– ప్రభుత్వ విప్, ఆలేరు ఏమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పై పూర్తి అవగాహన చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు గ్రామాలలో, వార్డులలో అందించి జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, చైర్ పర్సన్ లపై ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు.
గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని వి- కన్వెన్షన్, న్యూ వివేరా లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచులకు, చైర్ పర్సన్ లకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముందుగా రాష్ట్ర గేయం వందేమాతరం గీతాన్ని ఆలపించారు
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కొనసాగుతుందని , సర్పంచులు, వార్డు మెంబర్లు, చైర్ పర్సన్ లు గ్రామాలలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి అమలు చేసేలా చూడాలన్నారు. గత రెండు సంవత్సరాల వ్యవధిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ,200 యూనిట్లు ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని గ్రామాలను అందంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టాలన్నారు. అవసరమైన నీరును ఆలేరు నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపడం జరిగిందన్నారు. రాబోవు కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రామాలలో, పట్టణాలలో నీటి ఎద్దటి లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) మాట్లాడుతూ… ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యశరణ ప్రణాళికను నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సర్పంచులు అవగాహన కలిగి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, ఐదు సంవత్సరాల పాలనకు మంచి సహకారం ప్రజలకు అందించాలన్నారు. ప్రజలు మెచ్చేలా అభివృద్ధి పనులు గ్రామాలలో, పట్టణాలలో చేపట్టాలున్నారు. ప్రభుత్వ పథకాలను అవగాహన చేసుకుని వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకొని గ్రామాలు అభివృద్ధి పథంలో ఉంచాలన్నారు.
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచులు వార్డు మెంబర్లు ప్రజలకు ఏ సమస్య ఉందో తెలుసుకుని వారికి అవసరమైన సాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు ,ఇతర అభివృద్ధి పనులను గ్రామాలలో చేపట్టాలన్నారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అవుతున్నందున 5 ఏళ్ల పాలన సజావుగా నిర్వహించి ప్రజలకు మెచ్చి నచ్చి నట్టుగా సేవలు అందించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు అర్హులైన ప్రతి పేదవారికి అందించే బాధ్యత గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, చైర్ పర్సన్ లదేనని అన్నారు. సాగునీటికి అన్ని చెరువులను నింపుకున్నామని ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఏ సమస్య ఉన్న పరిష్కరించే బాధ్యత నాదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యం, పరిశుభ్రత పాటించినట్లయితే గ్రామాలు చాలా అందంగా తీర్చిదిద్దబడతాయి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 ప్రధాన అంశాలను గ్రామాలలో, వార్డులలో సమస్యలు తీర్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. నీటి ఎద్దడి లేకుండా ఎండలు దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలు వేసుకొని మీ మీ గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలన్నారు. గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజలకు అన్ని సదుపాయాలను గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధి పనులు చేపట్టి స్వయం సభివృద్ధి సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
సెర్ప్ సి.ఈ. ఓ, పంచాయతీ రాజ్ కమీషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రజా పాలన వచ్చినప్పటినుండి ఎన్నో అభివృద్ధిలు చేపట్టామన్నారు. తరతరాలుగా గుర్తుండే విధముగా అభివృద్ధి పనులు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పట్టుదలతో అభివృద్ధి పనులు చేపడితే ఎలా అయినా విజయం సాధించవచ్చన్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవాలని, గ్రామాలలో వార్డులలో కానీ గెలుపొందిన వారు మార్పు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నుండి 15 వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్ కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, అట్టి నిధులు గ్రామాలలో, కానీ పట్టణాల్లో కానీ దీనికి ఉపయోగిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రణాళిక వేసుకొని నిధులు వృధా చేయకుండా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాలలో నూతన అంగన్వాడీ, తదితర అవసరమైన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. పచ్చదనం స్వచ్ఛందనంగా గ్రామాలు తీర్చిదిద్ది, శానిటేషన్ విధులు నిర్వహించే సిబ్బంది మంచిగా పని చేస్తే గ్రామం మంచిగా తీర్చిదిద్దుతారని అన్నారు. గ్రామాలు,పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి అవసరమైన అవగాహన అందించేందుకు నూతన వార్డు సర్పంచులు, వార్డ్ మెంబర్లు, చైర్ పర్సన్ లు లకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలను , పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్దిదారుల ఎంపిక, ప్రభుత్వ పని తీరు లో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవాలన్నారు.ప్రతి శాఖ సంబంధించి పని తీరు ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో తెలుస్తుందని, ప్రజా ప్రతినిధులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు.
ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా జిల్లాలో ప్రమాద నివారణకు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాలలో పట్టణాలలో రాష్ డ్రైవింగ్, వేరే హెల్మెట్,నో డ్రగ్స్ తదితర అంశాల గురించి ప్రజలకు ,ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు విధిగా అవగాహన కల్పించాలన్నారు. ప్రణాళికలోని 10 ప్రధాన అంశాలను జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లాలోని అన్ని మండలాల చైర్మన్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.



