Sunday, July 19, 2026
E-PAPER
Homeమానవిప్రయాణిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ప్రయాణిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

- Advertisement -

గిరిజ పైడిమర్రి… జీవితంలో ఆరుపదుల మైళ్లు దాటిన గిరిపుత్రిక ఆమె. పేరుకు తగ్గట్టే గిరులంటే అమితమైన ఆసక్తి. ఉద్యోగ విరమణ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఈమె మాత్రం దేశమంతా గిరగిరా తిరిగేస్తున్నారు. ఏడు సార్లు హిమాలయాల అందాలను ఆస్వాదించిన ట్రెక్కర్‌. యాత్ర అంటే కేవలం అక్కడి ప్రాంతాలను చూసి రావడమే కాదు అక్కడి చరిత్ర, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడం, స్నేహసంబంధాలు నెలకొల్పుకోవడమే అంటున్న ఆమె ఇటీవలె తన యాత్రా అనుభవాలను ‘గిరిగమనం’ పేరుతో ఓ పుస్తకంగా తీసుకొచ్చారు. అంతే కాదు ఆమె చేస్తున్న సాహస యాత్రలకు గుర్తుగా ప్రముఖ ట్రెక్కర్‌ ఎమ్మా గేట్‌ ‌వుడ్‌ అవార్డును అందుకున్నారు. ఈ ‌సందర్భంగా ఆమెతో మానవి సంభాషణ…

మీరు పుట్టిపెరిగిన వాతావరణం గురించి చెబుతారా?
మా సొంతూరు మెదక్‌ ‌జిల్లా, శంకరం పేట. పాఠశాల విద్య అక్కడే పూర్తి చేశా. అమ్మ వెంకటలక్ష్మి గృహిణి, నాన్న లక్ష్మీనారాయణ శాస్ర్తీ, స్కూల్‌ ‌టీచర్‌. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం మాది. నాకు నలుగురు అన్నయ్యలు, ఒక అక్క. నాన్న స్కూల్‌ ‌టీచర్‌ అయినప్పటికీ కట్టుబాట్లు ఎక్కువ. ఆడపిల్లలకు పెద్దమనిషి కాకముందే పెండ్లి చేస్తే కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుందని నమ్మేవారు. అందుకే మా అక్కకు పెద్దమనిషి కాకముందే పెండ్లి చేశారు. నాక్కూడా ఏడో తరగతిలోనే పెండ్లి చేయాలనుకున్నారు. అయితే పెండ్లి సంబంధం చూడటానికి వచ్చిన అబ్బాయి బీఎస్సీ చదువుతున్నాడు. అది తెలిసి కోర్సుల గురించి, సబ్జెక్టుల గురించి చాలా ఆసక్తిగా అడిగాను. దాంతో అతను ‘మీ అమ్మాయికి చదువంటే చాలా ఇష్టం, ఈ పెండ్లి సంబంధం వద్దు’ అని కబురు పంపించాడు. ఆ సంబంధం అలా ఆగిపోయి చదువు కొనసాగించాను.

కట్టుబాట్ల మధ్య మీ చదువు ఎలా కొనసాగింది?
ఫెయిల్‌ అయితే పెండ్లి చేస్తారనే భయంతో బాగా చదివేదాన్ని. పీజీ పూర్తయ్యే వరకు చదువు కోసం నా పొరాటం సాగుతూనే ఉంది. అప్పట్లో మా అన్నలందరూ హైదరాబాద్‌‌లో ఉండేవాళ్లు. వాళ్లందరికీ వంట చేసి పెడుతూ ఈవినింగ్‌ ‌కాలేజీలో చదువుకున్నా. మా అన్నయ్యకు సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో జాబ్‌ ‌వచ్చింది. దాంతో డిగ్రీ తర్వాత అందులోనే అప్లయ్‌ ‌చేసి ఎంఏ తెలుగు, ఎంఫిల్‌ ‌పూర్తి చేశా. కాలేజీ రోజుల్లోనే కమ్యూనిస్టు భావాలు కలిగిన విద్యార్థులతో పరిచయమయింది. ప్రశ్నించడం అలవాటయింది. మేము నలుగురం స్నేహితులు ఉండేవాళ్లం. అందరం కులాంతర వివాహాలు చేసుకోవాలని అనుకున్నాం. అలా డిగ్రీలో పరిచయమైన కృష్ణను కులాంతర వివాహం చేసుకున్నాను.

సాహిత్యంతో మీ పరిచయం?
నేను చదువుకుంది మొత్తం సాహిత్యమే కావడంతో ఇటువైపు ఆసక్తి పెరిగింది. అప్పట్లో పరిషత్‌ ‌హాల్లో జరిగే ప్రతి సమావేశంలో పాల్గొనేదాన్ని. అభ్యుదయ సాహిత్య కారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. పుస్తక సమీక్షలు, వ్యాసాలు బాగా రాసేదాన్ని. 1984లో ప్రభుత్వ టీచర్‌‌గా చేరాను. ఆ తర్వాత రెండేండ్లకు పెండ్లి. ఇక కుటుంబం, ఉద్యోగం, పిల్లల బాధ్యతతో రాయడం బాగా తగ్గిపోయింది. ఎదిరించి పెండ్లి చేసుకోవడం వల్ల ఎటువైపు నుండీ సహకారం లేదు. దాంతో అన్నీ నేనే చూసుకోవలి. పిల్లలు కాస్త పెద్దగైన తర్వాత మళ్లీ రాయడం మొదలుపెట్టాను. ఓ ప్రతికకు 50 వారాల పాటు ‘పుస్తకం’ అనే పేరుతో పుస్తక సమీక్షలు చేశాను.

​ట్రెక్కింగ్‌ ‌చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
మొదటి నుండి ప్రయాణాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఊళ్లో పొలాలకు వెళ్లడం, గుట్టలు ఎక్కడం అలవాటు. కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ప్రతి ఏడాది టూర్‌‌కి వెళ్లే వాళ్లం. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఏడాది స్కూల్‌ ‌పిల్లల్ని తీసుకొని టూర్‌‌కి వెళ్లేవాళ్లం. అలాగే ఫ్యామిలీతో పాటు కూడా వెళ్లేదాన్ని. ప్రయాణాలే కాదు ట్రెక్కింగ్‌ ‌కూడా చేసేదాన్ని. మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడే తలకోన వెళ్లాను. అలాగే మా పెద్దబాబుకు ఏడాదిన్నర ఉన్నప్పుడు రాజస్తాన్‌, ఎల్లోరా కేఫ్‌‌లకు తీసుకెళ్లాను. ఇక రిటైర్‌మెంట్‌ ‌తర్వాతైతే ప్రతి నెలా కచ్చితంగా ఎక్కడో ఒక దగ్గరకు వెళుతూనే ఉన్నాను.

​మహిళలు ఇలాంటి ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారంటారా?
సాధారణంగా మహిళలపై కట్టుబాట్లు ఎక్కువ. బయటకు వెళ్లాలనే కోరికున్నా ఎవరేమనుకుంటారో అనే భయం. వెళితే భర్తలతో పాటే వెళ్లాలి. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు కావల్సినవన్నీ చేయాలి. అలాగే వయసు పెరిగిన తర్వాత నడవలేము, మోకాళ్ల నొప్పులు అని అడుగు బయటపెట్టరు. కానీ నిజానికి మన శరీరం ఎంత కదులుతుంటే అంత ఉత్సాహంగా ఉండగలం. ఎంత బయటకు వెళితే అంత ఆరోగ్యం. ఇదే నేను నా ‘గిరిగమనం’లో రాశాను. మహిళలు బయటకు అడుగుపెట్టాలి అనేదే నా ఉద్దేశం. ట్రెక్కింగ్‌ ‌చేయడం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెడతాం. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాం. ప్రయాణాల వల్ల మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక రొటీన్‌ ‌లైఫ్‌ ‌నుండి బయటపడతాం కాబట్టి అది మనలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మహిళలు కచ్చితంగా ప్రయాణం చేయాలి. అది చిన్నదైనా పెద్దదైనా.

​ఎటువంటి ప్రదేశాలకు వెళతారు?
ప్రత్యేకంగా దీనికే వెళ్లాలి అని అనుకోను. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడకు వెళ్లిపోతాను. ఎవరైనా ఈ ప్లేస్‌ ‌బాగుంటుంది అంటే ఇక వెళ్లిపోతాను. అది ప్రకృతికి సంబంధించినదైనా ప్రకృతినైనా ఎంజాయ్‌ ‌చేస్తాను. ట్రెక్‌ అయితే ముందు నుండే కాస్త ప్రిపేర్‌ ‌చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు తక్కువ లగేజ్‌ ‌తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. హిమాలయాలకు దాదాపు ఏడు సార్లు వెళ్లాను. మన దేశం నుండి ఏఏ రాష్ర్టాల నుండి హిమాలయాలకు వెళ్లే మార్గాలున్నాయో అన్నింటినీ కవర్‌ ‌చేశాను. ఎన్ని సార్లు వెళ్లినా మళ్లీ వెళితే కొత్తగా అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్న గొప్పతనమే అది.

​మీరు ఎక్కువగా ట్రెక్కింగ్‌ ‌చేస్తారనుకుంటా?
అవును, ట్రెక్కింగ్‌‌కి వెళ్లినప్పుడు టీంలో అందరూ చాలా సహాయసహకారాలు అందిస్తారు. స్నేహభావంతో ఉంటారు. అందుకే నేను ఎక్కువగా ట్రెక్కింగ్‌‌కి వెళ్లడానికే ఇష్టపడతా. నేను ఒకసారి తుంబురి తీర్థం పోయినప్పుడు బ్యాక్‌ ‌పాకెట్‌ ‌మొత్తం తడసిపోయింది. నాకు వర్టిగో సమస్య ఉంది. నా టాబ్లెట్లు తడిసిపోయి వేసుకోలేకపోయాను. తిరిగి వచ్చేటప్పుడు ఓ కొండ మలుపు వద్ద కళ్లు తిరుగుతుంటే నడవలేక ఆగిపోయాను. అప్పు డే అక్కడ పరిచయం అయిన ఒక అబ్బాయి ఏమైంది మేడమ్‌ అని అడిగాడు. నా సమస్య చెప్పి కొండ వాలు దాటే వరకు నా చెయ్యిపట్టు కుంటారా అంటే వెంటనే నా చెయ్యి పట్టుకొని నడిపించడమే కాదు, ఆ ట్రిప్‌ ‌ముగిసే వరకు అన్ని విధాలుగా హెల్ప్‌ ‌చేశాడు. ఇలా ట్రెక్స్‌‌లో అందరూ మానవవిలువతో ఉంటారు. అందుకే నాకు ట్రెక్కింగ్‌ అంటే చాలా ఇష్టం.

మీ ‘గిరిగమనం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు?
మహిళలను ప్రయాణం చేయమని చెబుతున్నాను. ట్రెక్కింగ్‌ ‌చేయమని అంటాను. చాలా మంది ఇది ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ ఒక్కరోజు ప్రయాణం నుండి పదిరోజుల ప్రయాణం వరకు చేయవచ్చు. మన పరిస్థితులను బట్టి తక్కువ ఖర్చుతో కూడా వెళ్లొచ్చు. హైదరాబాద్‌‌లోని మౌలాలి కొండ కూడా ఎక్కొచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు ఒంటరిగా చేయడం, ట్రక్కింగ్‌ ‌చేయడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ట్రెక్‌ ‌చేసిన ప్రతీసారి నా వయసు పదేండ్లు తగ్గిన భావన వస్తుంది. ఇవన్నీ మహిళలకు చెప్పాలనే ‘గిరిగమనం’ తీసుకొచ్చాను.

సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -