కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోందని సీఐటీయూ పేర్కొంది. అందువల్ల కేరళం తరహాలో వాటిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలనీ, ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళం రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయబోమంటూ తీర్మానం చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు సవరించకుండా కాలయాపన చేయడం వల్ల సుమారు కోటి మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2024 జనవరిలో డ్రాఫ్ట్‌లు ఇచ్చి పెండింగ్‌లో పెట్టిందని పేర్కొన్నారు. ఇది జరిగి రెండేండ్లు గడిచినా వేతనాలు సవరించకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లు గడిచినా వేతన సవరణ చేయలేదని తెలిపారు.
2023 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలనీ, వారి సర్వీసులు క్రమబద్ధీకరించాలనీ, పెన్షనర్ల, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు పూర్తిగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరారు. స్కీం వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెేపీ వివోఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, నేషనల్ హెల్త్ మిషన్, మిషన్ భగీరథ తదితర ఉద్యోగులకు కనీస వేతనం రూ.26వేలకు తగ్గకుండా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయాలనీ, గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు కేటగిరీ వారీగా వేతనాలు చెల్లించాలనీ, పర్మినెంట్ చేయాలనీ, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
ప్రస్తుతం పనిచేస్తున్న 3,797 మంది వీఆర్ఎల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలివ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సీఏసీసీి హెల్త్ టెస్టులను రద్దు చేయాలనీ, వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకిచ్చిన అనుమతులను ఉపసంహరిం చుకోవాలని కోరారు. హమాలీలకు, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్‌కు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, రూ. ఏడు లక్షల మంది బీడీ కార్మికుల వేతనం పెంచాలని కోరారు. అన్నిరకాల హాస్టల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలనీ, విద్యుత్ రంగంలో ఆర్టిజెన్ల సర్వీసులను కన్వర్షన్ చేయాలనీ, ఆర్టీసీ ప్రయివేట్ వారికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వకుండా ఆర్టీసీకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడో బడ్జెట్ పెడుతున్నారని రాములు, భాస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు చేశారని వాటిపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.



