటికాడి కూడు లాక్కుంటారా?

నోటికాడి కూడు లాక్కుంటారా?

- Advertisement -

దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో కేంద్రీకరించే విధానాలను వరుసగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, పేదల ఆకలి గురించి నిజంగా ఆలోచిస్తుందా? పన్ను రాయితీలు, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, విధాన పరమైన వెసులుబాట్లతో ధనవంతులను మరింత కుబేరులుగా మార్చే పాలన సాగుతుంటే, మరోవైపు బతుకుబండిని లాగుతున్న పేదల పళ్లెంలో అన్నంపైనే కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అత్యంత పేదలకు అందుతున్న ఆహార ధాన్యాల హక్కును విస్తరించాల్సిన ప్రభుత్వం, దాన్ని కుదించే సవరణలు ప్రతిపాదించడం పేద వర్గాలను నిరక్ష్యం చేయడమే అవుతుంది. ఆకలిని నిర్మూలించడం కంటే వ్యయాన్ని తగ్గించడానికే పెద్దపీట వేస్తున్న ఈ వైఖరి, సంక్షేమ రాజ్య భావనకు పూర్తిగా విరుద్ధమని తెలిసినా ఇలాంటి చర్యలకు పూనుకోవడం బాధాకరం.

ప్రస్తుతం అంత్యో దయ అన్న యోజన కింద ఒక కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం అందుతున్నాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం ఒక్కో వ్యక్తికి ఏడు కిలోల చొప్పున ఇవ్వా లని భావిస్తున్నారు. పైకి చూస్తే ఇది పెంపులా కనిపించినా, వాస్తవానికి చిన్న కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే మార్పు. ఇద్దరు సభ్యుల కుటుంబానికి ఇప్పటి వరకు లభిస్తున్న 35 కిలోల బదులు కేవలం 14 కిలోలే వస్తాయి. ముగ్గురు సభ్యుల కుటుంబానికి 21 కిలోలు మాత్రమే అందు తాయి. ఐదుగురు సభ్యుల కుటుం బానికి మాత్రం మళ్లీ 35 కిలోలే. అంటే పెద్ద కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనం లేకుండా, చిన్న కుటుంబాల హక్కులకే కత్తెర వేయబడుతోంది. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది? వృద్ధ దంపతులు, భర్తను కోల్పోయిన మహిళలు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధ పడుతున్న వారు, గిరిజన కుటుంబాలు, భూమిలేని వ్యవసాయ, దినసరి కూలీలు, చిన్న కుటుంబాలుగా జీవిస్తున్న అత్యంత పేద వర్గాలపై ఈ నిర్ణయం నేరుగా దెబ్బకొడుతుంది. పేదరికాన్ని కుటుంబ పరిమాణంతో కొలవలేమనే సాధారణ వాస్తవాన్ని ఈ ప్రతిపాదన విస్మరిస్తోంది.

ఈ సవరణ మరో కీలక అసమానతకు దారి తీసే ప్రమాదం ఉంది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో సగటు కుటుంబ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వ్యక్తి ప్రాతిపదిక విధానం అమలైతే అలాంటి రాష్ట్రాలకు కేటాయించే మొత్తం ఆహార ధాన్యాల పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలనే శిక్షించి నట్లవుతుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికీ, సమానత్వ సూత్రానికీ విరుద్ధం. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, జాతీయ ఆహార భద్రత చట్టం అమలు ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ఆధారంగానే కొనసాగుతోంది. గత పదిహేనేళ్లలో దేశ జనాభా గణనీయంగా పెరిగింది. కోట్లాది మంది కొత్తగా అర్హులైనప్పటికీ, వారికి ఆహార భద్రత హక్కు అందడం లేదు. పాత జాబితాల వల్ల అనేక మంది పేదలు ఇప్పటికీ పథకం వెలుపలే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం చేయాల్సింది లబ్ధిదారుల జాబితాను నవీనీకరించడం, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా కవరేజీని విస్తరించడం. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా, ఇప్పటికే లబ్ధి పొందుతున్న అత్యంత పేదల వాటానే తగ్గించే మార్పులు తీసుకురావడం ఆందోళనాకరం. ఆహార భద్రత చట్టం అనేది కేవలం సంక్షేమ పథకం కాదు.

దీర్ఘకాల ప్రజా ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన చట్టబద్ధ హక్కు. దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో రూపొం దించిన ఈ చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. అలాంటి చట్టాన్ని క్రమంగా బలహీనపరిచే విధంగా నిబంధనల్లో మార్పులు చేయడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విఘాతం. పేదల జీవితాల్లో భద్రతను పెంచాల్సిన ప్రభుత్వం, వారి కనీస ఆహార హక్కునే తగ్గించే దిశగా సాగితే సంక్షేమ రాజ్య భావనకు అర్థం ఏముంటుంది? ఇప్పటికే ధరల పెరుగుదల, ఉపాధి అస్థిరత, ఆదాయాల క్షీణతతో కోట్లాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి సమయంలో ఆహార భద్రతను విస్తరించాల్సిన చోట, పంపిణీలో సమర్థత పేరుతో కుదించడం తినే కూటిలో మన్ను పోయడమే తప్ప వేరే కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదిత సవరణపై పునరాలోచన చేయాలి. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతున్న పరిమితులను తొలగించి, తాజా జనాభాకు అనుగుణంగా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలి. ఆహార భద్రత చట్టం పరిధిని విస్తరించాలి గానీ, హక్కులను కుదించకూడదు. ఆకలిపై ఆదా చేయడం కాదు, ఆకలిని నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యం కావాలి. అదే ప్రజాస్వామ్యానికి, సంక్షేమ రాజ్యానికి, ఆహార హక్కు స్ఫూర్తికి సరైన మార్గం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -