Friday, March 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడల్‌ కాలనీగా 'వెలుగుమట్ల'ను తీర్చిదిద్దుతాం

మోడల్‌ కాలనీగా ‘వెలుగుమట్ల’ను తీర్చిదిద్దుతాం

- Advertisement -

ఉగాదిలోపు విద్యుత్‌ సరఫరా పనులు పూర్తి
పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో 38 ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఖమ్మం

తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్‌ కాలనీగా వెలుగుమట్లను తీర్చి దిద్దుతామని వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో 38 ఇండ్ల నిర్మాణ పనులకు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాస రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పేదరికం ఆసరా చేసుకొని ధనార్జన కోసం దళారులను అడ్డుపెట్టి ఇతర జిల్లా, రాష్ట్రాల వారిని రెచ్చగొట్టి ఫేక్‌ డాక్యుమెంట్‌లతో పేదలకు మోస పూరితంగా భూమి అప్పగించారని అన్నారు.

1953లో ఆసామి 31 ఎకరాల 7 గుంటల భూమి దానం చేశారని తెలిపారు. గత ఎనిమిదేండ్లలో అనేక సమస్యలు పేదలు ఎదుర్కొన్నారని, తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి సదుపాయాలు లేకుండా బాధలు పడ్డారని అన్నారు. కరెంట్‌, మంచి నీరు ప్రతి అంశానికి డబ్బులు డిమాండ్‌ చేస్తూ మాఫియా నడిపించారని తెలిపారు. పేదలను దిన దిన గండం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని అన్నారు. భూదాన్‌ భూములు ఆక్రమించుకోవాలని సీసీఎల్‌ఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూల్చి వేతలు జరిగాయని తెలిపారు. మోడల్‌ కాలనీగా వెలుగు మట్లను తీర్చిదిద్దుతామని, డిసెంబర్‌ 9 నాటికి కాలనీ పూర్తి చేస్తామని చెప్పారు.

పేదలకు పంచిన తర్వాత మిగిలిన భూమిలో స్కూల్‌, కమ్యూనిటీ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. నిరుపేదలకు సున్నా వడ్డీతో రుణాలు అందిస్తామని అన్నారు. ఇంటి నిర్మాణంలో హౌసింగ్‌ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలి పారు. వెలుగుమట్ల లే అవుట్‌లో కరెంటు పోల్స్‌, విద్యుత్‌ సరఫరా పనులు యుద్ధ ప్రాతిపదికన ఉగాదిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి పైప్‌ లైన్‌ పనులు చేపట్టాలన్నారు. దళారులకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారనే వివరాలు పోలీసు అధికారులకు అందించాలని తెలిపారు. ప్రజలను మోసం చేసిన ఎవరిని విడిచి పెట్టే సమస్య లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రంజిత్‌, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -