కరీంనగర్‌లో మూడ్రోజులుగా దట్టమైన పొగతో జనం ఉక్కిరిబిక్కిరి
డంప్‌యార్డులో మంటలు
అమలుకాని కేంద్రమంత్రి ఖట్టర్ హామీ
మేయర్ పీఠాన్ని అప్పగించినా జాడలేని కేంద్రమంత్రి బండి సంజయ్
ముఖం చాటేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్
పరిష్కారం దిశగా ‘బయోమైనింగ్’పనులు
కొత్తగా కమిషనర్ ‘జులై’ గడువు !
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉదయం ఎనిమిది గంటలు.. భానుడు అప్పుడప్పుడే సెగలు కక్కుతున్న సమయం. కానీ కరీంనగర్ నగర ముంగిట మాత్రం పొగమంచును తలపించే దట్టమైన పొగ! కొత్తగా నగరానికి వచ్చే వారు ఈ ఎండల్లో మంచు ఎక్కడిదా? అని ఆశ్చర్యపోయే లోపే.. అది డంప్‌యార్డ్ నుంచి వస్తున్న విషవాయువు అని తెలిసి ముక్కులు మూసుకుంటున్నారు. దశాబ్దాలుగా నగరాన్ని వేధిస్తున్న డంప్‌యార్డ్ సమస్య ఇప్పుడు పరాకాష్టకు చేరింది. స్మార్ట్ సిటీగా మారుతుందనుకున్న కరీంనగర్, ఇప్పుడు ‘స్మోక్ సిటీ’గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
డంప్‌యార్డులో నిత్యం రగులుతున్న మంటలు నగరాన్ని మరో ఢిల్లీగా మారుస్తుంటే, పాలకులు మాత్రం కేవలం హామీలకే పరిమితమవుతున్నారు. ఏడాది కిందట కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఇచ్చిన గడువు దాటిపోగా.. తాజాగా రాష్ట్ర మంత్రి పొన్నం సైతం మరో ఏడాదిలో తొలగిస్తామని చెప్పారు. మరో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ సమస్య తనది కాదన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల బయోమైనింగ్ పనులు ప్రారంభించిన మున్సినపల్ కమిషనర్ జులైలోగా పూర్తి చేస్తామని చెప్పినా.. ఆ గడువుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిత్యం మూడు సిగరెట్లు తాగినంత కాలుష్యం!
కరీం’నగరం’లోని 66 డివిజన్ల నుంచి రోజూ వచ్చే 160 మెట్రిక్ టన్నుల చెత్త, 50 ఏండ్లుగా మానేరు ఒడ్డున కొండలా పేరుకుపోయింది. దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గుట్ట ఎండాకాలంలో ‘రావణకాష్టం’లా మండుతూనే ఉంది. నగరంలోని డంప్‌యార్డు నుంచి వెలువడే పొగ కేవలం అసౌకర్యానికే కాదు, ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతోంది. ఏఐక్యూ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) గణాంకాల ప్రకారం.. ఇక్కడి గాలిని పీల్చడం అంటే రోజుకు మూడు సిగరెట్లు కాల్చడంతో సమానమని తేలడం ఆందోళన కలిగిస్తోంది.
అల్గునూర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, అల్కాపురి, హనుమాన్‌నగర్, గాయత్రినగర్, హౌజింగ్‌బోర్డు కాలనీ సహా దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రభావిత ప్రాంతాల్లో ఈ పొగ విస్తరిస్తోంది. డంప్‌యార్డును అనుకుని ఉన్న ఆటోనగర్‌లోని దాదాపు 200కు పైగా షాపులు పొగ కారణంగా తెరవలేని పరిస్థితి నెలకొంది. కార్మికులు పనులకు వచ్చేందుకు జంకుతున్నారు.
కదులుతున్న చెత్త గుట్ట..
గతంలో ప్రారంభించిన రూ.16 కోట్ల బయోమైనింగ్ పనులు నత్తనడకన సాగి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుత నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సరికొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య మున్సిపల్ కమిషనర్ సరికొత్త కార్యాచరణతో ముందుకు రావడం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మూడు వేర్వేరు ప్లాంట్ల ద్వారా రోజుకు 2 వేల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి, జులై నాటికి డంప్‌యార్డ్‌ను ఖాళీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. డీజిల్‌తో నడిచే మొబైల్ బయోమైనింగ్ యంత్రాలను ఉపయోగించి బయో సాయిల్, ఇనర్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తున్నారు. జులై నాటికి పూర్తిస్థాయిలో చెత్తను క్లియర్ చేసి.. బయో సాయిల్, ప్లాస్టిక్, ఆర్‌డీఎఫ్ వంటి మూడు రకాలుగా విభజించి నగరాన్ని క్లీన్‌గా ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెబుతున్నారు.
‘డంప్‌యార్డ్ హఠావో – కరీంనగర్ బచావో’
‘పనులకు వెళ్లలేకపోతున్నాం.. షాపులు తెరవలేక పోతున్నాం.. పొగతో శ్వాస తీసుకోవడం నరకంగా మారింది’ అని ఆటోనగర్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా ఈ డంప్‌యార్డ్ కారణంగానే నిలిచిపోయాయనే వాదన వినిపిస్తోంది. శ్రీవరసిద్ధి వినాయక సొసైటీ పేరుతో స్థానిక ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సారైనా పాలకుల హామీలు కార్యరూపం దాల్చుతాయా? లేక కరీంనగర్ వాసులు ఈ విషవాయువుల మధ్యే మగ్గి పోవాలా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రాజకీయ చదరంగంలో డంప్‌యార్డ్
ఎన్నికల వేళ ప్రతి పార్టీకీ డంప్‌యార్డు సమస్య ఒక ప్రధాన అస్త్రంగా మారుతోంది. గతంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఏడాదిలో తొలగిస్తామని హామీ ఇచ్చారు. అది నేటివరకూ ఆచరణ లేదు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా హామీల వర్షం కురిపించాయి. మేయర్ పీఠాన్ని తమకు అందిస్తే కేంద్ర నిధులతో సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందని ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం బీజేపీకి పట్టగట్టారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి సంజయ్ మళ్లీ జాడలేడు. కాగా, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెండ్రోజుల కిందట ఇక్కడ పర్యటించి, ఏడాదిలోగా వరంగల్-కరీంనగర్ మధ్య అనువైన స్థలాన్ని చూసి శాశ్వతంగా డంప్ యార్డును తరలిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని ప్రకటించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సైతం చొప్పదండి సభలో హామీ ఇవ్వడంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.



