బాలేంద్ర షా నేతృత్వంలో ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆయననే ప్రధానిగా ప్రకటిస్తామన్న ఆర్‌ఎస్పీ
ఖాట్మండ్ : నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మొత్తం 165 ప్రత్యక్ష స్థానాల్లో 125 సీట్లను గెలుచుకొని దాదాపు మూడింటా రెండు వంతుల మెజారిటీని సాధించిన విషయం విదితమే. దీంతో ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఖాట్మండు మాజీ మేయర్ అయిన బాలేంద్ర షా దేశ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం దాదాపు ఖాయమైంది. ఈనెల 5న నేపాల్‌లో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆర్‌ఎస్పీకి స్పష్టమైన ప్రజా మద్దతు లభించింది. ఆ పార్టీ నాయకుడు శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. పార్టీ పార్లమెంటరీ నేతగా బాలేంద్ర షానే ఎంపికవుతారని చెప్పారు. ఆయననే ప్రధాన మంత్రిగా ప్రకటిస్తామని చెప్పారు. నేపాల్‌లో జరిగిన ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించాయి.
మాజీ ప్రధాని కె.పి. ఓలీ సహా పలువురు ప్రముఖులు ఓటమిని చవి చూశారు. ఇది నేపాల్‌లో ఒక భారీ రాజకీయ మార్పుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో యువత ప్రభావం స్పష్టంగా కనిపించింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన జెన్-జెడ్ ఉద్యమం తర్వాత నేపాల్‌లోని పాత రాజకీయ పార్టీలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అక్కడ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్పీ భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగాయి. ఇక్కడ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారనీ, అందుకే ఓటర్లు ఆర్‌ఎస్పీకి భారీ మద్దతు పలికారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక్కడి ఎన్నికల్లో నేపాలి కాంగ్రెస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచినా… దాని ప్రముఖ యువ నాయకుడు గగన్ థాపా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇక జెన్-జెడ్ ఉద్యమంలో పాల్గొన్న 26 ఏండ్ల మనీశ్ ఖనాల్ వంటి యువత అభ్యర్థులు మాత్రం గెలిచారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం, పారదర్శక పాలన, అవినీతి నిర్మూలన కోరుకుంటూ ఎన్నికల్లో తీర్పునిచ్చారని కొత్తగా ఎన్నికైన ఎంపీ టోసిమా కార్కి చెప్పారు. కాగా కొత్త ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే ఐదేండ్ల తర్వాత మళ్లీ ఓడించేందుకు తాము సిద్ధంగా ఉంటామని నేపాలీ ప్రజలు, యువత స్పష్టం చేస్తున్నారు. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 మంది సభ్యులు ఉంటారు. అందులో 165 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, 110 మంది పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఆధారంగా ఎన్నికవుతారు. ఈ ఎన్నికల్లో ఆర్‌ఎస్పీ రెండింటిలోనూ అత్యధిక మద్దతు పొందింది. మొత్తంగా రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికలను నేపాల్ రాజకీయాల్లో పాత పార్టీల యుగానికి ముగింపుగా, యువ నాయకత్వానికి ఆరంభంగా అభివర్ణిస్తున్నారు.
నేపాల్‌లో కొత్త ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



