నవతెలంగాణ-హైదరాబాద్: ‘మోడీజి -ఎల్పిజి’ అంటూ ప్రతిపక్షాలు గురువారం పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టారు. కమరిషయల్ ఎల్పిజి సిలిండర్ల కొరతపై మోడీ ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఎసి సహా పలువురు ఎంపిలు మకరద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ‘నామ్ నరేందర్, కామ్ సరెండర్ (పేరు- నరేంద్రమోడీ, పని- లంగిపోవడం)’, ‘మోడీజి, ఎల్పిజి’ అంటూ నినాదాలు చేశారు. ప్రియాంకగాంధీ సహా పలువురు మహిళా ఎంపిలు ఇటుకల పొయ్యిలను ప్రదర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పశ్చిమాసియా పరిస్థితులు, భారత్‌పై దాని ప్రభావంపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఎల్పిజి కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని పేర్కొన్నారని, కానీ ‘పూర్తి భిన్నమైన కారణాల’తో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్టీపిన్ ఫైల్స్, అదానీ కేసులపై ప్రధాని ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంటుకు వచ్చేందుకు కూడా మోడీ భయపడుతున్నారని, బుధవారం పార్లమెంటులో ఆయన కుర్చీ ఖాళీగా ఉండటం అందరం చూశామని అన్నారు. ప్రజలకు ఆందోళన చెందవద్దని చెబుతున్నారని, కానీ ఆయన ఆందోళనకు గురువుతన్నారన్నది స్పష్టమౌతోందని అన్నారు.



