కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ ఆర్టీసీలకే ఇచ్చి పరిరక్షించాలి
మార్చి 24న అన్నీ డిపోల వద్ద సీఐటీయూ ధర్నాలు
రాష్ట్ర సదస్సులో పాలడుగు భాస్కర్ పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల విధానంతో ఆర్టీసీ మనగడ ప్రమాదంలో పడనుందని సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ విషయంలో ప్రయివేటు కార్పొరేట్ కంపెనీలే చూడటం వల్ల సమస్యలు ఉ ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఆర్టీసీలకు ఎటువంటి పాత్ర ఉండదనీ, ప్రతినెలా విద్యుత్ బస్సుల కంపెనీకి డబ్బులు చెల్లించడం మాత్రమే ఆర్టీసీ చేస్తుందని గుర్తు చేశారు. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ” విద్యుత్ బస్సులు- ఆర్టీసీ, ప్రజలు, కార్మికులపై ప్రభావం ” అనే అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది.
ఈ సదస్సును ప్రారంభించిన పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర అనుభవం చూస్తే రోజుకు సుమారు రూ. 50 లక్షల మేర ప్రజలపై భారం మోపారని గుర్తు చేశారు. ఇటీవలి సీఎం ప్రకటన ప్రకారం హైదరాబాద్ నగరంలోని అన్ని బస్సులు విద్యుత్ బస్సులుగా మారితే ఈ భారం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ బస్సులకు మౌలిక వసతుల కల్పన పేరుతో ఆర్టీసీ డిపోలో ఉన్న భూములను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి సీఐటియూ వ్యతిరేకిస్తుందన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ విస్తరణ కోసం కొత్త బస్సు డిపోలు ఏర్పాటు సాధ్యం కాదన్నారు.
ఆర్టీసీలోని యూనియన్లపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు. కానీ అధికారం లోకి వచ్చి రెండేండ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ బస్సుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించాలని సూచించారు. విద్యుత్ బస్సుల పెంపు మూలాన డ్రైవర్లు, మెకానిక్‌లు మిగులు తేలి వారి ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని చెప్పారు. ఈ విషయంలో ప్రయివేటు భూతాన్ని యూనియన్లకు అతీతంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ విధానంలో మార్పు, ఆర్టీసీ పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన, మహిళలు అందరినీ కలుపుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ కొరకు మార్చి 24న అన్ని డిపోల వద్ద సీఐటీయూ ధర్నాలు చేస్తుందని ప్రకటించారు.
సదస్సులో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఎస్ రావు, తీర్మానం ప్రవేశపెట్టారు. ఇంకా ఈ సదస్సులో డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ప్రజా రవాణాను నిర్వీర్యం చేస్తే డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్ ప్రసంగిస్తూ విద్యుత్ బస్సుల పేరుతో ప్రజలపై విద్యార్థులపై అదనపు భారం వేయటాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో ఆర్టీసీ కార్మికుల పోరాటానికి విద్యార్థి సంఘంగా మద్దతు తెలియజేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో పోరాటానికి మద్దతుగా ఉండి ఆర్టీసీని రక్షించుకుంటామన్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విద్యుత్ బస్సుల పేరుతో ఇప్పటికే నాలుగు డిపోల మూసివేతకు నిర్ణయం చేసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక వర్గం పోరాడుతుందన్నారు. విద్యుత్ బస్సుల విధానం మార్పు కొరకు కరపత్రాలు బుక్లెట్స్ ద్వారా చైతన్యం చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీని రక్షించుకోవడానికి ప్రజలతో కలిసి పోరాడుతామని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ ఎస్‌డబ్లూఎఫ్ చేపట్టబోయే పోరాటాలకు ఏపీఎస్‌డబ్ల్యూఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వివరించారు. సదస్సుకు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షత వహించగా ప్రచార కార్యదర్శి పి రవీందర్‌రెడ్డి నాయకులు సత్తిరెడ్డి, కృష్ణ, సుధాకర్, గీత, ప్రభాకర్, చంద్ర ప్రకాష్, ఉపేంద్ర చారి, శ్రీనివాస్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.



