– ఇళ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయండి
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు
– కాకర్లపల్లిలో ఇళ్ల స్థలాల పోరాట సాధన సదస్సు
నవతెలంగాణ-సత్తుపల్లి
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాటం ఆపేది లేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో పాలకులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడం జరుగుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు స్పష్టం చేశారు. ఐద్వా మండల కార్యదర్శి జాజిరి జ్యోతి అధ్యక్షతన మండలంలోని కాకర్లపల్లిలో నిర్వహించిన ‘ఇళ్ల స్థలాల పోరాట సాధన సదస్సు’లో వెంకట్రాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాకర్లపల్లి గ్రామ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను మట్టితో పూడ్పించగా తేలే 34 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాలకు పంచాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రుల వరకు ఎన్నిసార్లు విన్నవించినా పాలకుల్లో కనికరం లేకపోవడం శోచనీయమన్నారు.
కాలువ పూడ్పించి పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. పేదల న్యాయమైన హక్కుల కోసం ఐద్వా, వ్యకాస ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా ధర్నాలు, పాదయాత్రలు, రిలే నిరాహార దీక్షలు, ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడి వంటి అనేక ఆందోళనలు చేపట్టామని, అయినా పాలకులకు కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేస్తున్న క్రమంలో పేదలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో మహిళలు విరోచితంగా ఇళ్ల స్థలాల సాధన ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనడంపై ఆయన అభినందించారు. జిల్లా సాధన కోసం జరిగే పోరాటానికి వ్యకాస రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడి పేదల ఇళ్ల స్థలాల సమస్యను వివరిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సదరు ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసి ఆక్రమిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ సదస్సులో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, వ్యకాస జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ, కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ నాయకులు మోరంపూడి పాండురంగారావు, కొలికిపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, బండి వేలాద్రి, కువ్వారపు లక్ష్మణరావు, తడికమళ్ల రామకృష్ణ, కొప్పుల చిన్నస్వామి, దాట్ల రాంబాబు, ఆంగోతు చిట్టెమ్మ, పరిమి సీతామహాలక్ష్మి, బెజవాడ లక్ష్మీనారాయణ, ప్రజానాట్యమండలి నాయకులు షేక్ ఇమామ్ సాహెబ్, కండే సత్యం అయినంపూడి సనందనరావు, మిట్టపల్లి నాగమణి అలివేలు, స్థానిక ప్రజాసంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




